వాడీవేడిగా మండల సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2022-08-07T05:24:50+05:30 IST

చేర్యాలలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌ అధ్యక్షతన నిర్వహించిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది.

వాడీవేడిగా మండల సర్వసభ్య సమావేశం
మండల సభలో సమస్యలపై ప్రస్తావిస్తున్న సభ్యులు

చేర్యాల, ఆగస్టు 6: చేర్యాలలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌ అధ్యక్షతన నిర్వహించిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో రూ.5 లక్షలతో చేపట్టిన పనులకు మూడేళ్లవుతున్నా బిల్లులు చెల్లించకపోవడం తగదని మిషన్‌ భగీరథ ఏఈ దివ్యపై సర్పంచ్‌ కత్తుల కృష్ణవేణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ సమీక్ష విషయమై ఎంఈవో మొగుళ్ల నర్సింహారెడ్డి మాట్లాడుతుండగా, వీరన్నపేట సర్పంచ్‌ భిక్షపతి, ఎంపీటీసీ శివశంకర్‌ తదితరులు మాట్లాడుతూ ‘మనఊరు-మనబడి’ అభివృద్ధి పనుల విషయమై గ్రామ ప్రజాప్రతినిధులకు సమాచారం అందించకపోవడం తగదని మండిపడ్డారు. వీరన్నపేట పాఠశాల ఉపాధ్యాయులు ఇటీవల వాగ్వాదానికి దిగిన విషయమై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. శిథిలావస్థలోని ప్రభుత్వ పాఠశాలలను కూల్చివేయాలని కోరారు. విద్యుత్‌శాఖ సమీక్షలో థర్డ్‌వైర్‌ లేకపోవడంతో విద్యుత్‌ బిల్లులు అధికంగా వస్తున్నాయని, వచ్చేనెల నుంచి బిల్లులు చెల్లించబోమని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీపీ కరుణాకర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పాటుపడాలని సూచించారు. పంచాయతీరాజ్‌శాఖ ఏఈ శివకుమార్‌ సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని, వెంటనే రెగ్యులర్‌ ఏఈని నియమించాలని తీర్మానించారు. పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని, గ్రామాల్లో థర్డ్‌వైర్‌ విద్యుత్‌ లైన్‌ ఏర్పాటుచేయాలని, శిథిలావస్థలోని ప్రభుత్వ పాఠశాలలను కూల్చివేయాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ శెట్టె మల్లేశం, మార్కెట్‌ చైర్మన్‌ సుంకరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-07T05:24:50+05:30 IST