అక్రమార్కులకు ఇంపు.. లోతట్టు ప్రాంతాలకు ముంపు

ABN , First Publish Date - 2021-06-11T18:53:09+05:30 IST

పట్టణంలో ప్రధాన కాలువల మరమ్మతుల పనుల్లో ఆక్రమణలు రోజుకోటి వెలుగు చూస్తున్నాయి. కాలువలను మింగిన భవనాలు, అసలు కాలువలును దాటి సాగించిన ఆక్రమణలు పట్టణ

అక్రమార్కులకు ఇంపు.. లోతట్టు ప్రాంతాలకు ముంపు

- కాలువల మరమ్మతులతో బయటపడుతున్న బడాబాబుల లీలలు

- డ్రెయినేజీలపై దర్జాగా భవనాల నిర్మాణం

- ముంపు ప్రాంతాలను ముంచెత్తుతున్న మురుగు

- కొన్ని చోట్ల కాలువలు నిర్మించకుండానే వదిలేసిన అధికారులు


మణుగూరుటౌన్‌(భద్రాద్రి కొత్తగూడెం): పట్టణంలో ప్రధాన కాలువల మరమ్మతుల పనుల్లో ఆక్రమణలు రోజుకోటి వెలుగు చూస్తున్నాయి. కాలువలను మింగిన భవనాలు, అసలు కాలువలును దాటి సాగించిన ఆక్రమణలు పట్టణ ప్రజలను ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. పట్టణంలో ప్రముఖంగా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులు, పేరొందిన వ్యాపారస్థులే కాలువలను ఆక్రమించారని, కొన్ని చోట్ల కాలువను దాటి మరీ ఆక్రమణలు చేశారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. వాటిని తొలగించాల్సిందేనని కొంతమంది వ్యాపారులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతీసారి కాలువల మరమ్మతులు ప్రారంభించగానే ఆక్రమణలకు పాల్పడిన వారికి వత్తాసుగా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యు లు జోక్యం చేసుకోవడం, ఆ తర్వాత విషయం సద్దుమణగడం పరిపాటిగా మారింది. కాలువ ఆక్రమణల ఫలితంగా వర్షాకాలంలో పలుప్రాంతాలు మంపునకు గు రై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది కురిసిన కుండపోత వర్షాలకు పట్టణం చిగురుటాకులా వణికింది. ఇక వరద పోటెత్తడంతో ముంపు ప్రాంతాల ప్రజలు నరకం చూశారు. వాననీటిలో నానుతూ ఇబ్బందిపడ్డారు. కానీ వారి దుస్థితిని పట్టణ వ్యాపారులు పట్టించుకోకుండా ఆక్రమణలకు వత్తాసు పలకడం విస్తుగొలుపుతోంది. 


భవనం లోపలి నుంచి కాలువల శుభ్రం..

డ్రెయినేజీపై నిర్మించిన భవనం లోపలి నుంచి దుకా ణాదారులు కాలువలను స్వయంగా శుభ్రం చేస్తున్నారు. షాపుల ముందు గది మధ్యలో ఓ రంధ్రం ఏర్పాటు చేసి దాని ద్వారా కాలువ పూడికను తీస్తున్నారు. షాపుల యజమానుల చర్యలు ఆక్రమణ విషయాన్ని పక్కదారి పట్టించేలా ఉన్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో బడాబాబులు నాయకులకు, అధికారులకు పైసలను ముట్టచెప్పి ఆక్రమణల తొలగింపును నిలుపు దల చేసినట్టు సమాచారం.


ఓ చోట కాలువనే నిర్మించలేదు

ప్రధాన కాలువల ఆక్రమణల వివాదం ఇలా ఉండగా.. పట్టణంలో ప్రధాన రహదారిపై ఓ సుమారు రెండు వందల మీటర్ల మేర కాలువే నిరించని విషయం వెలుగులోకి వచ్చింది. పట్ణంలో పూలకొట్ల సెంటర్‌లోని బంగారు నగల దుకాణాల లైన్‌ ప్రారంభం నుంచి పాత బయ్యారం బస్టాండ్‌ సమీపంలో వేంకటేశ్వరస్వామి గుడి వరకు అసలు ప్రధాన కాలువే నిర్మించలేదు. నాడు పట్టణంలోని టీడీపీ సెంటర్‌ నుంచి సీహెచ్‌పీ కాటా వరకు  రూ. లక్షల నిధులతో సుమారు పదేళ్ల క్రితం ప్రధాన కాలువ నిర్మాణాలు చేపట్టారు. అప్పటి అధికారులు బడాబాబులు చెప్పిన విధంగా కాలువలు నిర్మించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంగారు నగల దుకాణాల లైన్‌ నుంచి పాత బయ్యారం బస్టాండ్‌ వరకు కాలవను నిర్మించకుండానే నిధులు మింగారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పటి మాదిరిగానే బడాబాబులు, ఎమ్మెల్యే జోక్యంతో మరమ్మతుల పనులు నిలిపివేస్తారమోనన్న పట్టణ ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


ఆక్రమణలు తొలగించాల్సిందే

మణుగూరు పట్టణంలోని కాలువల ఆక్రమణ తొలగింపు ప్రక్రియ ఎప్పుడు ఆరంభశూరత్వంగానే ఉం టోం దని, ఈసారి అయినా కచ్చితంగా తొలగించాల్సిందేనని ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. కాలువల ఆక్రమణలు సక్రమం చేసేందుకు కొంతమంది నా యకులు, అధికారులు విఫల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు వ్యవహర శైలికూడా అనుమానాలను రేకెత్తిస్తోందని అంటున్నారు. ఎప్పటిలాగానే చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యుల మాటలకు తలొగ్గొద్దని ఎమ్మెల్యేకు, కమిషనర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2021-06-11T18:53:09+05:30 IST