‘మండలి’ ఎన్నికలు ప్రత్యేకం

ABN , First Publish Date - 2021-03-05T05:34:29+05:30 IST

శాసనమండలికి జరిగే ఎన్నికలు పూర్తి విభిన్నం. ప్రాధాన్యత క్రమమే ప్రాతిపదికగా నిర్వహించే ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కూడా ఎలిమినేషన్‌ పద్ధతిలో ఉంటుంది. ఓట్ల లెక్కింపులో పోలైన ఓట్లలో 50శాతానికి మించి ఏ అభ్యర్థికి ముందుగా లభిస్తాయో వారినే విజేతగా ప్రకటిస్తారు.

‘మండలి’ ఎన్నికలు ప్రత్యేకం

50శాతానికి పైగా ఓట్లు లభిస్తేనే విజయం

ఎలిమినేషన్‌ పద్ధతిలో లెక్కింపు

గెలుపునకు రెండు, మూడు, నాలుగో ప్రాధాన్యత ఓట్లు సైతం కీలకం 

ఇల్లెందు, మార్చి 4: శాసనమండలికి జరిగే ఎన్నికలు పూర్తి విభిన్నం. ప్రాధాన్యత క్రమమే ప్రాతిపదికగా నిర్వహించే ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కూడా ఎలిమినేషన్‌ పద్ధతిలో ఉంటుంది. ఓట్ల లెక్కింపులో పోలైన ఓట్లలో 50శాతానికి మించి ఏ అభ్యర్థికి ముందుగా లభిస్తాయో వారినే విజేతగా ప్రకటిస్తారు. 14న నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరగనుండగా ఓట్ల లెక్కింపు 17న నిర్వహించనున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో... పార్లమెంట్‌ ఎన్నికల్లో  ఒక్కో ఓటరు ఒక్కో  అభ్యర్థికి మాత్రమే  ఓటు వేయాల్సి ఉండగా, శాసనమండలి పట్టభద్రుల ని యోజకవర్గాల ఎన్నికల్లో అందుకు భిన్నంగా ఓట్లువేసే విధానం అమలులో ఉండటం గమనార్హం. 

ఎలిమినేషన్‌ పద్ధతిలో ఓట్ల లెక్కింపు 

పోటీ చేసే అభ్యర్థులందరీకి ఒక్కో ఓటరుకు 1,2,3,4,5,6 అంకెల్లో ప్రాధాన్యతాలనిస్తూ ఓటు హక్కు వినియోగించుకునే విధానం అమలులో ఉంటుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో నేరుగా జరిగే ఓట్ల లెక్కింపులో సాధారణ మెజారిటీ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. కానీ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోలైన ఓట్లలో 50శాతం ఓట్లు దాటిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. ఒక వేళ ఏ అభ్యర్ధికి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 50శాతం ఓట్లు అధిగమించకపోతే ఎలిమినేషన్‌ పద్ధతిలో ఓట్లు లెక్కిస్తారు. తొలుత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అందరి కంటే తక్కువ వచ్చిన వారిని రౌండ్ల వారీగా ఎలిమినేషన్‌ చేస్తూ ఓట్ల లెక్కిం పు జరుపుతారు. ఈ విధంగా ఎలిమినేట్‌ అయిన అభ్యర్థుల్లో 2వ,3వ, 4వ, 5వ, 6వ, తదితర ప్రాధాన్యత ఓట్లను పరిగణలోనికి తీసుకుంటూ ఏ అభ్యర్థి ప్రప్రఽథమంగా 50  ఓట్లు అధిగమిస్తే అతడిని విజేతగా ప్రకటిస్తారు. ఒక వేళ ఏదైనా రౌండ్‌లో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు 50 శాతానికి పైగా ఓట్లు సాదిస్తే వారిలో ఆధిక్యత ప్రాతిపదికన విజేతను నిర్ణయిస్తారు. ఒక వేళ ఎలిమినేషన్‌ పద్ధతిలో చివరివరకు ఏ అభ్యర్థి కూడా 50శాతం ఓట్లు అధిగమించకపోతే చివరికి మిగిలిన ఇరువురు అభ్యర్థుల్లో మెజారిటీ ఓట్లు పొందిన వారిని విజేతగా ప్రకటిస్తారు. 

ఓట్ల లెక్కింపు విధానం ఎలా జరుగుతుందంటే..

శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోలైన మొత్తం ఓట్లలో సగం కంటే ఒక్క ఓటు ఎక్కువగా వచ్చినా తొలి అభ్యర్థిని గెలుపొందినట్లుగా ప్రకటిస్తారు. ఉదాహరణకు నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గంలో ఎన్నికల్లో పోలైన వాటిలో చెల్లుబాటైనవి 7వేల ఓట్లు ఉన్నాయనుకుందాం. వీటిలో గెలుపొందడానికి అభ్యర్థికి 3501ఓట్లు రావాల్సి వుంటుంది. ఆవిధంగా సగం కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చిన వారిని విజేతగా నిర్ణయిస్తారు. ఇందుకు తొలుత పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఏ ఒక్కరికి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో 3501 ఓట్లు లభించకపోతే ఎలిమినేషన్‌ పద్ధతి ద్వారా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ క్రమంలో ఎలిమినేట్‌ అయ్యే అభ్యర్ధికి లభించిన బ్యాలెట్‌ పత్రాల్లో ఇతర ప్రాధాన్యాలను పరిగణలోకి తీసుకుంటూ ఓట్ల లెక్కింపు జరుపుతారు. ఈ విధంగా జరిగే ఓట్ల లెక్కింపులో పోలైన ఓట్లలో సగానికి కంటే ఒక్క ఓటు అధికంగా లభించిన అభ్యర్దిని విజేతగా ప్రకటిస్తారు. 

Updated Date - 2021-03-05T05:34:29+05:30 IST