పనులు చేసేదుకేనా..?

ABN , First Publish Date - 2022-07-01T06:15:14+05:30 IST

‘‘పంచాయతీల్లో నిధులన్నీ వేరేవాటికి మళ్లిం చారు. సర్పంచ్‌లు సొంత డబ్బులు ఖర్చు చేసుకుని సేవ చేస్తున్నారన్న విషయాన్ని మర్చిపోకండి.

పనులు చేసేదుకేనా..?
అధికారులను ప్రశ్నిస్తున్న గుర్వాయిగూడెం సర్పంచ్‌ సత్యవాణి

అధికారుల తీరుపై మండల సమావేశంలో సర్పంచ్‌ల మండిపాటు

జంగారెడ్డిగూడెం, జూన్‌ 30 : ‘‘పంచాయతీల్లో నిధులన్నీ వేరేవాటికి మళ్లిం చారు. సర్పంచ్‌లు సొంత డబ్బులు ఖర్చు చేసుకుని సేవ చేస్తున్నారన్న విషయాన్ని మర్చిపోకండి. ఇళ్ల నిర్మాణంలో పునాదులు వేసుకోలేని నిరు పేదలకు మా సొంత సొమ్ములు పెట్టుబడులుగా ఇస్తున్నాం.ఇటువంటి వాటికి సర్పంచ్‌లను ఉపయోగించుకుంటున్నా గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కనీస ప్రాధాన్యం ఇవ్వడం లేదు..’’ అంటూ గుర్వాయిగూడెం సర్పంచ్‌ గుబ్బల సత్యవేణి అధికారులపై మండిపడింది. గురువారం జంగారెడ్డిగూడెం మండల పరిషత్‌ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఎంపీపీ కొదమ జ్యోతి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్పంచ్‌ సత్యవాణి మాట్లాడుతూ సర్పంచ్‌లకు ఇవ్వాల్సిన గౌరవాన్ని అధికారులు విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలకు సంబంధించి స్థలాలను చదును చేసేందుకు పుట్లగట్లగూడెం, గుర్వాయిగూడెంలో సుమారు రూ.16.50 లక్షలు ఖర్చు చేశామని, రెండేళ్లు అయినా ఇప్పటికీ ఆ బిల్లు రాలేదన్నారు.  గ్రామాల్లో పశువులకు ప్రాణాపాయ పరిస్ధితులు వచ్చినప్పుడు పశువైద్యాధికారులు కానీ, సిబ్బంది కానీ స్పందించడం లేదని ఫలితంగా వారం రోజుల వ్యవధిలోనే వేగ వరం గ్రామంలో మూడు పాడి పశువులు మృతి చెందాయని వేగవరం సర్పంచ్‌ లక్కాబత్తుల నాగరాజు మండిపడ్డారు. పశువులకు ఏదైనా ఇబ్బంది వస్తే గోపాలమిత్రకు తెలిపితే మాకు జీతాలు రావడం లేదని చేతు లెత్తేస్తున్నారని పంగిడిగూడెం సర్పంచ్‌ వెంకటేశ్వరరావు ఆరోపించారు. చక్ర దేవరపల్లి సర్పంచ్‌ సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ తమ గ్రామంలోని భూములకు 40 ఏళ్లుగా పట్టాలు కానీ, పాసు పుస్తకాలు కానీ లేవన్నారు. వీటి వల్ల బ్యాంక్‌ రుణాలు రావడం లేదని, ప్రభుత్వ సబ్సిడీలు అందడం లేదని, ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు తెలిపినా కనీసం పట్టించుకోవడం లేద న్నారు. శ్రీనివాసపురం సర్పంచ్‌ యడ్లపల్లి దుర్గారావు మాట్లాడుతూ గ్రామంలో ఆక్రమణలు పెరిగాయని, దీనికి స్థానిక వీఆర్వో పాత్ర ఉందని పలు మార్లు ఫిర్యాదు చేసినా నేటికీ ఆ దిశగా చర్యలు కానీ విచారణ చేసిన దాఖలాలు కన్పించలేదన్నారు.  వివాదాల్లో ఉన్న భూములకు సైతం రెవెన్యూ అధికారులు అక్రమ పద్ధతుల్లో పాస్‌ పుస్తకాలు ఇచ్చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీపీ కొదమ జ్యోతి మాట్లాడుతూ అధికారులంతా సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు ఇవ్వా ల్సిన గౌరవం ఇవ్వాలని, వారి పరిధిలో జరిగే అభివృద్ధి పనులను వివరిం చాలని సూచించారు. జడ్పీటీసీ పోల్నాటి బాబ్జి, ఇన్‌చార్జ్‌ ఎంపీడీవో జోగేశ్వర రావు, ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ కె.నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-01T06:15:14+05:30 IST