Advertisement
Advertisement
Abn logo
Advertisement

పనులు చేసేశాక.. టెండర్లు

మంగళగిరిలో నయా సంస్కృతి

అక్రమాలు జరిగాయంటూ టీడీపీ ఆరోపణ

పనులను పరిశీలించిన ఆ పార్టీ నేతలు 

మంగళగిరి, డిసెంబరు 7: ప్రభుత్వపరంగా ఎక్కడైనా అభివృద్ధి పనులు చేయాలంటే ముందుగా టెండర్లు పిలుస్తారు. కాంట్రాక్టును ఫైనలైజ్‌ చేశాక సదరు కాంట్రాక్టరు పనులను మొదలెడతారు. కానీ మంగళగిరిలో ముందు పనులు చేసేసి ఆ తరువాత వాటికి టెండర్లను పిలుస్తున్నారు. వివరాలావి.. నగరంలోని గౌతమబుద్దరోడ్డులో ఇటీవల సెంట్రల్‌ వెర్జ్‌ పనులను నగరపాలకసంస్థ నిర్వహిస్తోంది. 40 రోజుల కిందటే పాత సెంట్రల్‌ వెర్జ్‌ను సంపూర్తిగా తొలగించి వారం రోజులుగా పునర్మిర్మాణ పనులను చేపట్టారు. పాత సెంట్రల్‌ వెర్జ్‌ తొలగింపునకు రూ.16లక్షల అంచనాలతో తాజాగా టెండర్లను పిలిచి చివరిగడువుగా డిసెంబరు నాల్గవ తేదీని పేర్కొన్నారు. కానీ, టెండరు ఫైనలైజ్‌ కాకుండానే నవంబరు 15వ తేదీనే సంబంధిత పనులను ప్రారంభించి పూర్తిగా తొలగించివేశారు. ప్రస్తుతం రూ.1.50 కోట్ల వ్యయంతో పునఃనిర్మాణ పనులను ఆరంభించారు.  పనులను ముందు చేసేసి టెండర్లను తరువాత పిలవడమేమిటంటూ టీడీపీ నేతలు గంజి చిరంజీవి, పోతినేని శ్రీనివాసరావు ప్రశ్నించారు.  మంగళవారం సాయంత్రం టీడీపీ బృందం సదరు గౌతమబుద్ధరోడ్డుపై నిర్మిస్తున్న కొత్త సెంట్రల్‌ వెర్జ్‌ పనులను పరిశీలించింది. ఈ వ్యవహరంలో ఎమ్మెల్యేతో పాటు ఎంటీఎంసీ అధికారులను బాధ్యులనుగా చేస్తూ హైకోర్టులో కేసు వేసి న్యాయస్థానం ముందు దోషులను నిలబెడతామని నేతలు స్పష్టం చేశారు. 


Advertisement
Advertisement