మంటో, మరోసారి...

ABN , First Publish Date - 2021-12-20T05:54:15+05:30 IST

‘‘నా కథలు అసహ్యంగా వున్నట్లు మీ కనిపిస్తే, మనముంటున్న సమాజమే అస హ్యంగా వుందని అర్థం చేసుకోండి..

మంటో, మరోసారి...

35 ఏళ్ళుగా ‘వ్యవధిలేని అవధానం’లాంటి దైనందిన జర్నలిజంలో ములగానాం తేలానాంగా వుంటూనే, బొత్తిగా పూర్వ పరిచయం లేని ఉర్దూభాషను నేర్చుకోవడమే కాకుండా, ఇప్పటికి ఇన్ని పుస్తకాలను అనువదించినందుకు మెహక్‌ హైదరాబాదీ భుజం తట్టవలసిందే!


‘‘నా కథలు అసహ్యంగా వున్నట్లు మీ కనిపిస్తే, మనముంటున్న సమాజమే అస హ్యంగా వుందని అర్థం చేసుకోండి. నా కథల్లో నేను వాస్తవాన్ని మాత్రమే ప్రద ర్శిస్తా’’నని అనగలిగిన గుండె నిబ్బరం మంటోది. సాహిత్యంలో ప్రతిఫలితమ య్యేది సమాజమేననే విషయం క్రీస్తుకు పూర్వం నాలుగో శతాబ్దం నాటి గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్‌ మొదలుకుని ఎందరో చెప్పినమాటే. కళ్ళకు కనబడేదాన్ని అను కరించాలనే ధోరణి మనిషిలో సహజం గానే వుంటుందనీ, దానికో తాళం, మేళం కల్పించడం పట్ల అంతరాంతరాల్లో అతనికి మోజుంటుందనీ అన్నాడు అరిస్టాటిల్‌. మంటో రచనలు చదివితే మనకి అలా కనిపించదు. కుళ్ళిన ఈ సమాజాన్ని కాల్చి పరిశుద్ధం చెయ్యాలన్న ప్రయత్నంలోంచే అతని సాహిత్యం పుట్టుకొచ్చిందనే ఎవరి కైనా అనిపిస్తుంది. నాలుగున్నర దశాబ్దాలైనా బతకని మంటో, ఆ స్వల్ప కాలంలోనే పుంఖాను పుంఖాలుగా రాశాడు- 22 కథానికల సంపుటులూ, అయిదు రేడియోనాటికల సంకలనాలూ, మూడు వ్యాస సంపుటులూ, రెండు సంపుటాల్లో స్కెచ్చులూ, ఓ నవలా రాసేశాడు. కొన్ని ప్రాంతా లకే పరిమితమయిన ఉర్దూ భాషలోనే అవన్నీ రాశాడు మంటో. అయితే, ఆయన ప్రభావశీలత ఉర్దూకే పరిమితం కాలేదు. మొత్తంగా భారతీయ సాహిత్యంపై ఆయన ముద్ర బలమైనది. ఈ 2021లో, మంటో మరణించి ఏడు దశాబ్దాల తర్వాత, అతని కథలు ‘మంటో క్లాసిక్స్‌’ పేరిట తెలుగులోకి అనువాదమైవచ్చాయి. మెహక్‌ హైదరాబాదీ తాజా అనువాదంలో 24 కథలున్నాయి. అనువాదకుడు ఉర్దూనుంచి నేరుగాచేసిన అనువాదాల్లో ఇది అయిదోది. జీలానీ బానూ కథానికలను రెండు సంపుటులుగా గతంలో అనువదించిన మెహక్‌, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణగా అదే రచయిత్రి జ్ఞాపకకథలను ‘తెరిచిన పుస్తకం’గా అనువదించారు. మంటో కథల అనువాదాలను కూడా ఇంతకు ముందు ఓ పుస్తకంగా తీసుకువచ్చిన మెహక్‌ ఇప్పుడు ఆయన కథల్లో ‘క్లాసిక్స్‌’ను ఎంపిక చేసి ఈ సంపుటి సమకూర్చారు. అంతేకాదు, జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత అమృతా ప్రీతమ్‌ ప్రఖ్యాత నవల ‘పింజర్‌’ను ‘అస్థిపంజరం’ పేరుతో చేసిన అనువాద పుస్తకం త్వరలో అచ్చు కాబోతోంది. 35 ఏళ్ళుగా ‘వ్యవధిలేని అవధానం’లాంటి దైనందిన జర్నలిజంలో ములగానాం తేలానాంగా వుంటూనే, బొత్తిగా పూర్వ పరిచయం లేని ఉర్దూభాషను నేర్చుకోవడమే కాకుండా, ఇప్పటికి ఇన్ని పుస్తకాలను అనువదించినందుకు మెహక్‌ హైదరాబాదీ భుజం తట్టవలసిందే! 


