ఎన్నికల్లో రెండో స్థానం.. అయినా ఎమ్మెల్యే అయినా బీజేపీ నేత

ABN , First Publish Date - 2021-04-17T02:28:19+05:30 IST

ఈ మధ్య కాలంలో ఇలాంటి తీర్పు ఇవ్వడం రెండవసారి అని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. 2017 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాక్చింగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వై సూర్చంద్ర ఎన్నికయ్యారు.

ఎన్నికల్లో రెండో స్థానం.. అయినా ఎమ్మెల్యే అయినా బీజేపీ నేత

ఇంపాల్: ఎన్నికల్లో రెండో స్థానంలో సంపాదించిన ఓ వ్యక్తిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ మణిపూర్ హైకోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అఫిడవిట్‌లో సరైన సమాచారం ఇవ్వనందున అతని ఎన్నికను రద్దు చేస్తూ రెండవ స్థానంలో వచ్చిన వ్యక్తిని గెలుపొందినట్లుగా సింగిల్ బెంచ్ ప్రకటించింది.


వివరాల్లోకి వెళ్తే.. ఓక్రమ్ హెన్రీ సింగ్ (32) అనే వ్యక్తి 2017 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో వాంగ్‌కేయి అనే నియోజకవర్గం నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 16,753 ఓట్లు రాగా భారతీయ జనతా పార్టీ తరపున బరిలోకి దిగిన వై ఎరబోట్ సింగ్ అనే వ్యక్తి 12,417 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. అనంతరం హెన్రీ సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. అనంతరం ఆయన ఎమ్మెల్యేగా అనర్హులయ్యారు.


ఇదిలా ఉంటే, ఎన్నికల అఫిడవిట్‌లో వివరాలు సరిగా నమోదు చేయలేదంటూ చాలా రోజులుగా కోర్టులో కేసు నడుస్తోంది. వాంగ్‌కేయి నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని హెన్రీ, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. రాష్ట్ర హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. అనంతరం స్థానిక కోర్టులో కొనసాగిన విచారణ అనంతరం ఎంవీ మురళీదరన్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్.. ‘‘భార్య, ఇతర ఆధారపడిన వారు, విద్యాఅర్హతలు, క్రిమినల్ కేసులకు సంబంధించి వివరాలు సరిగా నమోదు చేయలేదు. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం 1951కి నియమావళికి ఉల్లంఘన’’ అని తీర్పు వెలువరించారు. అంతే కాకుండా ఎన్నికలో రెండవ స్థానంలో నిలిచిన ఎరబోట్ సింగ్‌ను ఎమ్మెల్యేగా గెలిచినట్లు ఏప్రిల్ 15న ప్రకటించింది.


ఈ మధ్య కాలంలో ఇలాంటి తీర్పు ఇవ్వడం రెండవసారి అని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. 2017 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాక్చింగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వై సూర్చంద్ర ఎన్నికయ్యారు. అయితే ఆయన కూడా తన అఫిడవిట్‌లో వివరాలు సరిగా నమోదు చేయని కారణంగా రెండవ స్థానం సంపాదించిన ఎం రామేశ్వర్‌ను ఎమ్మెల్యేగా గెలిచినట్లు ప్రకటించింది.

Updated Date - 2021-04-17T02:28:19+05:30 IST