ఇంటి పన్నుల వసూళ్లలో అవకతవకలు

ABN , First Publish Date - 2022-05-23T05:14:24+05:30 IST

దర్శి నగర పంచాయతీలో ఇంటి పన్నుల వసూళ్లలో అవకతవకలు చోటుచేసుకున్నాయి. గృహ యజమానులకు తప్పుల తడకగా డిమాండు నోటీసులు ఇస్తున్నారు. వాటిలో గతేడాది చెల్లించిన వారికి కూడా బకాయి ఉన్నట్లు చూపుతున్నారు. వందిలాది మంది ఇంటి పన్నులు చెల్లించిన వారికి ఈ విధంగా బకాయిలు ఉన్నట్లు నోటీసులు రావటంతో వారంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటి పన్నుల వసూళ్లలో అవకతవకలు
దర్శి నగర పంచాయతీ కార్యాలయం

గతేడాది చెల్లించిన వారికి 

పెనాల్టీతో డిమాండ్‌ నోటీసు 

ఆగ్రహం వ్యక్తంచేస్తున్న ప్రజలు 

కంప్యూటర్లో పొరపాటు అంటున్న అధికారులు

దర్శి, మే 22 : దర్శి నగర పంచాయతీలో ఇంటి పన్నుల వసూళ్లలో అవకతవకలు చోటుచేసుకున్నాయి. గృహ యజమానులకు తప్పుల తడకగా డిమాండు నోటీసులు ఇస్తున్నారు. వాటిలో గతేడాది చెల్లించిన వారికి కూడా బకాయి ఉన్నట్లు చూపుతున్నారు. వందిలాది మంది ఇంటి పన్నులు చెల్లించిన వారికి ఈ విధంగా బకాయిలు ఉన్నట్లు నోటీసులు రావటంతో వారంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు డిమాండ్‌ నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. నగర పంచాయితీ కార్యాలయానికి వెళ్లి ఇదేమిటని అడిగితే కంప్యూటర్‌లో పొరపాటు వలన కొంతమందికి పాత బకాయి ఉన్నట్లు చూపటంతో నోటీసులు ఇచ్చామని చెబుతున్నారు. పొరపాట్లు సరిదిద్ది పన్ను కట్టించుకోవాలని ఇంటి యజమానులు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ అందుకు కొంత సమయం కావాలంటున్నారు.  

రూ.3.60 కోట్ల బకాయిలున్నాయంటున్న అధికారులు 

దర్శిలో మొత్తం 8,900 గృహాలు ఉన్నాయి. ఇంటి పన్ను రూ.3.60 కోట్ల మేర బకాయి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది చెల్లించిన వారికి ఆ బకాయితో కలిపి ఇప్పుడు బిల్లులు వేయటంతో అధిక మొత్తంలో కన్పిస్తోంది. అందువలన ఇంటి యజమానులు కంప్యూటర్‌లో జరిగిన లోపాలను సరిదిద్దే వరకు బిల్లులు చెల్లించేది లేదని కరాఖండిగా చెప్తున్నారు. దీంతో కేవలం రూ.40లక్షలు మాత్రమే ఇంటి పన్ను వసూలైంది. దర్శి నగర పంచాయితీలో మొత్తం 900మంది గృహ యజమానులకు గతేడాది ఇంటి పన్ను చెల్లించినప్పటికీ బకాయి ఉన్నట్లు డిమాండ్‌ నోటీసుల ఇచ్చారు.  

అన్‌అప్రూవల్‌ జాబితాలో అనేక గృహాలు  

గతంలో అనుమతులు తీసుకొని గృహాలు నిర్మించుకున్న వారికి ఇప్పుడు అన్‌ అప్రూవల్‌ కింద చూపి పెనాల్టీలు చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారు. అనేకమంది  తాము చట్టబద్ధంగా అనుమతులు తీసుకొని ఇళ్లు నిర్మించుకున్నామని కార్యాలయానికి వచ్చి అధికారులను ప్రశ్నిస్తున్నారు. గతంలో తీసుకున్న అనుమతి పత్రాలను చూపించి తప్పుడు నోటీసులు ఇవ్వటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం కంప్యూటర్‌లో సాఫ్ట్‌వేర్‌ సమస్య వలన బిల్లులు అలా వస్తున్నాయని చెబుతున్నారు. పెంచిన  పన్నుతో కలిపి బిల్లులు ఇవ్వకుండా అన్‌అప్రూవల్‌ పెనాల్టీ కింద బిల్లులు ఇస్తే భవిష్యత్‌లో తాము చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇంటి యజమానులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, సిబ్బంది చేస్తున్న తప్పులకు తాము బలికావాల్సి వస్తుందని వాపోతున్నారు.  

పొరపాటున వచ్చాయి 

మంజునాథ్‌గౌడ్‌, దర్శి నగర పంచాయతీ కమిషనర్‌

గత ఏడాది ఇంటి పన్ను చెల్లించిన వారికి పాత బకాయితో కలిపి బిల్లులు పొరపాటున ఇచ్చిన మాట వాస్తవమే. అనుమతులు తీసుకొని ఇళ్లు నిర్మించుకున్న కొంతమందికి అన్‌అప్రూవల్‌గా డిమాండ్‌ నోటీసులు ఇచ్చారు.. సాఫ్ట్‌వేర్‌ సమస్య వలన ఇలా జరిగింది. ఇంటి యజమానులు ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. పాత బిల్లులు చూపించిన వారికి పెనాల్టీలు లేకుండా పన్నులు కట్టించుకుంటాం.


Updated Date - 2022-05-23T05:14:24+05:30 IST