అడ్మిషన్‌ ఇవ్వలేం... అర్థం చేసుకోండి.. ఓ ప్రభుత్వ స్కూల్లో పరిస్థితి ఇదీ!

ABN , First Publish Date - 2022-07-06T18:18:26+05:30 IST

సారీ.. నో అడ్మిషన్‌ ప్లీజ్‌... ఇలాంటి మాటలు మనం బాగా పేరొందిన ప్రైవేట్‌ స్కూల్స్‌లో వింటుంటాం. అదే కోవలో మణికొండ జిల్లా పరిషత్‌

అడ్మిషన్‌ ఇవ్వలేం... అర్థం చేసుకోండి.. ఓ ప్రభుత్వ స్కూల్లో పరిస్థితి ఇదీ!

మణికొండ జడ్పీ స్కూల్‌ ఉపాధ్యాయులు 

ఇప్పటికే నిండిపోయిన తరగతి గదులు


నార్సింగ్‌, హైదరాబాద్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): సారీ.. నో అడ్మిషన్‌ ప్లీజ్‌... ఇలాంటి మాటలు మనం బాగా పేరొందిన ప్రైవేట్‌ స్కూల్స్‌లో వింటుంటాం. అదే కోవలో మణికొండ జిల్లా పరిషత్‌ పాఠశాల చేరింది. నిన్న మొన్నటి వరకు  ఈ పాఠశాలలో అడ్మిషన్ల జాతర కొనసాగింది. తరగతి గదులు నిండిపోవడంతో ఉపాధ్యాయులు కొత్త అడ్మిషన్‌ తీసుకోలేమంటున్నారు. ఈ ఏడాది పాఠశాలలో పదో తరగతి పరీక్షలు 164 మంది రాయగా 143 మంది ఉత్తీర్ణులయ్యారు. 87 శాతం ఫలితాలు వచ్చాయి. ఫలితాలతో సంబంధం లేకుండా అనేకమంది పిల్లల్ని పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఆరు నుంచి పదో తరగతి వరకు 371 మంది కొత్తగా చేరారు. దీంతో పాఠశాల విద్యార్థుల సంఖ్య 1170కు చేరింది. ఆరో తరగతి తెలుగు మీడియంలో 85 మంది, ఇంగ్లిష్‌ మీడియంలో 169 మంది, ఏడో తరగతి తెలుగు మీడియంలో 72, ఇంగ్లిష్‌ మీడియంలో 194, 8వ తరగతి తెలుగు మీడియంలో 55, ఇంగ్లిష్‌ మీడియంలో 181, తొమ్మిదో తరగతి తెలుగు మీడియంలో 64, ఇంగ్లిష్‌ మీడియంలో 162, పదో తరగతి తెలుగు మీడియంలో 67, ఇంగ్లిష్‌ మీడియంలో 123 మంది విద్యార్థులున్నారు. పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం వేర్వేరుగా ఉన్నాయి. 15 మంది ఉపాధ్యాయులున్నా వారికి సరైన సదుపాయాలు లేవు. ఈ ఏడాది ఇప్పటికే 371 మందికి అడ్మిషన్లు ఇవ్వగా మరో 50 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త ఆడ్మిషన్లు ఇవ్వలేం, అర్ధం చేసుకోండని పాఠశాల ఉపాధ్యాయలు చెబుతున్నారు. 


ఉపాధ్యాయులు వస్తే అదనపు సెక్షన్లు ఏర్పాటు చేస్తాం

మా పాఠశాలకు సమీపంలో షేక్‌పేట, రాయదుర్గం, నార్సింగ్‌లో ఉన్నత పాఠశాలలున్నాయి. కొంతమందిని అక్కడకు పంపుతుంటే వెళ్లడం లేదు. ఇక్కడ తరగతి గదులు నిండిపోయాయి. అడ్మిషన్లు ఇవ్వలేకపోతున్నాం. అదనంగా ఉపాధ్యాయులను కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టాం. ఉపాధ్యాయులు వస్తే అదనపు సెక్షన్లు ఏర్పాటు చేస్తాం. పరిస్థితిని అర్థం చేసుకోవాలి. 

- నిరంజన్‌, ప్రధానోపాధ్యాయుడు,

 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, మణికొండ



Updated Date - 2022-07-06T18:18:26+05:30 IST