ఛలో...మామిడి తోటల్లోకి...

ABN , First Publish Date - 2022-05-29T17:50:09+05:30 IST

వేసవి సెలవుల్లో రకరకాల టూర్లకు ప్రణాళికలు రచిస్తుంటారు. సమీప ప్రాంతాలకు పిక్నిక్‌లకు వెళ్తుంటారు. యాంత్రిక జీవనంలో కాస్త

ఛలో...మామిడి తోటల్లోకి...

ఇది మామిడి పళ్ల సీజన్‌. రోడ్డు పక్కన బండ్ల మీద కానీ, లేదంటే సూపర్‌ మార్కెట్లలో కానీ అందుబాటులో ఉన్న మామిడిపండ్లనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. చూడటానికి బంగారు వర్ణంలో బాగా కనిపించినప్పటికీ ఎలా మాగబెట్టారోననే అనుమానం ఉండనే ఉంటుంది. అదే మామిడి తోట దగ్గరికే వెళ్లి నచ్చిన పండ్లను రుచి చూసి మరీ కొనుక్కుంటే... అలాంటి అవకాశం కోసం బెంగళూరు ‘మ్యాంగో టూర్‌’కు వెళ్లాల్సిందే...



వేసవి సెలవుల్లో రకరకాల టూర్లకు ప్రణాళికలు రచిస్తుంటారు. సమీప ప్రాంతాలకు పిక్నిక్‌లకు వెళ్తుంటారు. యాంత్రిక జీవనంలో కాస్త కొత్తదనం ఆస్వాదించాలనుకునే వారి కోసం ఏర్పాటు చేసిందే ‘మ్యాంగో పికింగ్‌ టూర్‌’. బెంగళూరులోని ‘రాష్ట్ర మామిడి అభివృద్ధి, మార్కెటింగ్‌ కార్పొరేషన్‌’ ఐదారేళ్ల క్రితం ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అయితే కరోనా కారణంగా బ్రేక్‌ పడిన ఈ టూర్‌ మరోసారి మామిడిప్రియులకు అందుబాటులోకి వచ్చింది. 


2016లో మామిడి తోటల్లోకి విహార యాత్రగా వెళ్ళి, ఇష్టమైన మామిడి పండ్లను, కాయలను స్వయంగా కోసుకునేందుకు, రుచి చూసేందుకు ప్రత్యేక ‘మ్యాంగో పికింగ్‌ టూర్‌’ను కార్పోరేషన్‌ ప్రారంభించింది. తొలి ఏడాది సూపర్‌హిట్‌ అయ్యింది. బెంగళూరు నగరవాసులే కాకుండా దూరప్రాంతాలకు చెందిన అనేకమంది ప్రతీసారి ఈ టూర్‌ను ఎంజాయ్‌ చేశారు. ‘‘కొవిడ్‌ కారణంగా గత రెండేళ్ళుగా దీనికి బ్రేక్‌ పడుతూ వచ్చింది. ప్రస్తుతం సాధారణ స్థితి నెలకొన్న నేపథ్యంలో ఈ టూర్‌కు సన్నాహాలు చేపట్టాం’’ అని కార్పోరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సీజీ నాగరాజు అన్నారు. 


ఎలా సాగుతుందంటే.... 

‘మ్యాంగో పికింగ్‌ టూర్‌’ ప్రతిరోజూ బెంగళూరులో ప్రారంభం అవుతుంది. బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని జిల్లాలో ఎంపిక చేసిన మామిడి తోటలకు మామిడి ప్రియులు, సందర్శకులు వెళ్ళేందుకు రాయితీ చార్జీలతో బస్సు సదుపాయం ఏర్పాటు చేస్తారు. ఉదయం వెళ్ళి సాయంత్రానికల్లా ఇంటికి తిరిగి వచ్చేయొచ్చు. మామిడి తోటల పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు రైతులతో వినియోగదారులకు నేరుగా అనుసంధానం ఏర్పడేలా చేయడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశం. అయితే టూర్‌ అనగానే మామిడితోటల్లో తిరిగి రావొచ్చనుకుంటే తొక్క మీద కాలేసినట్లే... ఈ టూర్‌కు ఒక కండీషన్‌ ఉంది. అదేమిటంటే... టూర్‌లో పాల్గొనే వారు కనీసం 5 కిలోల మామిడికాయలు కొనుగోలు చేయాల్సిందే. సందర్శకులు సదరు తోటకు చెందిన రైతు నుండి నేరుగా మామిడిపండ్లు లేదా కాయలు కొంటారు. అవి ఎలా? ఎన్ని రోజుల్లో మాగుతాయో కూడా సదరు రైతే వినియోగదారులకు వివరిస్తాడు. తోటలో బాగా మాగిన మామిడిపండ్ల రుచి చూసిన తర్వాతే పండ్లను కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది.  


వెబ్‌సైట్‌లో పేర్ల నమోదు...  

వినూత్నమైన ఈ టూర్‌లో పాల్గొనడానికి ఆసక్తి చూపేవారు ‘కర్ణాటక స్టేట్‌ మ్యాంగో డెవలప్‌మెంట్‌, మార్కెటింగ్‌ కార్పొరేషన్‌’ వెబ్‌సైట్‌లో తమ పేరు, చిరునామా, ఇ-మెయిల్‌ ఇత్యాది వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. బస్సులో ఒకేసారి 50 నుంచి 60 మందిని మామిడి తోటల టూర్‌కు తీసుకెళతారు. ‘‘ప్రస్తుతానికి వారానికి ఒకరోజు మాత్రమే ఈ టూర్‌ ఉంది. డిమాండ్‌ పెరిగితే ప్రతిరోజూ టూర్‌ను నిర్వహిస్తాం. ఈ టూర్‌తో పాటు ‘కర్ణాటక తోటల అభివృద్ధి శాఖ’ సహకారంతో ఇక్కడి లాల్‌బాగ్‌లో దాదాపు 20కి పైగా రకాల మామిడి పండ్లతో ప్రత్యేక మేళాను ఏర్పాటు చేయడం ద్వారా రైతులను ప్రోత్సహిస్తున్నాం’’ అని అధికారులు తెలిపారు. 


మామిడి రైతులను ప్రోత్సహించేందుకు, పంటకు సరైన మార్కెట్‌ చేసేందుకు కార్పోరేషన్‌ గత కొన్నేళ్లుగా చేస్తున్న అనేక ప్రయత్నాలు విజయవంతం అవుతున్నాయి. నగర ప్రజలు తమకు ఇష్టమైన మామిడి పండ్లను నేరుగా ఇంటిముంగిటకే తెప్పించు కునేందుకు వీలుగా పోస్టల్‌శాఖతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. 5 కిలోలు, ఆపై ఆర్డరు చేసిన వారికి పోస్టల్‌ శాఖ తాజా మామిడిపండ్లను అందిస్తోంది. సీజన్‌ ముగిసేంతవరకు మామిడితోటల్లోకి నేరుగా వెళ్లే ఈ టూర్‌ను సరదాగా, రుచికరంగా అందరూ ఎంజాయ్‌ చేయొచ్చు. 

- అబ్దుల్‌ రజాక్‌, బెంగళూరు

Updated Date - 2022-05-29T17:50:09+05:30 IST