Abn logo
Aug 11 2020 @ 00:52AM

పెను సంక్షోభమిది..

  • మరింత ‘ఆర్థిక’ కుంగుబాటు 
  • గట్టెక్కేందుకు మూడు మార్గాలు
  • మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 సంక్షోభం.. దీర్ఘకాలం పాటు ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టే కనీవినీ ఎరుగని పెను సంక్షోభమని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత కుంగుబాటు తప్పదన్నారు. అయితే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మూడు పరిష్కార మార్గాలున్నాయన్నారు. బీబీసీకి ఇచ్చిన ఈ-మెయిల్‌ ఇంటర్వ్యూలో మన్మోహన్‌ సింగ్‌ ఆ మూడు పరిష్కార మార్గాల గురించి వెల్లడించారు.    

మూడు పరిష్కారాలు: కొవిడ్‌ను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ తప్పనిసరైనప్పటికీ దాన్ని అంత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం లేదని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. అయితే కొవిడ్‌తో కుంగిపోయిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ఆయ న  కొన్ని సూచనలు చేశారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు ప్రభుత్వం.. చెప్పుకోదగ్గ స్థాయిలోనగదు బదిలీ చేయాలన్నారు. అదే సమయంలో వారి జీవనోపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే నిధుల కొరతతో అల్లాడుతున్న వ్యాపార సంస్థలను ఆదుకునేందుకు రుణ హామీ పథకం అమలు చేయాలని సూచించారు. సంస్థాగత స్వయంప్రతిపత్తి ద్వారా ఆర్థిక సంస్థలను గాడిలో పెట్టాలన్నారు. 

అప్పులు తప్పవు: కరోనా ఖర్చుల నుంచి గట్టెక్కేందుకు ప్రభు త్వం పెద్ద మొత్తంలో అప్పులు చేయక తప్పదని మాజీ ప్రధాని స్పష్టం చేశారు. జీడీపీలో అప్పుల శాతం పెరిగినా ఈ విషయంలో భయపడకూడదన్నారు. కాకపోతే కొత్తగా చేసే అప్పులను..ప్రజల ప్రాణాలు, జీవనోపాధి, ఆర్థిక వృద్ధి రేటు గాడిన పడేలా ఖర్చు చేయాలన్నారు. చేసిన అప్పులను ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యమని ఆయన అన్నారు. 

దడి కట్టొద్దు: పెరుగుతున్న వాణిజ్య రక్షణ విధానాలపైనా మన్మోహన్‌ సింగ్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లా, ఈ విషయంలో మన దేశం కూడా దిగుమతులకు అడ్డుగోడలు కట్టడాన్ని ఆయన వ్యతిరేంచారు. గత  30 ఏళ్లుగా అనుసరించిన వాణిజ్య సరళీకరణ ద్వారా దేశంలోని సంపన్న వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనం పొందారన్నారు. 


Advertisement
Advertisement
Advertisement