మామిడితో మహా మజా

ABN , First Publish Date - 2021-06-19T05:30:00+05:30 IST

మామిడిపండు ఎవర్‌గ్రీన్‌. వాటితో చేసే ఏ రెసిపీ అయినా నోరూరేలా చేస్తుంది. కోయడానికి అనువుగా ఉన్న మామిడిపండుతో ఫిర్ని, తిరమసు, కుల్ఫీ, అమరఖంద్‌ వంటి రెసిపీలను ట్రై చేస్తే జిహ్వచాపల్యం తీరుతుంది. ఆ రెసిపీల విశేషాలు ఇవి...

మామిడితో మహా మజా

మామిడిపండు ఎవర్‌గ్రీన్‌. వాటితో చేసే ఏ రెసిపీ అయినా నోరూరేలా చేస్తుంది. కోయడానికి అనువుగా ఉన్న మామిడిపండుతో ఫిర్ని, తిరమసు, కుల్ఫీ, అమరఖంద్‌ వంటి రెసిపీలను ట్రై చేస్తే జిహ్వచాపల్యం తీరుతుంది. ఆ రెసిపీల విశేషాలు ఇవి...



వందగ్రాముల మామిడిపండులో పోషకాలు...

క్యాలరీలు 60

కార్బోహైడ్రేట్లు 15గ్రా

ప్రోటీన్లు 0.8గ్రా

మామిడిపండులో ఫ్యాట్‌, సోడియం, కొలెస్ట్రాల్‌ ఉండదు.

విటమిన్లు, లవణాలు 20 రకాల వరకు ఉంటాయి.

విటమిన్‌ -సి, విటమిన్‌ - ఎ, విటమిన్‌ -బి6 పుష్కలంగా లభిస్తాయి. 

ఈ పండు తింటే ఫోలేట్‌, కాపర్‌, తగినంత ఫైబర్‌ అందుతాయి.




మ్యాంగో ఫిర్ని

కావలసినవి

బియ్యం - 150గ్రా, పంచదార - 200గ్రా, పాలు - 500ఎంఎల్‌, యాలకులు - 10గ్రా, మామిడిపండు గుజ్జు - 100గ్రా, బాదంపలుకులు - 25గ్రా.


తయారీ విధానం

  • ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీలో వేసి కొద్దిగా గ్రైండ్‌ చేయాలి.
  • స్టవ్‌పై పాన్‌పెట్టి పాలు పోసి, యాలకుల పొడి వేసి మరిగించాలి.
  • ఇప్పుడు గ్రైండ్‌ చేసి పెట్టుకున్న బియ్యం వేయాలి. చిన్నమంటపై అరగంటపాటు ఉడికించాలి. 
  • బియ్యం ఉడికిన తరువాత పంచదార వేసి కలపాలి.
  • స్టవ్‌పై నుంచి దింపి చల్లారిన తరువాత మామిడిపండు గుజ్జు వేసి మరోసారి బ్లెండ్‌ చేయాలి.
  • ఫ్రిజ్‌లో అరగంటపాటు పెట్టాలి. బాదంపలుకులతో గార్నిష్‌ చేసుకోవాలి. ఈ కూల్‌ మ్యాంగో ఫిర్ని టేస్ట్‌ చేస్తే మీ జిహ్వచాపల్యం తీరుతుంది.

మ్యాంగో కుల్ఫీ

కావలసినవి

పాలు - 500ఎంఎల్‌, కండెన్స్‌డ్‌ మిల్క్‌ - 100ఎంఎల్‌, మామిడిపండు గుజ్జు - 100గ్రా, పంచదార - 50గ్రా, కోవా - 50గ్రా.


తయారీ విధానం

  • స్టవ్‌ ఒక పాత్రను పెట్టి పాలు పోసి మరిగించాలి. చిన్నమంటపై పాల పరిమాణం సగానికి తగ్గే వరకు మరిగించాలి.
  • ఇప్పుడు కండెన్స్‌డ్‌ పాలు పోసి, పంచదార వేసి కలుపుకోవాలి.
  • తరువాత కోవా వేసి చిన్నమంటపై ఉడికించాలి. 
  • స్టవ్‌పై నుంచి దింపి చల్లారిన తరువాత అందులో మామిడిపండు గుజ్జు వేసి బ్లెండ్‌ చేయాలి.
  • ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్‌లో పోసుకోవాలి.
  • 6 నుంచి 8 గంటలపాటు డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టాలి. 
  • చల్లచల్లని మ్యాంగో కుల్ఫీని సర్వ్‌ చేసుకోవాలి.

