Telugu: ప్రభుత్వ నిర్ణయంపై మండలి బుద్ధప్రసాద్ మండిపాటు

ABN , First Publish Date - 2021-07-10T20:13:17+05:30 IST

తెలుగు అకాడమీని తెలుగు సంస్కృత ఆకాడమీగా మార్చటాన్ని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తప్పుబట్టారు.

Telugu: ప్రభుత్వ నిర్ణయంపై మండలి బుద్ధప్రసాద్ మండిపాటు

విజయవాడ: తెలుగు అకాడమీని తెలుగు సంస్కృత ఆకాడమీగా మార్చటాన్ని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తప్పుబట్టారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన..  ప్రభుత్వ నిర్ణయాన్ని విచిత్రమైనదిగా అభివర్ణించారు. ఇది తెలుగువారిని అవమానించటమేనని, తెలుగు భాషకు ఒక ప్రత్యేకమైన సంస్థ అవసరమని భావించి 1968లో పీవీ నరసింహారావు ఏర్పాటు చేసిన తెలుగు అకాడమీ ద్వారా తెలుగు భాషకు సంబంధించి అనేక పరిశోధనలు జరిగాయన్నారు. 


తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని కలపడం ద్వారా భాషకు ఎనలేని నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు అకాడమీ లక్ష్యాలు, ఆదర్శాలు ఈ ప్రభుత్వానికి తెలియదని, తెలుసుకొనే ప్రయత్నం చేయటం లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ఇప్పటికే తెలుగు ప్రాథమిక విద్య స్థాయిలో నిరాదరణకు గురవుతోందన్నారు. ఇప్పుడు అకాడమీ విషయంలో తీసుకున్న నిర్ణయం కారణంగా మరింత నష్టం వాటిల్లుతుందన్నారు. 


తెలుగుకు, సంస్కృతానికీ వేర్వేరుగా ఆకాడమీలు ఉన్నప్పుడు మాత్రమే పరిశోధనలకు, భాష, సాహిత్య అభివృద్ధికి వీలు కలుగుతుందన్నారు. ఇప్పటికే తెలుగుకు సంబంధించి అన్ని సంస్థలు నిరాదరణకు గురవుతున్నాయని, అకాడమీ విషయంలో ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని పునఃసమీక్ష చేయాలన్నారు. 

Updated Date - 2021-07-10T20:13:17+05:30 IST