లలిత్ ఆదిత్య, ‘మల్లేశం’ ఫేమ్ అనన్యా నాగళ్ల జంటగా నటిస్తున్న చిత్రం ‘అభివ్యక్తి’. యాక్టింగ్ రీసెర్చ్ సెంటర్ స్థాపించి పలువురి చేత నటనలో ఓనమాలు దిద్దించిన యాక్టింగ్ గురు మహేశ్ గంగిమల్ల దీనికి దర్శక, నిర్మాత. ఇటీవల పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని ప్రారంభించారు. తొలి సన్నివేశానికి భూపాల్‌రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, హీరో రాకేశ్ వర్రి క్లాప్ ఇచ్చారు. మాధవ్ కోదాడ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. నా విద్యార్థులతో పాటు కొత్తవారికి అవకాశాలు ఇస్తాం. త్వరలో ‘టాలెంట్ హంట్’ నిర్వహిస్తాం’’ అని మహేశ్ గంగిమల్ల అన్నారు. ‘‘కథ గురించి ముందే తెలుసు. ఎప్పుడెప్పుడు చిత్రీకరణ ప్రారంభిస్తానా? అని ఎదురు చూస్తున్నా’’ అని అనన్యా నాగళ్ల చెప్పారు. సాయి రాఘవేంద్ర, సుందర్, రమణ నటిస్తున్న ఈ చిత్రానికి జైపాల్ ఛాయాగ్రాహకుడు.