ఎరువు దరువు

ABN , First Publish Date - 2022-01-21T05:23:27+05:30 IST

ఇప్పటికే కష్టాలు, నష్టాలు మోస్తు ఆరుగాలం కష్టించి పంట పండించే రైతన్నకు ఎరువుల రూపంలో మరో అదనపు భారం పడింది.

ఎరువు దరువు
దుకాణాలలోని అమ్మకానికి సిద్దంగా ఉంచిన ఎరువులు

- పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు

- జిల్లాలో రెండు సీజన్‌లలో సుమారు 6 లక్షల ఎకరాలలో పంటల సాగు

- ప్రతీ సీజన్‌లో 98వేల మెట్రిక్‌ టన్నుల ఎరువుల వినియోగం

- ఇందులో 20వేల మెట్రిక్‌ టన్నుల వరకు కాంప్లెక్స్‌ ఎరువుల వినియోగం

- జిల్లా రైతులపై ఏటా 27 కోట్ల అదనపు భారం


కామారెడ్డి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ఇప్పటికే కష్టాలు, నష్టాలు మోస్తు ఆరుగాలం కష్టించి పంట పండించే రైతన్నకు ఎరువుల రూపంలో మరో అదనపు భారం పడింది. ఇప్పటికే ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటగా మరోసారి వాటి ధరలను పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకోవడంతో రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులపై ఎరువుల ధరలు దరువు వేస్తున్నాయి. కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను పెంచుతూ కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో రైతులపై మరింత భారం పడనుంది. ప్రతీ సీజన్‌లో జిల్లా రైతులు పంటల సాగు కోసం 20వేల మెట్రిక్‌ టన్నులకు పైగా కాంప్లెక్స్‌ ఎరువులను వినియోగిస్తున్నారు. ఈ కాంప్లెక్స్‌ ఎరువుల ధరల పెంపుతో జిల్లా రైతులపై ప్రతీ ఏటా రూ.27కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. ఎరువుల ధరలు పెంచడంతో పంటలు సాగు చేయలేని పరిస్థితి ఎదురవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల ధరలను తగ్గించాలని అన్నదాతలు, జిల్లా రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

జిల్లాలో 98వేల మెట్రిక్‌ టన్నుల వరకు ఎరువుల వినియోగం

కామారెడ్డి జిల్లాలో వానాకాలం, యాసంగి సీజన్‌లలో లక్షల ఎకరాలలోనే పంటలు సాగు చేస్తుంటారు. వానాకాలం సీజన్‌లో 3.50లక్షల ఎకరాలలో వివిధ పంటలు సాగు అవుతుండగా యాసంగి సీజన్‌లో సుమారు 2.50 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు రైతులు సాగు చేస్తుంటారు. ఈ పంటలకు తగ్గట్టుగా ప్రతీ సీజన్‌లో సుమారు 90వేల మెట్రిక్‌ టన్నుల వరకు వివిధ ఎరువులను రైతులు వినియోగిస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 65వేల మెట్రిక్‌ టన్నుల వరకు యూరియానే వినియోగిస్తుంటారు. మిగితా 20వేల మెట్రిక్‌ టన్నుల వరకు కాంప్లెక్స్‌ ఎరువులను వినియోగిస్తారు. డీఏపీ 12వేల మెట్రిక్‌ టన్నులు, పోటాష్‌ 3వేల మెట్రిక్‌ టన్నుల వరకు వినియోగిస్తున్నారు.

పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి

కాంప్లెక్‌ ్స ఎరువుల ధరలను పెంచుతూ ఆయా కంపెనీలు ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో మార్కెట్‌లోనూ ఎరువుల ధరలను పెంచి వ్యాపారులు విక్రయిస్తున్నారు. 20-20-20-013 రకం ఎరువు ప్రస్తుతం ధర రూ.1200 లు ఉండగా పెరిగిన ధరతో రూ.1,390కి చేరింది. 28-28-0 రకం ఎరువు ప్రస్తుత ధర రూ.1,550 ఉండగా పెరిగిన ధర రూ.1800లకు చేరింది. 10-26-26 రకం ఎరువు రూ.1,475 ఉండగా పెరిగిన ధరతో రూ.1,750కి చేరింది. 14-35-14 రకం ఎరువు ధర రూ.1,550 ఉండగా పెరిగిన ధరతో రూ.1,850కి చేరింది. పొటాష్‌ ప్రస్తుత ధర రూ.1,200లుగా ఉండగా పెరిగిన ధర రూ.1,680కి చేరింది.

