Abn logo
Jun 18 2021 @ 01:09AM

మామిడి కష్టం మంత్రి వల్లే

రైతుల ఆరోపణ, చిత్తూరులో ధర్నాచిత్తూరు, జూన్‌ 17: గుజ్జు పరిశ్రమల యజమానులు సిండికేట్‌ అయి ధరలను తగ్గించడంలో జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందని రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి ధరలు భారీగా పతనమవడంపై గురువారం చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతు సంఘం నేతలు మాట్లాడుతూ.. మంత్రి పెద్దిరెడ్డికి చెందిన మామిడి గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి కాబట్టే ఇతర ఫ్యాక్టరీలతో కలిసి ధరలు తగ్గించారని విమర్శించారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘాలు పదే పదే అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం మామిడికి ధర లేకపోవడంతో రైతులు మరింత నష్టాల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ.. రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జిల్లా యంత్రాంగం స్పందించి మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో రైతు సంఘం నేతలు జనార్దన్‌, నాగరాజన్‌, సురేంద్రన్‌, ఈదల వెంటకాచలం నాయుడు తదితరులు పాల్గొన్నారు.