Manoj Tiwari: ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ర్యాలీలో ఈ బీజేపీ ఎంపీ ఏం చేశారో చూడండి.. తప్పు తెలిశాక హితబోధ..

ABN , First Publish Date - 2022-08-05T01:04:00+05:30 IST

ఆజాదీ కా అమృత మహాత్సవాల్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ నేత మనోజ్ తివారి ఆధ్వర్యంలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ర్యాలీ..

Manoj Tiwari: ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ర్యాలీలో ఈ బీజేపీ ఎంపీ ఏం చేశారో చూడండి.. తప్పు తెలిశాక హితబోధ..

న్యూఢిల్లీ: ఆజాదీ కా అమృత మహాత్సవాల్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ నేత మనోజ్ తివారి ఆధ్వర్యంలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ర్యాలీ బుధవారం జరిగింది. ఈ బైక్ ర్యాలీలో బైక్ నడిపిన మనోజ్ తివారి హెల్మెట్ ధరించలేదు. లైసెన్స్ లేదు. పొల్యూషన్ పేపర్లు లేవు. దీంతో.. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఈ బీజేపీ నేతకు ఛలానా విధించారు. ఆ బైక్ కూడా సదరు బీజేపీ నేతది కాదు. ఆ బైక్ యజమానికి కూడా వేరుగా ఛలానా పంపారు. ఈ బైక్ ర్యాలీలో పలువురు బీజేపీ ఎంపీలు, మంత్రులు కూడా పాల్గొన్నారు. ఎర్రకోట నుంచి పార్లమెంట్ హౌస్ వరకూ ఈ బైక్ ర్యాలీ జరిగింది.



హెల్మెట్ ధరించకుండా బైక్ డ్రైవ్ చేయడంపై మనోజ్ తివారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. హెల్మెట్ ధరించనందుకు Very Sorry అని మనోజ్ తివారి ట్వీట్ చేశారు. తాను ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులకు ఛలానా రుసుము చెల్లిస్తానని తెలిపారు. అంతేకాదు.. చివర్లో #DriveSafe అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేసి ‘కుటుంబానికి, స్నేహితులకు మీరు కావాలి’ అని సదరు బీజేపీ నేత హితబోధ చేయడం కొసమెరుపు. ఇదిలా ఉంటే.. ఎంపీ మనోజ్ తివారికు ట్రాఫిక్ పోలీసులు ఎంత ఛలానా విధించారు, ఆయన ఎంత చెల్లించాలనే విషయంపై స్పష్టత లేదు. ఆయన 41,000 చెల్లించాలని కొన్ని రిపోర్టులు, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందుకు 20,000 చెల్లించాలని ఢిల్లీ పోలీసులు ఛలానా విధించినట్లు మరికొన్ని రిపోర్టులు వెల్లడిస్తున్న పరిస్థితి.



ఇదిలా ఉండగా.. కనీసం హెల్మెట్ కూడా ధరించకుండా ఎంపీ మనోజ్ తివారి ర్యాలీ తీసిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన హెల్మెట్ ధరించలేదన్న విషయాన్ని గుర్తించని బీజేపీ మంత్రులు స్మృతి ఇరానీతో సహా పలువురు మనోజ్ తివారి ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీని తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి విస్తృత ప్రచారం కల్పించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. సోమవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రతి రోజూ వేడుకలను నిర్వహిస్తారు. త్రివర్ణ పతాకంతో సెల్ఫీలు దిగడంతోపాటు దేశభక్తి ప్రేరేపించేలా సదస్సులు, బృందచర్చలు, వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు, ర్యాలీలు, వారసత్వ నడక వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గోడపత్రికలు, కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రి ద్వారా వీటిపై ప్రచారం చేయనున్నారు.

Updated Date - 2022-08-05T01:04:00+05:30 IST