అవినీతిపై డీయూను నిలదీసిన డిప్యూటీ సీఎం

ABN , First Publish Date - 2020-08-08T23:00:44+05:30 IST

ఐదేళ్లుగా బడ్జెట్ కేటాయింపులు 70 శాతం పెంచినప్పటికీ ఢిల్లీ యూనివర్శిటీ కాలేజీలు సిబ్బందికి జీతాలు..

అవినీతిపై డీయూను నిలదీసిన డిప్యూటీ సీఎం

న్యూఢిల్లీ: ఐదేళ్లుగా బడ్జెట్ కేటాయింపులు 70 శాతం పెంచినప్పటికీ ఢిల్లీ యూనివర్శిటీ కాలేజీలు సిబ్బందికి జీతాలు చెల్లించకలేకపోవడాన్ని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తప్పుపట్టారు. ఇది అవినీతిని సూచిస్తోందంటూ మండిపడ్డారు. ఢిల్లీ యూనివర్శిటీకి ప్రభుత్వం నిధులు (ఫండ్) అందిస్తుంటుంది. నిధులు లేకపోవడం కారణంగానే కాలేజీ టీచర్లకు వేతనాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని డీయూ క్లెయిమ్ చేయడంతో మనీష్ సిసోడియా ఘాటుగా స్పందించారు.


'ఐదేళ్లుగా బడ్జెట్ కేటాయింపులు 70 శాతం పెంచినా వేతనాలు ఇవ్వక పోవడం చూస్తే అవినీతి సంకేతాలు కనిపిస్తున్నాయి' అని ఒక ప్రకటనలో సిసోడియా మండిపడ్డారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో డీయూ కాలేజీలు వేతనాలు ఎందుకు ఇవ్వలేకపోయాయంటూ నిలదీశారు. 2020-21 బడ్జెట్‌లో రూ.243 కోట్లు కేటాయించామని, ఇందులో రూ.56.25 కోట్లు (23 శాతం) జూలై చివర్లో విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ కాలేజీలకు 2014-15లో రూ.144.39 కోట్లుగా ఉన్న బడ్జెట్‌ను 2019-20లో 242.64 కోట్లు పెంచామని, 2020-21లో రూ.243 కోట్లు చేశామని గణాంకాలు వెల్లడించారు. బడ్జెట్ కేటాయింపుల్లో 70 శాతం పెంపుదల చేసినప్పటికీ నిధుల్లేవని డియూ ఫిర్యాదు చేయడాన్ని తప్పుపట్టారు.


'డీయూకు అయ్యే ఖర్చులకు తగినతంగా గత ఏడాది బడ్జెట్ (2019-20) రూ.242.64 కోట్లు కేటాయించడం జరిగింది. అంతకుముదు ఏడాది (2018-19) రూ.216.13 కోట్లు కేటాయించాం. గత రెండేళ్లలోనే రూ.27 కోట్లు పెంచినప్పటికీ నిధులు సరిపోలేదని డీయూ ఎలా కంప్లయింట్ చేస్తుంది?' అని డిప్యూటీ సీఎం నిలదీశారు. ఢిల్లీ విద్యా శాఖ కింద ఇతర యూనివర్శిటీలు కూడా ఉన్నాయని, జీతాలు చెల్లించలేకపోతున్నామనే మాట ఏ యూనివర్శిటీ నుంచి ఇంతవరకూ తాము వినలేదని అన్నారు.


అవీనితి ఫిర్యాదులు..

డీయూ కాలేజీ అడ్మినిస్ట్రేషన్‌లో అవినీతి జరుగుతున్నట్టు తనకు ఫిర్యాదులు అందాయని, వీటిపై గత నెలలో డీయూ వైస్ ఛాన్సలర్‌‌కు లేఖ రాశానని సిసోడియా చెప్పారు. ఇంకా తనకు వైస్ ఛాన్సలర్స్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలిపారు. డీయూ కాలేజీలకు గత ఐదేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల లెక్కలను కూడా సిసోడియా ఆ ప్రకటనలో వెల్లడించారు.

Updated Date - 2020-08-08T23:00:44+05:30 IST