Advertisement
Advertisement
Abn logo
Advertisement

హైకోర్టు న్యాయమూర్తులుగా మన్మథరావు, భానుమతి ప్రమాణ స్వీకారం

ప్రమాణం చేయించిన సీజే ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా

అమరావతి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా డాక్టర్‌ కె.మన్మథరావు, బీఎస్‌ భానుమతి ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టులోని ఒకటో నంబరు కోర్టు హాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు వారితో చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ప్రమాణం చేయించారు. అంతకు ముందు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఏవీ రవీంద్రబాబు ఇద్దరు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను చదివి వినిపించారు. ప్రమాణం తర్వాత ఉత్తర్వుల పత్రాలను చీఫ్‌ జస్టిస్‌ న్యాయమూర్తులకు అందజేశారు.

 ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతో పాటు అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకీరామిరెడ్డి పలువురు న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది పాల్గొన్నారు. జస్టిస్‌ బీఎస్‌ భానుమతి, జస్టిస్‌ మన్మథరావులకు న్యాయమూర్తులు, న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు. వీరి రాకతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 20కి చేరింది.


Advertisement
Advertisement