పసందైన ఉగాది రుచులు
తెలుగు నూతన సంవత్సరాది అంటే ఇంట్లో రకరకాల వంటలు ఉండాల్సిందే. ముఖ్యంగా స్వీటు, బొబ్బట్లు, మామిడికాయ పులిహోర ఉండాల్సిందే. ఆ వంటల తయారీ విశేషాలు ఇవి...
కావలసినవి: బియ్యం - రెండు కప్పులు, పచ్చిమామిడికాయ - ఒకటి, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు - ఒక టీస్పూన్, ఇంగువ - చిటికెడు, ఎండుమిర్చి - ఒకటి, మినప్పప్పు - ఒక టీస్పూన్, శనగపప్పు - ఒక టేబుల్‌స్పూన్, పచ్చిమిర్చి - రెండు, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - చిటికెడు, కరివేపాకు - రెండు రెమ్మలు, వేరుశనగలు - ఒక టేబుల్‌స్పూన్.
తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం వండుకోవాలి. తరువాత ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకుని చల్లార బెట్టుకోవాలి. ఒక బౌల్లో మామిడికాయ తురుము తీసుకుని కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా నూనె పోసి వేడి అయ్యాక ఆవాలు, ఎండుమిర్చి వేయాలి. తరువాత ఇంగువ, మినపప్పు, శనగపప్పు, వేరుశనగలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపుని అన్నంలో కలుపుకోవాలి. తరువాత మామిడికాయ తురుము వేసి కలియబెట్టుకోవాలి. రుచికి తగిన ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.