మామిడి రైతు కుదేలు

ABN , First Publish Date - 2022-05-19T06:07:18+05:30 IST

ప్రకృతి వైపరిత్యాలతో మామిడి రైతు కుదేలు అవుతున్నాడు. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలకు మామిడి రైతుల ఆశలు నేల రాలుతున్నాయి.

మామిడి రైతు కుదేలు


- ఈదురు గాలులకు రాలిన మామిడి కాయలు

- విలవిల్లాడుతున్న మామిడి రైతులు

- జిల్లాలో 34 వేల ఎకరాల్లో మామిడి సాగు

- 40 వేల టన్నుల దిగుబడి అంచనా


జగిత్యాల, మే 18 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైపరిత్యాలతో మామిడి రైతు కుదేలు అవుతున్నాడు. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలకు మామిడి రైతుల ఆశలు నేల రాలుతున్నాయి. ప్రస్తుత సీజన్‌లో పలు పర్యాయాలు ఈదురు గాలులు, వర్షాల వల్ల చేతికందుతున్న మామిడి కాయలు నేలరాలి రైతులు లబోదిబోమంటున్నారు. పూత దశలో మామిడి పంటకు వ్యాపించిన చీడపీడల వల్ల అసలే దిగుబడి తగ్గి దిగాలుతో ఉన్న రైతులను అకాల వర్షాలు ఉన్నది కాస్తా ఊడేస్తుండడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. జగిత్యాల జిల్లాలో  పదిహేను రోజులుగా మూడు పర్యాయాలు ఈదురు గాలులు, అకాల వర్షాలు కురవడంతో మామిడి కాయలు రాలిపోయి రైతులు దిగులు చెందుతున్నారు.

- చీడపీడలతో, వాతావరణ మార్పులతో..

జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో సుమారు 34 వేల ఎకరాల్లో మామిడి సాగు అవుతోంది. మామిడి పూత నిండుగా వచ్చినప్పటికీ చీడ పీడల దాడి వల్ల సగానికి పైగా రాలిపోయింది. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ప్రస్తుత సీజన్‌లో తేనె మంచు, బూడిద, నల్లతామర వంటి చీడపీడలు ఆశించాయి. దీంతో పూత దశలోనే రైతులు ఇక్కట్ల పాలయ్యారు. వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి రెండున్నర నుంచి మూడు టన్నుల చొప్పున సుమారు 90 వేల టన్నుల నుంచి 1.10 లక్షల టన్నుల వరకు దిగుబడి అంచనా వేశారు.  కానీ తెగుళ్లు, రోగాలు, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం వల్ల సుమారు సగానికి పడిపోయి 40 వేల నుంచి 50 వేల టన్నుల వరకు దిగుబడి వస్తుందన్న అంచనాలున్నాయి.

- రెండు సీజన్‌లలో కరోనా ప్రభావం..

గత రెండు సీజన్‌లలో కరోనా ప్రభావం వల్ల మార్కెటింగ్‌ లేక నష్టాల పాలయిన మామిడి రైతులు ప్రస్తుత సీజన్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఢిల్లీ, బెంగుళూరు వంటి ప్రాంతాల్లో కరోనా ఎక్కువగా ఉండడం వల్ల గత రెండు సంవత్సరాలుగా మామిడికి తగిన మార్కెటింగ్‌ లేకుండా పోయింది. దీనికి తోడు విదేశాలకు సైతం మామిడిని ఎక్స్‌పోర్టు చేయలేకపోయారు. మామిడికి ధర రాక, మార్కెట్‌ వసతులు లేక రైతులు రెండు సీజన్‌లలో భారీగా నష్టాలకు గురయ్యారు. ఢిల్లీ ప్రాంతం నుంచి వ్యాపారులు సైతం రాకపోవడం, వచ్చిన వ్యాపారులు నామమాత్రంగా కొనుగోలు చేయడంతో మామిడి రైతులకు రెండు సీజన్‌లలో ఆశించిన ధరలు రాలేదు. 

- అకాల వర్షాలతో ఆగమాగం.. 

