హైదరాబాద్‌లో ఎఫ్‌-16 విమాన రెక్కల తయారీ

ABN , First Publish Date - 2021-12-08T09:49:42+05:30 IST

హైదరాబాద్‌ ఏరోస్పేస్‌, రక్షణ రంగాల కిరీటంలో మరో కలికితురాయి చేరింది.

హైదరాబాద్‌లో ఎఫ్‌-16 విమాన రెక్కల తయారీ

  • ప్రదర్శించిన లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఏరోస్ట్రక్చర్స్‌
  • కంపెనీలు మళ్లీ, మళ్లీ పెట్టుబడులు పెడుతున్నాయ్‌
  • భారత్‌లో తొలి ఎఫ్‌-16 రెక్కను తయారు చేశాం 
  • 70% విడి భాగాలు ఇక్కడి నుంచే: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినె్‌స)/ఆదిభట్ల, డిసెంబరు 7: హైదరాబాద్‌ ఏరోస్పేస్‌, రక్షణ రంగాల కిరీటంలో మరో కలికితురాయి చేరింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలోని టాటా లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఏరోస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ .. ఎఫ్‌-16 యుద్ధ విమానం ప్రొటోటైప్‌ రెక్కల (వింగ్స్‌)ను తయారు చేసింది. మంగళవారం వాటిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ హాజరై మాట్లాడారు. భారత్‌లో తొలి ఎఫ్‌-16 రెక్కను తయారు చేశామని, భవిష్యత్తులో ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఫైటర్‌ రెక్కలు ఎగుమతి అవుతాయన్నారు. ఎఫ్‌-16 ఫైటర్‌ విమానం రెక్కల తయారీలో వినియోగించిన విడి భాగాల్లో 70 శాతాన్ని భారత్‌ నుంచే సమకూర్చుకున్నారన్నారు. హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి మెషిన్‌ వర్క్స్‌, అజాద్‌ ఇంజనీరింగ్‌, టాటా సికోర్‌స్కీ ఏరోస్పేస్‌ వంటి కంపెనీలు విడి భాగాలను సమకూర్చాయని తెలిపారు. ‘‘భారత్‌లో తయారీ, శిక్షణ, ఇన్నోవేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌ తదితర దేశాలకు చెందిన అంతర్జాతీయ తయారీ కంపెనీలకు తెలంగాణ కేంద్రంగా మారింది. లాక్‌హీడ్‌ మార్టిన్‌ వంటి కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. హైదరాబాద్‌ ఏరోస్పేస్‌, రక్షణ రంగాల్లోని కంపెనీలను ఆకర్షిస్తోంది.’’ అని ఆయన అన్నారు. 


ఐదేళ్లలో అనూహ్య వృద్ధి..

భారత్‌లోనే తెలంగాణలో బలమైన ఏరోస్పేస్‌, రక్షణ రంగాల ఎకో సిస్టమ్‌ ఉందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, పుష్కలంగా నిపుణుల లభ్యత కారణమన్నారు. గత ఐదేళ్లలో తెలంగాణలో ఏరోస్పేస్‌, రక్షణ రంగాలు అనూహ్యంగా అభివృద్ధి చెందాయని చెప్పారు. ఏరోస్పేస్‌ రంగంపై అత్యంత పురోగాత్మక దృక్పథం కలిగిన రాష్ట్రంగా 2018, 2020 సంవత్సరాలకు తెలంగాణను విమానయాన మంత్రిత్వ శాఖ గుర్తించిందన్నారు. హైదరాబాద్‌లో ఏరోస్పేస్‌, రక్షణ రంగాల పురోభివృద్ధిలో నిరంతరంగా పాలుపంచుకుంటున్న టాటా అడ్వాన్స్‌ సిస్టమ్స్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని తయారీ కార్యక్రమాలను చేపట్టాలని.. అందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని ఆయన చెప్పారు. 

Updated Date - 2021-12-08T09:49:42+05:30 IST