‘జీవన్‌దాన్‌’లో అవకతవకలు?

ABN , First Publish Date - 2021-02-28T08:15:29+05:30 IST

అవయవాల కోసం ‘జీవన్‌దాన్‌’లో తమ పేరును నమోదు చేసుకుని ఎదురు చూస్తున్న వారికి నిరాశ ఎదురవుతోంది.

‘జీవన్‌దాన్‌’లో అవకతవకలు?

  • రోగులకు అవయవాలు అందడంలో జాప్యం
  • డబ్బులు ఎక్కువ ఇచ్చే రోగులకే కేటాయింపులు
  • సర్కారుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు


హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): అవయవాల కోసం ‘జీవన్‌దాన్‌’లో తమ పేరును నమోదు చేసుకుని ఎదురు చూస్తున్న వారికి  నిరాశ ఎదురవుతోంది. తామే ముందుగా పేరు నమోదు చేసుకున్నప్పటికీ అవయవాలు అందడంలో జాప్యం జరుగుతోందని బాధితులు అంటున్నారు. వెయిటింగ్‌ జాబితాలో ఉన్నవారిని కాదని, ఆ కింది వరుసలో ఉన్నవారికి  జీవన్‌దాన్‌ అఽధికారులు, సిబ్బంది అవయవాలను కేటాయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై బాధితులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అవయవ మార్పిడి సర్జరీలు ‘జీవన్‌దాన్‌’ కిందనే చేస్తున్నారు. అనారోగ్య కారణాల వల్ల కిడ్నీ, గుండె, కాలేయం లాంటివి పాడైన వారికి ఆయా అవయవాల అవసరం ఉంటుంది. రోడ్డు ప్రమాదాల కారణంగా బ్రెయిన్‌డెడ్‌ అయిన వారి నుంచి వారి కుటుంబ సభ్యులను ఒప్పించి అవయనదానం చేయిస్తుంటారు. అలా వచ్చిన అవయవాలను ‘జీవన్‌దాన్‌’లో నమోదు చేసుకున్న వారిలో జాబితా ప్రకారం ముందున్న వారికిస్తారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల నుంచి ‘జీవన్‌దాన్‌’లో అవయవాల కోసం పేర్లను నమోదు చేసుకుంటున్నారు. అయితే,  వరుస క్రమంలో జాబితాలో ముందున్న వారిని కాదని, వారికి సమాచారం ఇవ్వకుండానే, ఇచ్చినట్లు చూపించి, వారు ప్రతిస్పందించడం లేదని సాకు చూపి, డబ్బులు ఎక్కువిచ్చే రోగులకు అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నారన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. 


విచారణకు ఆదేశించిన మంత్రి ఈటల

‘జీవన్‌దాన్‌’లో జరుగుతోన్న అవకతవకలపై మంత్రి ఈటల రాజేందర్‌ శనివారం విచారణకు ఆదేశించారు. జాబితాలో వరుస క్రమంలో ఉన్నవారిని కాదని, వెనుకున్న వారికి అవయవాల కేటాయింపులు ఎలా చేశారో గణాంకాలు తీయాలని అధికారులను కోరారు. ఈ మేరకు వైద్య విద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డిని   నివేదిక అందించాలని ఈటల ఆదేశించారు. 

Updated Date - 2021-02-28T08:15:29+05:30 IST