బడుగులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్న సర్కార్‌

ABN , First Publish Date - 2020-09-27T10:42:25+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలు, అగ్రకులాల నిరుపేదల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేలా కేసీఆర్‌

బడుగులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్న సర్కార్‌

అగ్రవర్ణాల కోసమే ప్రవేటు యూనివర్సిటీలు

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ


సత్తుపల్లి, సెప్టెంబర్‌26: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలు, అగ్రకులాల నిరుపేదల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేలా కేసీఆర్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ ఆరోపించారు. ప్రవేటు యూనివర్సిటీల బిల్లుకు వ్యతిరేకంగా ఎంఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన ప్రచార పాదయాత్రను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మందాకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ బడుగులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్రలో భాగంగానే రాష్ట్రంలో ఐదు ప్రవేటు యూనివర్సిటీలను తీసుకొస్తూ చట్టం తీసుకొచ్చారన్నారు. ఆ చట్టం ద్వారా రిజర్వేషన్లు వర్తించవని, అగ్రకులాల పేద విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథకం రాదని నిండుసభలలో విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారన్నారు. ఈ చట్టం తెచ్చినప్పుడు ఆ యూనివర్సిటీలు భూస్వాముల, పెట్టుబడిదారుల బిడ్డల కోసమేనన్నారు. అవి పేదలకు శాపంగా మారనున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు నూటికి 99శాతం బడుగుల, బలహీన వర్గాల విద్యార్థుల పోరాటాలు, త్యాగాలే కారణమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క వెలమ విద్యార్థి కానీ యువకుడు కానీ ప్రాణత్యాగం చేయదన్నారు. రాష్ట్రం కోసం త్యాగం చేసినవారిలో ఉన్నవర్గాలు లేరనడానికి   ఇదే సాక్ష్యమని మందా కృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలు ఏ దుస్థితిలలో ఉన్నాయో చెప్పేందుకు ఏ ఒక్క యూనివర్సిటీకీ వైస్‌ చాన్సలర్‌ లేకపోవడమే సాక్ష్యమన్నారు. 2వేలకు పైగా అధ్యాపకుల పోస్టులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అగ్రకులాలు పిల్లలు, వ్యాపారం కోసమే ప్రవేటు యూనివర్సిటీలన్నారు. వాటిలలో చదివేందుకు అగ్రవర్ణాల నిరుపేదల విద్యార్థులకే అవకాశం లేకపోతే అణగారిన వర్గాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ మధ్య కాలంలో కేంద్రప్రభుత్వం తెచ్చిన విద్యుత్‌ బిల్లును రాక్షసచట్టంతో, వ్యవసాయ బిల్లును తేనె పూసిన కత్తితో సీఎం కేసీఆర్‌ పోల్చారని, కానీ ఆయన అసెంబ్లీలో తెచ్చిన యూనివర్సిటీల చట్టం అతిభయంకరమైనదని, ఇది విషం పూసిన కత్తితో సమానమని మందా కృష్ణ విమర్శించారు. కేంద్ర బిల్లులను ఉపసంహరించుకోవాలంటున్న కేసీఆర్‌ అగ్రవర్ణాలు, పెట్టుబడిదారుల కోసం పెట్టిన బిల్లును ముందుగా ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ బిల్లునకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులను మేల్కొల్పుతామని స్పష్టం చేశారు. అన్నిగ్రామాలకు చేరేలా వచ్చేనెల 15వ తేదీ వరకు ఈ పాదయాత్రలకు శ్రీకారం చుట్టామన్నారు. వచ్చేనెల 16నుంచి 20వరకు గ్రామస్థాయి నుంచి మండలం, జిల్లా స్థాయి వరకు నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని పిలుపునిచ్చారు. అక్టోబర్‌ 21వ తేదీన లక్షలాది మంది విద్యార్థులతో హైదరాబాద్‌లోఓ మహాదీక్ష చేయబోతున్నామన్నారు. అప్పటిలోగా కేసీఆర్‌ ప్రభుత్వం చట్టాన్ని ఉపసంహరించుకోకపోతే ఈ చట్టమే కేసీఆర్‌ ప్రభుత్వానికి ