బీటీ, వంతెన నిర్మాణం చేపట్టాల్సిన మంగళపల్లి - చెన్నారం రోడ్డు ఇదే..
- దశాబ్దాలుగా ప్రతిపాదనల్లోనే..
- వాగుపై వంతెన లేక రాకపోకలకు ఇబ్బందులు
- అమలు కాని నేతల హామీలు
ఆమనగల్లు, జనవరి 27: మండలపరిధి మంగళపల్లి- చెన్నారం రోడ్డును బీటీగా మార్చి వాగుపై వంతెన నిర్మించాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. రోడ్డు సరిగా లేక రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. మంగళపల్లి నుంచి చెన్నారం 5కిలోమీటర్ల రోడ్డును బీటీగా మారిస్తే ఆమనగల్లు, షాద్‌నగర్ వెళ్లడానికి ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. మూడేళ్ల క్రితం ఆమనగల్లు-షాద్‌నగర్ రోడ్డు నుంచి మంగళపల్లి వరకు బీటీ రోడ్డు వేశారు. మంగళపల్లి-చెన్నారం బీటీ రోడ్డు గురించి పట్టించుకోలేదు. ఈ రోడ్డులో మంగళపల్లి సమీపంలోని వాగుపై వంతెన లేక వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. మంగళపల్లి రైతుల పొలాలు వాగు అవతల ఉన్నాయి. పెద్ద వర్షం వస్తే రైతులు పొలాలకు వెళ్లలేని పరిస్థితి. ఇటీవల పంచాయతీ డంపింగ్ యార్డ్, వైకుంఠధామాలు కూడా ఈ రోడ్డును అనుసరించే చేపట్టారు. వంతెన, బీటీ రోడ్డు నిర్మాణంపై రాజకీయ నాయకులు హామీ ఇస్తున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా మంగళపల్లి-చెన్నారం రోడ్డును బీటీగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు.
ఏళ్లుగా తప్పని ఇబ్బందులు
రోడ్డు సరిగా లేక రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. మంగళపల్లి- చెన్నారం రోడ్డును బీటీగా మార్చే విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలి. వాగుపై వంతెన నిర్మించాలి. వాగు సాగినప్పుడల్లా రైతులు పొలాలకు వెళ్లడానికి, ప్రజలు ఇతర ప్రాంతాలకు పోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. బీటీ రోడ్డు, వంతె నలకు ప్రభుత్వం నిధులు కేటాయించాలి.
- కె.జంగయ్య, మంగళపల్లి
ప్రభుత్వానికి నివేదించాం
మంగళపల్లి- చెన్నారం రోడ్డును బీటీగా మార్చి వాగుపై వంతెన నిర్మించాలని ప్రభుత్వానికి నివేదించాం. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చాం. మండల సమావేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించా. వీలైనంత త్వరగా బీటీ రోడ్డు, వంతెన నిర్మాణానికి కృషిచేస్తా.
- జక్కు అనంతరెడ్డి, ఎంపీటీసీ, మంగళపల్లి