అసలే దిగుబడి తక్కువ వస్తున్న ప్రస్తుత సీజన్‌లో ఆపై అకాల వర్షాలు రైతులను దెబ్బతీస్తున్నాయి. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు వరసగా కురవడం వల్ల మామిడి కాయలు నేల రాలుతున్నాయి. పదిహేను రోజుల్లో నాలుగు పర్యాయాలు జిల్లాలోని పలు చోట్ల అకాల వర్షాలు కురిశాయి. దీనికి తోడు విపరీతమైన ఈదురు గాలులు వీయడంతో సుమారు మూడు వేల ఎకరాల్లో మామిడి కాయలు నేల రాలాయి. జిల్లాలో గత నెల 27, 28వ తేదీల్లో అకాల వర్షాలు కురిశాయి. ఈనెల 4వ, 15వ తేదీన ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. గత నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల సుమారు వెయ్యి ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిన్నట్లుగా అంచనా ఉంది. ఈనెలలో 4వ తేదీన కురిసిన అకాల వర్షాలకు స్వల్పంగా మామిడి పంట దెబ్బతింది. ఈనెల 15వ తేదీన కురిసిన వర్షాలు, ఈదురు గాలుల వల్ల సుమారు 731 హెక్టార్లలో మామిడి పంట దెబ్బతిన్నట్లు ఉద్యనవన శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో 42 హెక్టార్లు, మల్లాపూర్‌లో 128 హెక్టార్లలో, జగిత్యాల రూరల్‌ మండలంలో 121 హెక్టార్లు, రాయికల్‌లో 320 హెక్టార్లు, ధర్మపురిలో 48 హెక్టార్లు, పెగడపల్లి 32 హెక్టార్లు, వెల్గటూరులో 40 హెక్టార్లలో మామిడి పంట నష్టపోయినట్లు అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు.

- 33 శాతానికి మించితేనే..

ఏదైనా ఉద్యానవన పంట 33 శాతానికి మించి నష్టం వాటిల్లితేనే నష్టం జరిగినట్లు గుర్తిస్తామని ఆ శాఖ అధికారులు అంటున్నారు. జిల్లాలో మాత్రం నష్టం పాతిక శాతంలోపే ఉందని పేర్కొంటున్నారు. కాగా పంట నష్టంపై క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలన చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు ముందుకు వచ్చి తమ పంటకు నష్టం వాటిల్లిందని సమాచారం అందిస్తే వివరాలు నమోదు చేస్తున్నట్లు అంటున్నారు. ఆర్థికంగా బలంగా ఉండే పలువురు ఫాం హౌజ్‌ యజమానులు, బడా రైతులు తమ పంట నష్టపోయినట్లు అధికారుల దృష్టికి పెద్దగా తేవడం లేదని తెలుస్తోంది. 

- 8 వేల టన్నుల మామిడి కొనుగోళ్లు...

జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత సీజన్‌లో 40 వేల నుంచి 50 వేల టన్నుల వరకు దిగుబడి వస్తుందన్న అంచనాలున్నాయి. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌, మేడిపల్లిలో మామిడి మార్కెట్‌లున్నాయి. జగిత్యాలలో సుమారు వంద మందికి పైగా మామిడి వ్యాపారులు ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేసుకొని కొనుగోళ్లు జరుపుతుండగా, మెట్‌పల్లిలో అయిదుగురు, కోరుట్లలో అయిదుగురు, ఇతర ప్రాంతాల్లో స్వల్ప సంఖ్యలో మామిడి వ్యాపారులు కొనుగోళ్లను జరుపుతున్నారు. సుమారు నెల రోజులుగా జరుగుతున్న మార్కెట్‌లో ఇప్పటివరకు సుమారు 8,500 టన్నుల మామిడి కొనుగోళ్లు జరిపారు. బంగినిపల్లి క్వింటాళ్‌కు 2,200 రూపాయల నుంచి  4,500 రూపాయల వరకు, తోతాపురి రూ. 1,000 నుంచి రూ. 1,300, ఇతర రకాలు రూ. 1,200 వరకు ధరలు పలుకుతున్నాయి. జిల్లాలో సుమారు పాతిక శాతం మాత్రమే మామిడి కొనుగోళ్లు జరిగినట్లు అంచనా ఉంది.


Updated Date - 2022-05-19T06:07:18+05:30 IST