అమరఖంద్‌

కావలసినవి

హంగ్‌ కర్డ్‌ - 150గ్రా, పంచదార పొడి - 150గ్రా, మామిడిపండ్లు - రెండు, యాలకుల పొడి - 10గ్రా.


తయారీ విధానం

  • మామిడిపండ్లను ముక్కలుగా చేసి మిక్సీలో వేసి గుజ్జుగా చేసుకోవాలి. 
  • తరువాత అందులో హంగ్‌కర్డ్‌, పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
  • మూడు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. 
  • మామిడిపండు ముక్కలతో గార్నిష్‌ చేసుకుని చల్లటి అమరఖంద్‌ను సర్వ్‌ చేసుకోవాలి.

మ్యాంగో బేక్డ్‌ యోగర్ట్‌

కావలసినవి

కండెన్స్‌డ్‌ మిల్క్‌ - 300 ఎంఎల్‌, హంగ్‌ కర్డ్‌ - 100గ్రా,  క్రీమ్‌- 100ఎంఎల్‌, మామిడి పండ్లు - రెండు, పంచదార - 100గ్రా.


తయారీ విధానం

  • హంగ్‌ కర్డ్‌ను చిలకాలి. తరువాత పంచదార పొడిని కలపాలి. 
  • ఇప్పుడు కండెన్స్‌డ్‌ పాలు, కుకింగ్‌ క్రీమ్‌ వేసి కలియబెట్టాలి. 
  • మామిడి పండును చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసి వేయాలి.
  • ఒక ట్రేలో పోయాలి. డబల్‌ బాయిలర్‌లో పెట్టి ఓవెన్‌లో(120డిగ్రీల సెంటీగ్రేడ్‌) అరగంటపాటు బేక్‌ చేయాలి. 
  •  మామిడి పండు ముక్కలతో గార్నిష్‌ చేసుకుని చల్లటి మ్యాంగో బేక్డ్‌ యోగర్ట్‌ను సర్వ్‌ చేసుకోవాలి.

సి. రామకృష్ణారెడ్డి

సూ చెఫ్‌

గోల్కొండ రిసార్ట్స్‌ అండ్‌ స్పా, హైదరాబాద్‌

ఫోన్‌: 9110726536


మ్యాంగో తిరమిసు 

కావలసినవి

మాస్కార్‌పోన్‌ ఛీజ్‌ - 100గ్రా, విప్‌ క్రీమ్‌ - 75 గ్రా, కోడిగుడ్డు పచ్చసొన - మూడు, చాక్లెట్‌ స్పాంజ్‌ - 100గ్రా, పంచదార పొడి - 50గ్రా, కోకో పౌడర్‌ - 10గ్రా, మామిడిపండ్లు - రెండు, కాఫీ లిక్కర్‌ - 25ఎంఎల్‌.


తయారీ విధానం

  • ఒక పాత్రలో మాస్కార్‌పోన్‌ ఛీజ్‌, క్రీమ్‌ను తీసుకుని బాగా కలిపి మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి. 
  • క్రీమ్‌, మామిడిపండు గుజ్జు కలుపుకోవాలి.
  • చాక్లెట్‌ స్పాంజ్‌ను గ్లాసు సైజును బట్టి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత కాఫీ లిక్కర్‌, పంచదార పానకం పోయాలి.
  • మాస్కార్‌పోన్‌ ఛీజ్‌ లేయర్‌, మ్యాంగో క్రీమ్‌ లేయర్‌ వేసుకోవాలి.
  • రెండు, మూడు లేయర్లుగా వేసి ఫ్రిజ్‌లో రెండు గంటలు పెట్టాలి.
  • కోకో పౌడర్‌, మామిడిపండు ముక్కలతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2021-06-19T05:30:00+05:30 IST