సెల్లార్లను ముంచెత్తిన ‘మంజీర’

ABN , First Publish Date - 2020-09-16T09:07:33+05:30 IST

అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత.. ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లోకి పెద్దగా పోటెత్తుతున్న నీటి ..

సెల్లార్లను ముంచెత్తిన ‘మంజీర’


పైపులైను పగలడంతో  4 అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి నీటి ప్రవాహం..

8 అడుగుల మేర చేరిన నీరు

వాచ్‌మన్ల కుటుంబాలకు త్రుటిలో తప్పిన ప్రమాదం

బిక్కుబిక్కుమంటూ గడిపిన 150 కుటుంబాలు 

నీటమునిగిన 70 కార్లు, 50 ద్విచక్ర వాహనాలు 


మియాపూర్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత.. ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లోకి పెద్దగా పోటెత్తుతున్న నీటి శబ్దం వినిపించింది. ఉలిక్కిపడిన వాచ్‌మన్‌ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా నిద్ర లేచారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూడగా.. అప్పటికే సెల్లార్‌ అంతా నీటితో మునిగిపోయి కనిపించింది. చూస్తుండగానే నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది. వాచ్‌మన్‌ కుటుంబ సభ్యులు ప్రాణాలు అరచేతిపెట్టుకొని పై అంతస్తులోకి వెళ్లి తల దాచుకున్నారు. ఆ అపార్ట్‌మెంట్‌తో పాటు.. మరో 3 అపార్ట్‌మెంట్లలోనూ ఇదే పరిస్థితి. సెల్లార్లలో వాచ్‌మన్లు నివసిస్తున్న ఇళ్లలోకి నీరు చేరడంతో.. త్రుటిలో వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. హైదరాబాద్‌ శివారు మియాపూర్‌ మదీనగూడలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుందీ ఘటన. స్థానిక అర్చన హోటల్‌ పక్కన్న శ్రీలక్ష్మి ఆర్కేడ్‌ అపార్ట్‌మెంట్‌కు ఆనుకొని మరో మూడు అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.


వీటి మధ్యలో ఖాళీగా ఉన్న రోడ్డులో ఉన్న మంజీరా పైపులైను ఉంది. ఇక్కడ కొత్తపైపులైను ఏర్పాటు కోసం పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో 4 రోజులుగా మంజీరా పైపులైను లీక్‌ అవుతోంది. చివరగా పైపులైను పగిలిపోయి నీరు బయటికి వచ్చింది. నాలుగు అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో 8 అడుగుల మేర నీరు చేరింది. వీటిల్లో నివాసముంటున్న 150 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. 70 కార్లు, సుమారు 50 ద్విచక్ర వాహనాలతో పాటు.. విద్యుత్తు సరఫరా ప్యానల్‌ బోర్డులు నీటమునిగాయి.


అప్రమత్తమైన అపార్ట్‌మెంట్ల అసోసియేషన్‌ ప్రతినిధులు పోలీసులకు, జలమండలి, విద్యుత్తు శాఖ అధికారులకు పోన్‌ చేశారు. కరెంటు సరఫరాను నిలిపేయడంతో పెను ప్రమాదం తప్పింది. పైపులైను పగిలిన దగ్గర గుంత తవ్వి కొత్త పైపులైను వేసేందుకు పనులను వేగవంతం చేశారు. ఇంజన్ల సాయంతో నీటిని ఎత్తిపోశారు. ఈ ఘటనతో సుమారు కోటి రూపాయల నష్టం జరిగినట్లు అపార్ట్‌మెంట్‌ వాసులు అంచనా వేశారు. విషయం తెలిసిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అపార్ట్‌మెంట్ల వద్దకు చేరుకుని సెల్లార్లను పరిశీలించారు. వాచ్‌మన్ల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించారు. 


‘జలమండలి’ నిర్లక్ష్యం

మంజీరా పైపులైను లీక్‌ అవుతున్న విషయాన్ని పటాన్‌చెరు జలమండలి అధికారులకు చెప్పామని, ట్విటర్‌లో ఫిర్యాదు చేశామని, అయినా వారు పట్టించుకోవలేదని అపార్ట్‌మెంట్ల అసోసియేషన్ల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అయితే.. విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులు, నీటి ప్రవాహంలో ఒత్తిడి కారణంగా పైపులైన్లు పగిలిపోతుంటాయని జలమండలి అధికారులు చెప్పారు.  

Updated Date - 2020-09-16T09:07:33+05:30 IST