Kejriwal: సిసోడియా అరెస్టయ్యే అవకాశం ఉందని నాకు ముందే తెలుసు

ABN , First Publish Date - 2022-07-22T22:36:17+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ స్థాయికి ఎదుగుతుండటంతో కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ..

Kejriwal: సిసోడియా అరెస్టయ్యే అవకాశం ఉందని నాకు ముందే తెలుసు

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ స్థాయికి ఎదుగుతుండటంతో కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రవాల్ (Arvind kejriwal) అన్నారు. ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish sisodia) పేరును లెఫ్టినెంట్ గవర్నర్ సక్సానా నేరుగా ప్రస్తావిస్తూ ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ విధానంపై సీబీఐ విచారణకు సిఫారసు చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ తాజా వ్యాఖ్యలు చేశారు.


''నాకు తెలుసు..ఆయనను (మనీష్ సిసోడియా) అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ విషయం కొద్ది నెలల క్రితమే నాకు తెలుసు. దేశంలో ఒక కొత్త పద్ధతి నడుస్తోంది. ఎవరిని జైలుకు పంపాలో, ఏ విధంగా కేసు బనాయించాలో వారే (కేంద్రం) నిర్ణయిస్తారు'' అని కేజ్రీవాల్ అన్నారు. మనీష్ సిసోడియా నిజాయితీ పరుడని సీఎం కితాబు ఇచ్చారు. ఇది పూర్తిగా తప్పుడు కేసని, 22 ఏళ్లుగా సిసోడియా తనకు తెలుసునని, ఎంతో నిజాయితీపరుడని ప్రశంసించారు. ఆయన మంత్రి పదవి చేపట్టినప్పుడు ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లు చాలా దయనీయ స్థితిలో ఉన్నాయని, రేయింపవళ్లు కష్టపడి వాటిని ఒక స్థాయికి తెచ్చారని చెప్పారు. ఒక జడ్జి కుమారుడు, రిక్షా డ్రైవర్ కుమారుడు కలిసి చదువుకునే స్థాయికి ప్రభుత్వ స్కూళ్లను తీసుకువచ్చారని అన్నారు.


జైళ్లకు భయపడం...

జైళ్లంటే తమకు భయం లేదని కేజ్రీవాల్ అన్నారు. తమ నేతలపై అనేక కేసులు బనాయించారని, ఆప్ ప్రతిష్ట అంతకంతకూ పెరుగుతుండటం పంజాబ్‌లో అధికారంలోకి రావడం, జాతీయ స్థాయికి పార్టీ ఎదగడం చూసి వారు (కేంద్రం) ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనీ, అయితే తమ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


మోదీకి భయం పట్టుకుంది: సిసోడియా

కాగా, ఎల్‌జీ సిఫారసులపై మనీష్ సిసోడియా ఓ ట్వీట్‌లో స్పందించారు. ''మోదీకి కేజ్రీవాల్ భయం పట్టుకుంది. ఆయనపై ప్రజలకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి. యావద్దేశ ప్రజలు ఇప్పుడు ఒక్క  కేజ్రీవాల్‌పైనే ఆశలు పెట్టుకున్నారు.దేశవ్యాప్తంగా ఆప్‌కు ఆదరణ పెరుగుతోందని, ఇందువల్ల పార్టీపై మరిన్ని తప్పుడు కేసులు పెరగవచ్చని అన్నారు. ఏ కేసులు కూడా కేజ్రీవాల్‌ను, ఆప్‌ను ఆపలేవని చెప్పారు.

Updated Date - 2022-07-22T22:36:17+05:30 IST