మామిడి.. తగ్గన దిగుబడి!

ABN , First Publish Date - 2022-04-24T06:42:43+05:30 IST

జిల్లాలో ఈ ఏడాది మామిడి కాత బాగా తగ్గింది. వాతావరణ మార్పుల కారణంగా మామిడి పూత ఆలస్యంగా వచ్చింది. దీంతో సగం చెట్లే పూత పూశాయి. వచ్చిన పూతలో అధిక శాతం నిలవలేదు. కొన్ని మామిడి తోటల్లో పూత రాలేదు. దీంతో దిగుబడి భారీగా తగ్గిందని మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు.

మామిడి.. తగ్గన దిగుబడి!

మామిడి చెట్లకు కానరాని పూత.. కాత

మంచు, తెగుళ్లతో రాలిన వైనం

రైతులను వెంటాడుతున్న నష్టభయం

ప్రభుత్వం ఆదుకోవాలని మామిడి రైతుల విజ్ఞప్తి

జిల్లాలో మూడు వేల  ఎకరాల్లో మామిడి పంట సాగు

సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 23: జిల్లాలో ఈ ఏడాది మామిడి కాత బాగా తగ్గింది. వాతావరణ మార్పుల కారణంగా మామిడి పూత ఆలస్యంగా వచ్చింది. దీంతో సగం చెట్లే పూత పూశాయి. వచ్చిన పూతలో అధిక శాతం నిలవలేదు. కొన్ని మామిడి తోటల్లో పూత రాలేదు. దీంతో దిగుబడి భారీగా తగ్గిందని మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాదితో పోలిస్తే అధిక శాతం దిగుబడి తగ్గిందని రైతులు వాపోతున్నారు. సాధారణంగా మామిడి పూత డిసెంబరులో ప్రారంభమై జనవరి కల్లా పిందె పడుతుంది. కొన్ని చెట్లకు సకాలంలో పూసిన పూత నిలవగా, ఆలస్యంగా వచ్చిన పూత ఎండలకు రాలిపోయింది. కాగా, అధిక వర్షాలు.. మంచు, తెగుళ్లతో మామిడి దిగుబడి తగ్గిందని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

మార్కెట్‌లో కానరాని మామిడి..

వేసవి వచ్చిందంటే మామిడి పండ్లకు గిరాకి ఎక్కువ. ఈ కాలంలో ఎక్కువగా మామిడి పండ్లను ప్రజలు కొనుగోలు చేస్తారు. అయితే వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల మామిడి దిగుబడి భారీగా తగ్గింది. దీంతో మార్కెట్‌లో మామిడి పండ్లు కానరావడం లేదు. ఇప్పటికే మామిడి పండ్ల సీజన్‌ ప్రారంభమై 20 రోజులు కావస్తున్నా మార్కెట్‌లో పండ్లు తక్కువగానే కనిపిస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో మామిడి పండ్లు ప్రియం కానున్నాయి. వ్యాపారికే గతంలో కంటే రెండు, మూడు రెట్లు ఎక్కువగా లభించడంతో కొనుగోలుదారులకు మరింత ప్రియం కానున్నాయి. గతేడాది మార్కెట్‌లో వివిధ రకాల మామిడి పండ్లు లభించగా ప్రస్తుతం కొన్ని రకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఏటా ఈ పాటికే ఎక్కువ మొత్తంలో మామిడి పండ్లు మార్కెట్‌లో అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా సాగేవి.

తగ్గిన దిగుబడి..

జిల్లాలో ఏటా సుమారు 3వేల ఎకరాల్లో మామిడి పంటను రైతులు పండించారు. అయితే ఎకరాకు సుమారు 4టన్నుల మామిడి దిగుబడి రావాల్సి ఉండగా ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మామిడి దిగుబడి తగ్గింది. సుమారు ఎకరాకు 2 నుంచి రెండున్నర టన్నులు మాత్రమే వచ్చిందని ఉద్యానవనశాఖ అధికారులు తెలిపారు. 3వేల ఎకరాలకు సుమారు 1200 టన్నుల మామిడి పంట రావాల్సి ఉండగా కేవలం 6 నుంచి కేవలం 8వేల టన్నులే ప్రస్తుతం చేతికి రానుంది. దీంతో ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తోంది.