రెండు ప్రపంచయుద్థాల మధ్య శాండ్విచ్‌ అయిపోయిన తరానికి చెందిన రచయిత మంటో. తండ్రి సెషన్స్‌ జడ్జిగా పనిచేసినందువల్ల ఆ కుటుంబం ఆర్థికంగానూ-సామాజికంగానూ పెద్దగా ఇబ్బంది పడివుండకపోవచ్చు. కానీ, ఇరవైనాలుగు గంటలూ యుద్ధవార్తలు వినవలసి వస్తే, ఎంతటి ధీరుడికైనా మనసు కలతబారడం సహజం! ముఖ్యంగా బాల్యంలో అలాంటి పరిస్థితి మరీ ఘోరంగా వుంటుంది. ఇరవయ్యేళ్ళ ప్రాయంలో -1930 దశకం తొలినాళ్ళలో- మంటో రష్యన్‌, ఫ్రెంచ్‌ సాహిత్యం చదివి, అనువాదాలు చెయ్యడంతో సాహిత్య ప్రాంగణంలో అడుగుపెట్టాడు. రష్యన్‌, ఫ్రెంచ్‌ కథానికలు అనువదించి ప్రచురించిన తర్వాతే, తన తొలికథానిక ‘తమాషా’ రాశాడు. ఇది కేవల కల్పనా కథ కాదు- జలియన్‌ వాలాబాగ్‌ ఘోరం ఆధారంగా రాసింది. ఇక, ఉర్దూ పత్రికల కోసం విక్టర్‌ హ్యాగో, ఆస్కర్‌ వైల్డ్‌, టాల్‌స్టాయ్‌, గోర్కీ, చెహోవ్‌ల రచనలను అనువదించిన మంటోపై వాళ్ళ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆస్కర్‌ వైల్డ్‌ ప్రభావంతో ఆయన రాసిన కథానికలపై గాలిదుమారం చెలరేగింది. నిషిద్ధ సంబంధుల మధ్య లైంగికబంధాల గురించి రాసినవాడు మంటో ఒక్కడేనా? తెలుగులోనూ అలాంటి రచయితలు న్నారు! చలం ‘పాపం’ కథానిక, కుటుంబరావు ‘పెంపుడు తల్లి’ నవలిక, చాసో కథానికలు ‘కవలలు’-‘మాతృధర్మం’ ఇలాంటి ఇతివృత్తాలతో రాసినవే! అయినా, రచయితలపై నిషేధాజ్ఞలు విధించడం నాగరికత అనిపించుకోదు. రచయితల భావ ప్రకటనా స్వాతంత్య్రం కోసం మంటో చేసిన పోరాటం ఇతరుల్లో చూడం. ఇదంతా జరిగింది 1940 దశకంలో అనే వాస్తవం గుర్తుంచు కుంటే తప్ప దాని చారిత్రక ప్రాధాన్యం పూర్తిగా అర్థం కాదు! 


మంటో శరపరంపరగా రచనలు చేసినప్పటికీ, ప్రతి రచనకూ గొప్ప ప్రాముఖ్యం, ప్రాచుర్యం దక్కడం చెప్పుకోవలసిన విశేషం. ఇలాంటిది ప్రతి భాషలోనూ, అందరు రచయితల విషయం లోనూ జరగదు! మంటో మన సమాజానికి తీసిన ఎక్స్‌రే చిత్రాలు మన పాలకుల సుకుమారపు హృదయాలను గాయపరిచాయి, పాపం! అందుకే ఆయనపై ఇటు భారతదేశంలోనూ అటు పాకిస్తాన్‌లోనూ కలిపి- అరడజను ‘అశ్లీల సాహిత్యం’ కేసులు పడ్డాయి. ఆ కేసులు పడ్డానికి కారణమయిన కథానికల్లోనుంచి మూడింటిని ఎంచుకుని తాజా సంకలనంలో చేర్చారు అనువాదకుడు. మంటో కథల్లో పాఠకులకు వినోదం కలిగించే ప్రయత్నం ఏ కోశానా కనిపించదు. ‘టోబా టేక్‌సింగ్‌’లో శబ్దాల సాయంతో చేసే గారడిలో అంతర్లీనంగా వినిపించేది దేశవిభజనను తట్టుకోలేక పిచ్చెత్తిపోయిన నిర్భాగ్యుడి ఆవేదనే. దేశవిభజనలాంటి పరిణామాల్లో మనసుకు ఆహ్లాదం కలిగించగల విషయాలు ఏముంటాయి. ‘చల్లని మాంసం’ పేరుతో ఈ సంపుటిలో చేరిన మరో రచన కూడా విలక్షణమైంది. మనిషి, పిశాచంగా మారిపోడాన్ని చూపించిన రచయిత తన పాఠక మహాశయులకు వినోదం కల్గించడం కోసమే అలా చేశాడని ఎవరయినా పొరబడగలరా? ఇదే సంపుటిలోని మరో కథ ‘ఆవిర్లు’ రాయడానికి కొండంత గుండెబలం వుండాలి! భూస్వామ్య కుటుంబవ్యవస్థ అనే ఉక్కుచట్రంలోపల ఉక్కిపోయి, ముక్కిపోయేవారు ఎంతవింతగా, విడ్డూరంగా -కొండొకచో- వికారంగా ప్రవర్తించినా అందుకు విస్తుపోవలసింది వుందంటారా? 