ఒక్కో రైతుపై రూ.3వేల వరకు భారం

ప్రతీ ఏటా వానాకాలం, యాసంగి సీజన్‌లలో జిల్లాలో సుమారు 2లక్షల మందికి పైగా రైతులు 6 లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. 20వేల నుంచి 25వేల మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులను వివిధ రకాల పంటలకు వినియోగిస్తున్నారు. కాంప్లెక్స్‌ ఎరువులలో నత్రజని, భాస్వరం, పొటాష్‌, సల్ఫర్‌ ఉంటాయి. వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, మినుములు, కూరగాయాలు ఇతర పంటలకు ఈ ఎరువులను వినియోగిస్తున్నారు. ప్రస్తుతానికి యూరియా, డీఏపీ ధరలలో ఎలాంటి మార్పులు లేకపోయినా ఇతర కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు మాత్రం 50 కేజీల బస్తాకు రూ.125 నుంచి రూ.480 వరకు పెరిగాయి. ఎకరాలకు ఒక్కో రైతుకు రూ.3వేల భారం పడనుంది. మొత ్తం జిల్లా రైతులపై రూ.27కోట్ల అదనపు భారం పడనుంది.

సగం పెట్టుబడి ఎరువులకే..

జిల్లాలో ఎక్కువ కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడ్డాయి. నిజాంసాగర్‌, కౌలాస్‌నాలా, పోచారం సాగునీటి ప్రాజెక్ట్‌లతో పాటు చెరువులు, బోరుబావుల కింద, వర్షాధారం కింద రైతులు పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో ప్రతీ ఏటా లక్షల ఎకరాలలో పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా వరి, మొక్కజొన్న, సోయా, పత్తి, శనగ, పప్పుదినుసు చెరుకు తదితర పంటలను పండిస్తున్నారు. వ్యవసాయ పెట్టుబడిలో భాగంగా ఎక్కువగా ఎరువులు, పురుగుల మందులపైనే వ్యవసాయం చేస్తారు. రసాయనిక ఎరువులు, కాంప్లెక్స్‌ ఎరువులు రెండు రకాలుగా ఉంటాయి. పంటలకు ఎక్కువగా డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులను రైతులు వినియోగిస్తారు. అటు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని రాత్రనక, పగలనక పండించిన గిట్టుబాటు ధర లభించడం లేదు. పైగా పెట్టుబడి చేసిన అప్పులే రైతులకు మిగులుతున్నాయి. పంటల సాగులో ఎక్కువగా పెట్టుబడులు ఎరువులకే ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఎరువుల ధరలు పెరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల పథకాలతో పెట్టుబడి సాయం అందిస్తున్నా ఏటా పెరుగుతున్న ఎరువుల ధరకే సరిపోతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ధరలు తగ్గించాలి

- బత్తుల బాలరాజు, ముత్యంపేట, దోమకొండ

ఇప్పటికే ఏటేటా పంట పెట్టుబడులు పెరుగుతున్నాయి. కూలీల ఖర్చు, ట్రాక్టర్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలతో పెట్టుబడులు తడిసి మోపేడు అవుతున్నాయి. ఇక ఎరువుల పరిస్థితి చెప్పలేనిది. ఇప్పుడు ఎరువుల ధరలు పెరగడం మరింత కష్టంలో పడేసింది. పండించిన పంటలకు అనుకున్న ధరలు వస్తలేవు. ప్రభుత్వాలు ఆలోచించి పెరిగిన ఎరువుల ధరలను తగ్గించాలి.


వ్యవసాయం చేయడం కష్టమవుతోంది

- చిట్యాల రాజిరెడ్డి, దోమకొండ

ఎరువుల ధరలు ప్రతీ ఏటా పెరుగుతున్నాయి. పంటలకు ఎరువులు తప్పక వాడాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో పెట్టుబడులు ఎక్కువవుతున్నాయి. ప్రతీ పంటకు అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇలా ఎప్పటికప్పుడు ధరలు పెరిగిపోతే వ్యవసాయం చేయడం ఇబ్బందిగా మారుతోంది.

Updated Date - 2022-01-21T05:23:27+05:30 IST