అధికారులపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-05-26T05:25:47+05:30 IST

మండల అభివృద్ధికి అధికారులు సహకరించడం లేదని ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం
సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న తహసీల్దార్‌ గ్రేసీబాయి

- కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆరోపణ

- ఎంపీపీ మరియమ్మ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం

రాజోలి, మే 25 : మండల అభివృద్ధికి అధికారులు సహకరించడం లేదని ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజోలి మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో బుధవారం ఎంపీపీ మరియమ్మ అధ్యక్షతన, ఎంపీడీవో గోవింద్‌రావు నేతృత్వంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పడమర గార్లపాడు గ్రామ సర్పంచు మాట్లాడుతూ మండల స్థాయి అధికారులు సర్పంచులకు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆరోపించారు. కార్యాలయాలకు వెళ్తే కనీసం కూర్చోమని కూడా చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ గ్రేసీబాయి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. పొదుపు సంఘంలో ఉన్న సభ్యులకు చేనేత రుణాలు ఇవ్వడంలేదని, దీనివల్ల ఆ కుటుంబాలు చాలా ఇబ్బం దులు ఎదుర్కోంటున్నాయని జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు కోరారు. చేనేత రుణాలు అందించేలా బ్యాక్‌ అధికారులతో మాట్లాడాలన్నారు. అనంతరం ఎంపీడీవో గోవింద్‌రావు మాట్లడుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సి ఉంటుందన్నారు. వారు చెప్పే విషయాలను విని, సమస్యల పరిష్కారానికి అఽధికారులు కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో నిర్వహించే కార్యక్రమాల వివరాలను సర్పంచుకు తెలియజేయాలని చెప్పారు. సెగ్రిగేషన్‌ షెడ్డును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. త్వరలో పల్లెప్రగతి కార్యక్రమం ప్రారంభం కాబోతోందని చెప్పారు. అనంతరం అఽధికారులు తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అందించే సేవలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గోవిందురావు, జెడ్పీటీసీ సభ్యురాలు సుగుణమ్మ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-26T05:25:47+05:30 IST