పూత దశలోనే తెగుళ్ల దాడి..

మామిడి పంటపై ఈ సంవత్సరం అతివృష్టి అనావృష్టి దాడిచేయడంతో మామిడి దిగుబడి తగ్గింది. దీనికితోడు తెగుళ్లు దాడిచేయడంతో మామిడి పంట దిగుబడి సగానికి సగం తగ్గింది. మామిడి తెగుళ్లు ముఖ్యంగా తేనెమంచు, తామర తెగుళు తాకిడికి మామిడి పంట పూత దశలోనే రాలిపోయింది. దీనికి తోడు వాతావరణం కూడా అనుకూలించకపోవడంతో మామిడి దిగుబడి రాలేదు. ఈ సంవత్సరం పూత కూడా ఆలస్యంగా రావడంతో తెగుళ్లు దాడిచేయడానికి కారణమయ్యాయి. తెగుళ్ల దాడికి పలు రకాల మందులను ఆశ్రయించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. 

గతంతో పోలిస్తే అధిక రేట్లు..

మామిడి రేట్లు మార్కెట్‌లో భగ్గుమంటున్నాయి. గతంతో పోలిస్తే మూడు నాలుగు రేట్లు ఎక్కువగా పెరిగాయి. మామిడి పండ్లు క్యారెట్‌ రూ.500 రావాల్సి ఉండగా ప్రస్తుతం రూ.1500 పలుకుతోంది. మామిడికాయ క్యారెట్‌ కూడా రూ.120 రావాల్సి ఉండగా రూ.1200 లభిస్తుంది. దీంతో మామిడి పచ్చడి ప్రియులకు మామిడికాయ అందని ద్రాక్షలాగే తయారైంది. మార్కెట్‌లో గతంలో 5 నుంచి 10 రూపాయలకు కాయ లభించగా ప్రస్తుతం 20 రూపాయలకు లభిస్తుంది. దీంతో కొనుగోలుదారులు మామిడి జోలికి వెళ్లడంలేదు.

పంట తెగుళ్లబారిన పడింది.. 

: సుమన్‌, రైతు (మాదాపూర్‌)

పూత దశలోనే మామిడి పూత సగానికి సగం రాలిపోవడంతో మామిడి దిగుబడి తగ్గింది. దీనికితోడు చాలాచోట్ల అసలు పూత కూడా రాలేదు. వాతావరణం అనుకూలించకపోవడంతో సగం పంట రాలేదు. పూత దశ తర్వాత తెగుళ్లు సోకడంతో వచ్చిన పూత కూడా రాలిపోయింది.

మామిడి పండ్లకు డిమాండ్‌ పెరిగింది..

: సాగర్‌, వ్యాపారి (నందిపేట)

మామిడి పంట తగ్గడంతో మార్కెట్‌లో మామిడికి డిమాండ్‌ పెరిగింది. మాపైన ఉన్న వ్యాపారులు రేట్లు పెంచడంతో గతంలో క్యారెట్‌ రావాల్సిన రేటుకంటే ప్రస్తుతం ఎక్కువగా ఉంది. దీంతో మామిడి పండ్లు ఎక్కువ రేటుకు విక్రయించాల్సి వస్తుంది. మామిడి రేటు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

మామిడి పంట దిగుబడి తగ్గింది..

: నర్సింగ్‌దాస్‌, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి

జిల్లాలో గతంలో కంటే దిగుబడి తగ్గింది. 3వేల ఎకరాల్లో పంట సాగు చేయగా 1200 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా దాంట్లో సుమారు సగం దిగుబడి మాత్రమే వచ్చింది. తెగుళ్లు, వాతావరణ అనుకూలం లేకపోవడం వల్ల దిగుబడి తగ్గింది.

Updated Date - 2022-04-24T06:42:43+05:30 IST