మందేస్తూ.. చిందేస్తూ..!!

ABN , First Publish Date - 2022-06-30T06:29:12+05:30 IST

అనకాపల్లి మండలంలోని మేజర్‌ పంచాయతీ తుమ్మపాలలో అనధికారిక బార్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పాన్‌షాపుల నిర్వహణ పేరుతో పరదాలు కట్టి, తాటాకుల షెడ్లు వేసి యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. అధిక ధరలకు మద్యం అమ్మకాలు సాగిస్తుండడంతో పాటు మందుబాబులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ తంతు ఇంత బహిరంగంగా సాగుతున్నా కన్నెత్తి చూసేవారే లేకపోవడం విశేషం.

మందేస్తూ.. చిందేస్తూ..!!
వెంకుపాలెం రోడ్డులో పరదాలు కట్టి నిర్వహిస్తున్న అనధికార బార్‌లో మద్యం సేవిస్తున్న మందుబాబులు

 తుమ్మపాలలో పుట్టగొడుగుల్లా అనధికార బార్లు

 పాన్‌షాపుల మాటున పరదాలు కట్టి నిర్వహణ

 అధిక ధరలకు మద్యం విక్రయాలు 

  అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలు

 చోద్యం చూస్తున్న అధికారులు 

 

 అనకాపల్లి మండలంలోని మేజర్‌ పంచాయతీ తుమ్మపాలలో అనధికారిక బార్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పాన్‌షాపుల నిర్వహణ పేరుతో పరదాలు కట్టి, తాటాకుల షెడ్లు వేసి యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. అధిక ధరలకు మద్యం అమ్మకాలు సాగిస్తుండడంతో పాటు మందుబాబులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ తంతు ఇంత బహిరంగంగా సాగుతున్నా కన్నెత్తి చూసేవారే లేకపోవడం విశేషం. 


తుమ్మపాల, జూన్‌ 29 : తుమ్మపాల పంచాయతీ పరిధి వెంకుపాలెం రోడ్డులో పాన్‌షాపుల నిర్వహణ పేరుతో పెద్ద సంఖ్యలో అనధికార బార్లు ఏర్పాటయ్యాయి. ఈ రోడ్డులో గల  ప్రభుత్వ మద్యం షాపులో దఫ దఫాలుగా మద్యం బాటిళ్లను  పాన్‌షాపు యజమానులు  కొని, వాటిని అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఫుల్‌బాటిల్‌పై సుమారు రూ.మూడొందలు, ఆఫ్‌ బాటిల్‌పై వంద నుంచి రెండు వందలు, క్వార్టర్‌ బాటిల్‌పై యాభై నుంచి వంద రూపాయలు ఎంఆర్‌పీ ధర కంటే అధికంగా వసూలు చేసి అమ్మకాలు సాగిస్తున్నారంటే ఏ మేరకు దోచుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. 

24 గంటలూ మందుబాబుల సందడి

ఇదిలావుంటే,  ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్న అనధికార బార్లల్లో 24 గంటలు అధిక ధరలకు  మద్యం లభ్యమవుతుంది. విచిత్రం ఏమిటంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దొరకని బ్రాండ్ల సైతం ఇక్కడ ప్రత్యక్షమవుతున్నాయని ప్రచారంలో ఉంది. ఆయా బ్రాండ్లకు అలవాటు పడిన పలువురు మద్యంప్రియులు తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ధరలు చెల్లించి కావాల్సిన బ్రాండ్లు ఇక్కడ కొనుగోలు చేస్తూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. 

తాటికు షెడ్లు, పరదాలు కట్టి దర్జాగా నిర్వహణ

పాన్‌షాపుల వద్ద తాటికుల షెడ్లు, పరదాలను కట్టి దర్జాగా బార్లను నిర్వహిస్తున్నారు. తమ వద్దకు వచ్చిన మందుబాబులకు వాటర్‌ ప్యాకెట్లు, గ్లాసులు, స్టఫ్‌ అందించడంతో పాటు కుర్చీలు, టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. పూటుగా మద్యం సేవించిన పలువురు మందుబాబులు ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలకు తెరతీస్తున్నారు. రోడ్డులో ప్రయాణిస్తున్న వారిని అడ్డగించడం, అసభ్యపదజాలంతో మాట్లాడడం, వాహనాల రాకపోకలకు అవాంతరాలు కల్పించడం తదితరాలకు పాల్పడుతున్నారు.

  వారపు సంతరోజు మరింత సందడి

 తుమ్మపాలలో ప్రతి శనివారం సంత జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి తుమ్మపాల సంతకు వచ్చేవారు ఈ అనధికార బార్ల వద్ద మరింత రెచ్చిపోతూ గలాటా సృష్టిస్తున్నారు. మద్యం మత్తులో రోడ్ల పైనే గొడవలు పడడం, బాటిళ్లను పగులగొట్టడం తదితర దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కళ్ల ముందు ఈ తంతు సాగుతున్నా పోలీసులు గానీ ఎస్‌ఈబీ అధికారులుగానీ పట్టించుకోక పోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.


Updated Date - 2022-06-30T06:29:12+05:30 IST