Abn logo
Sep 26 2021 @ 12:23PM

ఖాదీ ఉత్పత్తులు కొనండి : మోదీ

న్యూఢిల్లీ : ఖాదీ ఉత్పత్తులను కొని, స్థానిక వృత్తిపనివారికి అండగా నిలవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నదులను కాపాడుకోవాలని, పరిశుభ్రంగా ఉంటూ, కోవిడ్-19 వ్యాప్తి నిరోధక చర్యలు పాటించాలని కోరారు. 81వ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ఆయన ఆదివారం మాట్లాడారు. 


పండుగలు వచ్చేస్తున్నాయని, కోవిడ్-19 మహమ్మారితో పోరాటాన్ని మనం కొనసాగించాలని చెప్పారు. ‘టీమిండియా’ ప్రతి రోజూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోందన్నారు. వ్యాక్సినేషన్ అంతర్జాతీయ రికార్డులు సృష్టించిందని చెప్పారు. ఈ సురక్ష చక్రం నుంచి ఎవరూ వైదొలగకూడదని చెప్పారు. కోవిడ్ సంబంధిత నియమాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. 


నదుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నవారిని ప్రశంసించారు. తమిళనాడులోని నాగా నది ఎండిపోయిందని, గ్రామీణ మహిళల చొరవతో, ప్రజల భాగస్వామ్యంతో ఈ నది మళ్లీ జీవం పోసుకుందని చెప్పారు. నేడు ఆ నదిలో నీరు పుష్కలంగా ఉందని తెలిపారు. సెప్టెంబరులో ప్రపంచ నదుల దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. నదులు మనకు నిస్వార్థంగా నీటిని అందిస్తున్నా  యని చెప్పారు. 


స్థానిక వృత్తిపనివారిని ప్రోత్సహించాలని, ఖాదీ ఉత్పత్తులను కొనాలని పిలుపునిచ్చారు. ఖాదీ ఉత్పత్తులను కొని, మహాత్మా గాంధీకి నివాళులర్పించాలని అన్నారు. పరిశుభ్రతను గాంధీజీ ప్రోత్సహించేవారని చెప్పారు. బిహార్ తదితర ప్రాంతాల్లో ఛాత్ పూజ జరుగుతోందని చెప్పారు. తనకు వచ్చిన బహుమతుల ఈ-వేలం జరుగుతోందని, దీని ద్వారా వచ్చే సొమ్మును నమామి గంగే ప్రాజెక్ట్‌కు ఉపయోగిస్తామని తెలిపారు.