Tripura కొత్త ముఖ్యమంత్రిగా Manik Saha

ABN , First Publish Date - 2022-05-15T00:31:32+05:30 IST

త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మాణిక్ సాహాను బీజేపీ అధిష్ఠానం..

Tripura కొత్త ముఖ్యమంత్రిగా Manik Saha

న్యూఢిల్లీ: త్రిపుర (Tripura) కొత్త ముఖ్యమంత్రిగా పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ) డాక్టర్ మాణిక్ సాహా(Manik Saha)ను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. బిప్లబ్ కుమార్ దేబ్ (Biplab Kumar Deb) శనివారంనాడు రాజీనామా చేయడంతో కొత్త సీఎం పేరును పార్టీ ప్రకటించింది. మాణిక్ సాహా సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికైన డాక్టర్ మానిక్ సహాకు (69) బిప్లవ్ కుమార్ దేబ్‌ ఒక ట్వీట్‌లో అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్, ఆయన నాయకత్వంలో త్రిపుర అభ్యుదయ పథంలో సాగుతుందనే నమ్మకం తనకుందని ఆయన అన్నారు. 2023లో త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నాయకత్వం మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది.


దీనికి ముందు శుక్రవారంనాడు బిప్లబ్ కుమార్‌‌ను ఢిల్లీకి పిలిపించి సీఎం పదవికి రాజానామా చేయాల్సిందిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశించారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కూడా బిప్లబ్ దేబ్ కలుసుకున్నారు. ఆ క్రమంలోనే బిప్లబ్ కుమార్ దేబ్ శనివారంనాడు గవర్నర్‌ సత్యదేవ్ నారాయణ్ ఆర్యను కలిసి  రాజీనామాను సమర్పించారు. ఆ వెనువెంటనే కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేలు కేంద్ర పరిశీలకులుగా అగర్తలా చేరుకున్నారు. అనంతరం లెజిస్లేచర్ పార్టీ నేతగా డాక్టర్ మానిక్ సహా ఎన్నికయ్యారు. వృత్తిరీత్యా డెంటిస్ట్ అయిన సాహా.. ఈ ఏడాది త్రిపుర నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న సాహా 2016లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2020లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు.

Read more