పరిహారం అందజేతలో అవకతవకలు

ABN , First Publish Date - 2022-06-29T06:22:29+05:30 IST

ఖరీఫ్‌- 2021లో పంట నష్టపోయిన వారికి ప్రభుత్వం ఇటీవల నష్టపరిహారం అందజేసిన విషయం తెలిసిందే.

పరిహారం అందజేతలో అవకతవకలు
బేస్తవారపేటలో వినతిపత్రం అందజేస్తున్న రైతులు

గిద్దలూరు, జూన్‌ 28 : ఖరీఫ్‌-  2021లో పంట నష్టపోయిన వారికి ప్రభుత్వం ఇటీవల నష్టపరిహారం అందజేసిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది వైసీపీ నాయకుల ప్రోద్భలంతో రైతులకు దక్కాల్సిన పరిహారాన్ని ఇతరుల అకౌంట్లలోకి జమచేశారు. ఈ వ్యవహారంపై మండలంలోని సంజీవరాయునిపేట గ్రామానికి చెందిన ఇల్లూరి నాగూర్‌, చిలకల రామిరెడ్డి, జాగం పెద్దకోటిరెడ్డి, శీలం జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు ఇటీవల గిద్దలూరులో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిజమైన రైతుల ఖాతాలలో పరిహారం జమ కాలేదని, ఆ మొత్తాన్ని ఇతరుల అ కౌంట్లలోకి వ్యవసాయశాఖ సిబ్బంది జమ చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి ఏడీ బాలాజీనాయక్‌ మంగళవారం గ్రామంలో విచారించారు. ఆర్‌బీకేకు వెళ్లి రికార్డులను పరిశీలించారు. వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ రవిప్రసాద్‌ను విచారించారు. జిల్లా కలెక్టర్‌కు రైతులు ఇచ్చిన ఫిర్యాదులోని పలు అంశాలు నిజమేనని నిర్ధారించుకున్నారు. ఆ మేరకు స్థానిక సహాయ వ్యవసాయ సంచాలకులు మహబూబ్‌బాషాకు, జిల్లా అధికారులకు విచారణ అంశాల గురించి రిపోర్టు ఇచ్చారు. మంగళవారం సాయంత్రం స్థానిక వ్యవసాయశాఖ ఏడీ మహబూబ్‌బాషా ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ సంజీవరాయునిపేట పంచాయతీ పరిధిలో 17 మంది ఇతరుల బ్యాంకు ఖాతాల్లో రైతుల పరిహారం జమ అయినట్లు గుర్తించామన్నారు. రూ.5.62 లక్షల మేర పరిహారం జమ అయినట్లు గుర్తించి, ఆ అకౌంట్లలోని డబ్బు విత్‌డ్రా కాకుండా హోల్డ్‌లో ఉంచామన్నారు. అలాగే వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ రవిప్రసాద్‌ ఈ వ్యవహారంలో పాత్రదారులని గుర్తించామన్నారు. ఇదే కాకుండా మరో రూ.1.47 లక్షల కూడా రవిప్రకాశ్‌  ఇతరుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు గుర్తించామ న్నారు. వారి నుంచి రికవరీ చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా రైతులకు చెందిన పరిహారం డబ్బు పలువురు వైసీపీ నాయకులు, ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు, వారి బంధువుల అకౌంట్లలో జమ అయ్యే విధంగా కుట్ర జరగ్గా, రైతుల ఫిర్యాదుతో అధికారులు వెంటనే విచారణ జరుపడంతో అవకతవకలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లు అయింది. ఈ వ్యవహారంలో అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో  వేచి చూడాల్సి ఉంది. 

బత్తాయి పంటకు నష్టపరిహారం ఇవ్వాలి

బేస్తవారపేట : మండలంలో గత ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పంటల్లో ఈ-క్రాప్‌ నమోదు చేసుకొన్న కంది, పత్తి, బత్తాయి, టమోటా పంటలకు బీమా పథకంలో రైతులకు నష్టపరిహారం అందజేశారు. అయితే మండలంలోని చిన్న ఓబినేనిపల్లె, పెద్దఓబినేనిపల్లె, రెట్లపల్లె గ్రామాల్లో సూమారు 150 ఎకరాల్లో బత్తాయి సాగులో ఉంది. అందుకు ఈ-క్రాప్‌లో నమోదు చేశారు. కాని నష్టపరిహారం అందలేదు. దీంతో రైతులు మంగళవారం వ్యవసాయాధికారి జె.మెర్సీ ఉద్యానశాఖాధికారి శ్వేతలకు వినతిపత్రాలు అందజేశారు. జిల్లా అధికారులకు సమాచారం అందజేసి రైతులకు నష్టపరిహారం అందజేయాలని కోరారు.

Updated Date - 2022-06-29T06:22:29+05:30 IST