పంజాబ్ కాంగ్రెస్‌లో ఇంత అరాజకం ఎన్నడూ లేదు : మనీశ్ తివారీ

ABN , First Publish Date - 2021-10-25T00:18:02+05:30 IST

పంజాబ్ కాంగ్రెస్‌లో ఇంతటి అరాజకం, గందరగోళం ఎన్నడూ

పంజాబ్ కాంగ్రెస్‌లో ఇంత అరాజకం ఎన్నడూ లేదు : మనీశ్ తివారీ

చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్‌లో ఇంతటి అరాజకం, గందరగోళం ఎన్నడూ చూడలేదని ఆ పార్టీ సీనియర్ నేత మనీశ్ తివారీ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, ఆ పార్టీ నేతలు ఉపయోగించిన పదజాలంపై తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. చేపలు అమ్ముకునేవారైనా ఇలాంటి పదాలను వాడరని, దీనిని చూసి ప్రజలు విసుగెత్తిపోరా? అని నేతలను నిలదీశారు.


పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌జిందర్ సింగ్ రణధవా ఇటీవల మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కు స్నేహితురాలైన పాకిస్థానీ జర్నలిస్టు అరూసా ఆలంకు పాకిస్థానీ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్)తో సంబంధాలు ఉన్నాయేమో తెలుసుకునేందుకు దర్యాప్తు జరిపిస్తామన్నారు. దీనిపై కెప్టెన్ సింగ్ స్పందిస్తూ రణధవా వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ సతీమణి నవజోత్ కౌర్ మాట్లాడుతూ, అమరీందర్ సింగ్ హయాంలో అరూసా ఆలంకు ఉద్యోగులు, అధికారుల నుంచి బహుమతులు, డబ్బు ముట్టకుండా కనీసం ఒక పోస్టింగ్ అయినా జరగలేదని ఆరోపించారు. 


ఈ నేపథ్యంలో మనీశ్ తివారీ ఆదివారం ఇచ్చిన ట్వీట్లలో, 2015నాటి అపచారం సంఘటనలు, మాదక ద్రవ్యాల కేసులు, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు వంటి సమస్యల పరిష్కారం ఏ దశలో ఉందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హరీశ్ రావత్ ఓ ఇంటర్వ్యూలో తన పేరు ప్రస్తావించడాన్ని కూడా తప్పుబట్టారు. కాంగ్రెస్‌లో తన 40 ఏళ్ల ప్రస్థానంలో పంజాబ్ పార్టీ విభాగంలో ఇంత స్థాయిలో గందరగోళం, అరాజకం ఎన్నడూ చూడలేదన్నారు. 


పీసీసీ ప్రెసిడెంట్, కొలీగ్స్ ఏఐసీసీని బహిరంగంగా పదే పదే ధిక్కరిస్తున్నారన్నారు. చిన్న పిల్లల మాదిరిగా బహిరంగంగా కాట్లాడుకుంటున్నారన్నారు. ఒకరిపై మరొకరు చెత్త భాష మాట్లాడుకుంటున్నారని దుయ్యబట్టారు. చేపలు అమ్ముకునేవారు సైతం ఇటువంటి భాషను ఉపయోగించరని చెప్పారు. ఐదు నెలల నుంచి పంజాబ్ కాంగ్రెస్ వర్సెస్ పంజాబ్ కాంగ్రెస్‌గా పరిస్థితి ఉందని మండిపడ్డారు. రోజూ ఈ విధంగా కాట్లాడుకుంటే పంజాబ్ ప్రజలు విసుగెత్తిపోతారనే ఆలోచన ఉందా? అని నిలదీశారు. 


Updated Date - 2021-10-25T00:18:02+05:30 IST