Chitrajyothy Logo
Advertisement

మనువు మాట.. ముందు చెబితే చేటా?

twitter-iconwatsapp-iconfb-icon

సినిమా స్టార్ల పెళ్లిళ్లపై ఇటు మీడియాలోనూ, అటు ప్రేక్షకుల్లోనూ ఒకింత ఆసక్తి ఉంటుంది. ఇక అభిమానుల్లో ఆ సందడి ఒక రేంజ్‌లో ఉంటుంది. సామాజిక మాధ్యమాలు వివాహ శుభాకాంక్షలతో హోరెత్తిపోతాయి. తమ అభిమాన నటీనటులు చిలుకా గోరింకల్లా కలసి ఉండాలనే అభిమానుల ఆకాంక్షలు కొత్త జంటను ముంచెత్తుతాయి.


అయితే ఇటీవల కాలంలో కొంతమంది సినీ సెలబ్రిటీల పెళ్లిళ్లు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా జరుగుతున్నాయి. తమ పెళ్లి మాటను పైకి చెప్పడానికి ఏ మాత్రం ఇష్టపడడం లేదు. 

కనీసం ఆహ్వాన పత్రిక కూడా నెట్టింట కనిపించకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘అభిమానులే మా కుటుంబ సభ్యులు, ఆరాధ్య దైవాలు, మీరు లేక మేము లేము’ అనే ప్రమాణాలను పెళ్లి దగ్గరకొచ్చేసరికి మాత్రం పక్కనపెడుతున్నారు. తమ జీవితంలో అతి ముఖ్యమైన అధ్యాయం అయిన పెళ్లి విషయాన్ని అభిమానులతో ముందుగా పంచుకోవడం లేదు. ఎప్పుడో పెళ్లి తంతు పూర్తయ్యాక తీరిగ్గా ఒకట్రెండు రోజులకు సోషల్‌ మీడియాలో పెళ్లి ఫొటోలను పెట్టి వారు ప్రకటించాకనే అధికారికంగా తెలుస్తోంది. 

మనువు మాట.. ముందు చెబితే చేటా?

ఆది పినిశెట్టి - నిక్కీ గల్రాని

 వెండితెరపైన మంచి జంటగా పేరు తెచ్చుకున్నారు ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని. కలసి సినిమాలు చేసే సమయంలోనే ప్రేమలో పడ్డారు. త్వరలోనే పెళ్లి చేసుకోబుతున్నారనే విషయం అందరికీ అర్థమైంది. నాలుగు రోజుల క్రితమే చెన్నైలో వీరి వివాహం జరిగింది. హల్దీ వేడుకల్లో ఈ జంట చేసిన డ్యాన్స్‌ వీడియోలు బయటకు రావడంతోనే వీరిద్దరి పెళ్లి గురించిన వార్త అభిమానులకు తెలిసింది. అప్పటిదాకా తమ పెళ్లి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

మనువు మాట.. ముందు చెబితే చేటా?

అలియాభట్‌ - రణ్‌బీర్‌కపూర్‌

బాలీవుడ్‌లో అందానికి అసలైన నిర్వచనం అలియాభట్‌. కలల రాకుమారుడుగా క్రేజ్‌ తెచ్చుకున్నారు రణ్‌బీర్‌కపూర్‌. ఇటీవలే ఓ ఇంటివారయ్యారు. వీరిద్దరు ప్రేమలో పడినట్లు ప్రకటించినా, ఈ బంధం పెళ్లి దాకా వెళుతుందా అనే అనుమానం చాలామందిలో ఉండేది. అలియా, రణ్‌బీర్‌కపూర్‌ల గతమే దానికి కారణం. సిద్ధార్థ్‌ మల్హోత్రా, వరుణ్‌ధావన్‌తో అలియా కొన్నాళ్లు డేటింగ్‌లో ఉంది. దీపికా పడుకోన్‌, కట్రీనా కైఫ్‌తో  రణ్‌బీర్‌కపూర్‌ రిలేషన్‌ బహిరంగమే. అందుకే అలియా, రణ్‌బీర్‌ పెళ్లి గురించి బాలీవుడ్‌ మీడియాలో పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చినా ఒకింత సంశయంతో చూశారు. 

కానీ ఎక్కడా బయటకు పొక్కకుండా ఈ జంట ముళ్లబంధంతో ఒక్కటయింది. ముంబైలోని తమ సొంతిట్లో కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య పెళ్లి తంతు ముగించారు. పెళ్లికి రెండు రోజులు ముందు కూడా రణ్‌బీర్‌ తల్లి నీతూకపూర్‌ మీడియాతో మాట్లాడుతూ పెళ్లి విషయాన్ని తేలిగ్గా కొట్టి పారేశారు. పెళ్లయిన మరుసటి రోజు అలియా అధికారికంగా తమ వివాహాన్ని ప్రకటించారు. 

మనువు మాట.. ముందు చెబితే చేటా?

