మామిడి ప్రియం

ABN , First Publish Date - 2022-05-12T06:41:24+05:30 IST

మామిడి ప్రియం

మామిడి ప్రియం


  • ఈ సారి తగ్గిన దిగుబడులు
  • ధరలతో దడ పుట్టిస్తున్న సీజన్‌ పండు  
  • అతి వర్షాలే కారణమంటున్న అధికారులు
  • మార్కెట్‌లో కిలో మామిడి రూ.100 పైమాటే 

పరిగి, మే11: మామిడి సీజన్‌ వచ్చిందంటే చాలు.. టన్నుల కొద్ది కాయలను తోటల నుంచి తెంపడం.. వాటిని బండ్లలో మార్కెట్‌కు తరలించడంలో రైతులు బిజీబిజీగా ఉంటారు. నోరూరించే బంగినపల్లి మామిడి పండుకు మార్కెట్‌లో ఎంత పేరుందో.. రాజధాని శివారులోని పూడూరు బేనిషాన్‌కు అంతే పేరుందనడం అతిశయోక్తి కాదు. వికారాబాద్‌ జిల్లాలో పదేళ్లుగా మామిడి తోటల పెంపకం పెరుగుతోంది. ఏ రైతు చూసిన తమకు ఉన్న పొలంతో కొంతనైనా మామిడి తోటలను పెంచాలని మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం పరిగి, వికారాబాద్‌, తాండూరు మార్కెట్లలో మామిడి పండ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా పూడూరు మామిడితోటలకు ప్రసిద్ధిగా చెప్పుకోవచ్చు. జిల్లాలోని ఒక్క పూడూరు మండలంలో రెండు వేల ఎకరాల్లో సాగు ఉండగా, మిగతా మండలాల్లో మరో ఆరు వేలకుపైగా మామిడి తోటలు సాగులో ఉంది. ఇక్కడ పండించిన పండ్లను రాజధాని హైదారాబాద్‌ నగరమే కాకుండా రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మార్కెట్‌లలో కూడా పూడూరు మామిడి పండ్లకు డిమాండ్‌ ఉంది. అయితే ఈసారి కాత ఆశించినంత లేకపోవడంతో  దిగుబడి తగ్గింది. దీంతో ధరలు కూడా భగ్గుమంటున్నాయి. ఇటీవల ప్రకృతి వైఫరీత్యాల కారణంగా ఉన్న మామిడికాయలు  నేలరాలి  తీవ్ర నష్టం జరిగింది. దీంతో మామిడి పండ్లు మరింత ప్రియమయ్యాని ప్రజలు వాపోతున్నారు. 

మామిడి పండ్లకు కేరాఫ్‌ పూడూరు

జిల్లాలోనే మామిడిపండ్లకు పూడూరు మండలం కేరా్‌ఫగా  మారింది. ముఖ్యంగా  పూడూరు, రాకంచర్ల, పెద్ద ఉమ్మెంతాలలో మామిడి తోటల్లో రకరకాల పండ్లు లభ్యమవుతాయి. రాకంచర్ల తోట నుంచి మామిడి పండ్లను హైదరాబాద్‌తో పాటు, ఇతర రాష్ట్రాలకు తరలిస్తారు.  కాగా జిల్లాలోని పరిగి, వికారాబాద్‌, తాండూర్‌ పట్టణాలకు ఇతర ప్రాంతాల నుంచి భారీగా మామిడి పండ్లను తీసుకొచ్చి అమ్ముతున్నారు. 

మామిడిలో పోషక విలువలు

 మామిడి పండుకు ప్రత్యేక ప్రధాన్యం ఇస్తారు. వీటిలో ప్రధాన రకాలు తోటపురి,  నీలం, బంగినపల్లి, బేనీషా, రత్న, పెద్దరసం, మంజీరా, స్వర్ణరేఖ, దషేరి వంటి రకాలు ఎన్నో ఉన్నాయి. మాగిన ఒక మామిడి పండులో 86 శాతం నీరు. 0.6 శాతం మాంసకృత్తులు, 0.1శాతం క్రొవ్వుపదార్థాలు, 11.8 సుక్రోజ్‌, గ్లూకోజ్‌, ప్రక్టోస్‌ వంటి రసాయనాలు ఉంటాయి. తక్కువ శాతంలో రిబోఫ్లావిన్‌, కాల్షియం, భాస్వరం, ఇనుము వంటి మరెన్నో ఖనిజ లవణాలు లభిస్తాయి. కునుకనే ఎంతో రుచిని అందించే మామిడిని తినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. వేసవిలో లభించే పలాల్లో రారాజు అయిన మామిడి రుచి తగ్గంటూగానే ధరలు కూడా  మండుతున్నాయి. గత ఏడాదితో  పోలిస్తే మామిడి పండ్లకు ఈ ఏడాది  కాపు  తక్కువగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే మామిడి పండ్ల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. ఈ ఏడాది రకాలను బట్టి  కిలో మామిడి ధర రూ.100-150 వరకు పలుకుతోంది.

ఈసారి మామిడి దిగుబడి తక్కువే..

 ఆరు ఎకరాల్లో మామిడి తోట ఉంది. వాతావరణం అనుకూలించక గత ఏడాదితో పోలిస్తే సగం దిగుబడి ఉంది. మార్కెట్‌లో ధరలు ఉన్నప్పటికీ దిగుబడులు  తగ్గాయి.  తోటల దగ్గరనే మామిడి కాయలు  కిలో రూ.40 చొప్పున తీసుకెళుతున్నారు. ధరలు ఉన్న, దిగుబడి లేక నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. 

                                                 -మీర్‌ మహమూద్‌అలీ, మామిడి రైతు, పరిగి

ధరలు భగ్గుమంటున్నాయి  

మార్కెట్‌లో మామిడి పండ్ల ధరలు భగ్గుమంటున్నాయి. గత ఏడాది కంటే ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం కిలో రూ.100 నుంచి రూ.150 వరకు  విక్రయిస్తున్నారు. మామిడి పండ్లు  పేదలు తినలేని పరిస్థితి ఉంది. 

                                                                                 -అర్చన,పరిగి

Read more