ఇలాంటి కథలను రాసిన సాదత్‌ హసన్‌ మంటో వ్యక్తిత్వం గురించి ఒక్కసారి విశ్లేషించు కోవాలి. భారతదేశం రెండుముక్కలయి, పాకిస్తాన్‌ ఏర్పడినప్పటికీ బొంబాయి నగరం వదిలి వెళ్ళడానికి ఇష్టపడని వ్యక్తిత్వం మంటోది. భార్యా బిడ్డలు పాకిస్తాన్‌కు వెళ్ళిపోయినా తాను బొంబాయి వదిలివెళ్ళనని ప్రకటించినవాడు మంటో. పత్రికా సంపాదకుడిగా, సినిమా రచయితగా, రేడియో రచయితగా, అనేక ప్రక్రియల్లో ఒకదానివెనక మరోపుస్తకం ప్రచురించిన రచయితగా, మంటో ఉర్దూ సాహిత్య జగత్తులో ప్రసిద్ధుడు. కృషణ్‌చందర్‌, రాజేందర్‌సింగ్‌ బేదీ, అహమద్‌ నదీమ్‌ కాస్మీ, ఇస్మత్‌ చుగ్తాయి లాంటి అభ్యుదయ రచయితలతో సన్నిహిత స్నేహ సంబంధాలున్నా, అభ్యుదయ రచయితల సంఘం నేతల వింత ప్రవ ర్తనను వెటకరించడానికి క్షణం సందేహించని వ్యక్తిత్వం మంటోది. అయితే, దేశవిభజన సందర్భంగా చెలరేగిన అల్లర్లలో భాగంగా ఓ మిత్రుడి కుటుంబంపై దాడి జరిగిందని తెలిసినప్పుడు అతగాడు ‘‘తల్చుకుంటే నిన్నిక్కడే నరికిపారేయగల’’నని అనడంతో అంత స్థిరమయిన వ్యక్తిత్వమూ ముక్కలైపోయింది. వెంటనే, పాకిస్తాన్‌కు బయల్దేరి వెళ్ళిపోయిన మంటో అక్కడి వాతావరణంలో ఊపిరాడక గిలగిల్లాడారు. ఓ పక్కన అలా అవస్థలు పడుతూనే మరోవైపు భావ ప్రకటన స్వేచ్ఛ కోసం పాకిస్తాన్‌ గడ్డమీంచి పోరాడిన యోధుడు మంటో! అలాంటి రచయిత గురించి తెలుసుకోవలసిన అవసరం ఇప్పుడు మరింత పెరిగింది. ఈ సమయంలోనే ‘మంటో క్లాసిక్స్‌’ వెలువడ్డం చక్కగా వుంది. 


మంటో కథలు నేనింతకు ముందు చదివి వున్నమాట నిజమేకానీ, నాకు ఉర్దూ భాష రాదు; అంచేత, రచయిత అనువాదంలోని గుణగణాలను ఎంచి, వ్యాఖ్యానించడం నాకు తలకు మించిన పని! చిరకాలంగా తెలిసిన అనువాదకుడి గురించి మాత్రం రెండు ముక్కలు చెప్పగలను. మెహక్‌ హైదరాబాదీ అనే పి.వి.ఎస్‌. మూర్తి వ్యక్తిత్వం కూడా అసాధారణమైందే! ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి, వృత్తిరీత్యా -విజయవాడ మీదుగా- హైదరాబాద్‌ వచ్చిన మూర్తి, ఇక్కడ ఉర్దూ నేర్చుకుని ఆ భాషనూ-సాహిత్యాన్నీ విస్తృతంగా చదవడం సామాన్య స్వభావం అనిపించుకుంటుందా? మీర్‌ తకీ మీర్‌, గాలిబ్‌ లాంటి మహాకవుల చేతుల్లో రూపుదిద్దుకున్న గజల్‌ ప్రక్రియలో ప్రయోగాలు చేసి, వాటిని సియాసత్‌, మున్సిఫ్‌, ఎతెమాద్‌ లాంటి ఉర్దూ పత్రికల్లో అచ్చేయించడంమాత్రం సామాన్య స్వభావం అవుతుందా? సుప్రసిద్ధ ఉర్దూ రచయితలను తెలుగు పాఠకులకు పరిచయం చెయ్యడానికే తన శక్తియుక్తులు ధారపోయాలని నిర్ణయించడం కూడా సామాన్య స్వభావం కాజాలదు! ఈ ప్రవర్తనలో సామాన్యత కనిపించకపోవచ్చు; కానీ, అందులోని మాన్యతను గుర్తించడానికి నాలాంటి సామాన్యులు చాలనిపిస్తుంది!



మందలపర్తి కిషోర్‌

81796 91822

Updated Date - 2021-12-20T05:54:15+05:30 IST