కట్రీనాకైఫ్‌ - విక్కీ కౌశల్‌

గతేడాది కట్రీనాకైఫ్‌, విక్కీ కౌశల్‌ జంట వివాహ బంధంతో ఒక్కటయింది. రాజస్థాన్‌లోని పురాతన కోటలో వారి పెళ్లి జరుగుతోందని, ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అప్పట్లో మీడియాలో బాగా హడావిడి జరిగింది. కానీ ఈ జంట తమ పెళ్లి, ప్రేమ గురించి ఎక్కడా పెదవి విప్పింది లేదు. పెళ్లి గురించి మీడియా గుచ్చి గుచ్చి అడిగినా కట్రీనా, విక్కీ ఎక్కడా ఆ ప్రస్తావన రాకుండా జాగ్రత్తపడ్డారు. ఒక శుభ ముహూర్తాన ఇద్దరూ ఓ ఇంటివారయ్యారు. ఆ మరుసటి రోజు మా దాంపత్య జీవనం బాగుండాలని కోరుకోండి అని అభిమానులను ఉద్దేశించి సింపుల్‌గా సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టేశారిద్దరూ.  

మనువు మాట.. ముందు చెబితే చేటా?

దీపికా పడుకోన్‌ - రణ్‌వీర్‌సింగ్‌

దీపికా పడుకోన్‌, రణ్‌వీర్‌సింగ్‌ ఆరేళ్ల డేటింగ్‌ తర్వాత వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ముందస్తు పెళ్లి ప్రకటనలేవి లేకుండానే ఇటలీలో కొద్దిమంది స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఒక్కటయ్యారు. అయితే ఓ ఇంటర్వూలో దీపిక మాట్లాడుతూ పెళ్లికి నాలుగేళ్ల ముందు కుటుంబ సభ్యుల సమక్షంలో తమ నిశ్చితార్థం జరిగినట్లు, అన్నేళ్ల పాటు ఆ విషయాన్ని తాము గోప్యంగా ఉంచినట్లు చెప్పారు. 

మనువు మాట.. ముందు చెబితే చేటా?

అనుష్కా శర్మ- విరాట్‌ కోహ్లి

బాలీవుడ్‌ అగ్ర కథానాయిక అనుష్క శర్మ వివాహం క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీతో జరిగింది. 2017లో ఇటలీలో కొద్దిమంది సన్నిహితులతో వీరి పెళ్లి జరిగింది. తమ పెళ్లికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఈ జంట బయటకు పొక్కకుండా ఉంచింది. ఇటలీలో పెళ్లి ఏర్పాట్లను కూడా మారు పేర్లతోనే పూర్తి చేశామని అనుష్క ఓ సందర్భంలో చెప్పారు. 

మనువు మాట.. ముందు చెబితే చేటా?

ప్రణీతా సుభాష్‌

కథానాయికగా దక్షిణాదిన తనకంటూ అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు ప్రణితా సుభాష్‌. గతేడాది లాక్‌డౌన్‌లో ఆమె వివాహం వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో జరిగింది. కొవిడ్‌ నిబంధనల మేరకు కొద్దిమందితోనే పెళ్లి కార్యక్రమం ముగించారు. తమ పెళ్లి జరిగిన విషయాన్ని ముందుగా చెప్పనందుకు ప్రణీత అభిమానులకు సారీ చెప్పారు. తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వరదలా సోషల్‌ మీడియాను ముంచెత్తుతున్నా నటీనటులు కిమ్మనడం లేదు. సినిమా విడుదలప్పుడు తమ ప్రాణానికి ప్రాణం అని చెప్పే అభిమానులకు పెళ్లి విషయం మాట మాత్రంగా అయినా చెప్పడం లేదు. ఇప్పుడు  పెళ్లిని సీకెట్ర్‌గా ఉంచడం సినీ సెలబ్రిటీల్లో సాధారణం అయిపోయింది. 

పెళ్లి పర్సనల్‌

సినీ స్టార్స్‌ తమ పెళ్లి విషయాన్ని ముందే బహిర్గతం చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా తమ పాత ఎఫైర్లకు సంబంధించిన విషయాలను పెళ్లి సమయంలో ట్రోలర్స్‌ బయటకు తవ్వడం వారికిష్టం ఉండదు. పెళ్లిని తమ వ్యక్తిగత విషయంగా భావించి, ఎవరితోనూ పంచుకోవాలనుకోవడం లేదు. అలాగే మీడియా, అభిమానుల హడావిడిలేకుండా వివాహ క్రతువును ఆస్వాదించాలని హీరోలు, హీరోయిన్లు కోరుకుంటున్నారు. ముందే తెలిస్తే వివాహ వేదిక సమీపంలో గుమికూడే జనాలను అదుపు చేయలేక ఇబ్బంది పడాల్సి వస్తుందని భావిస్తున్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement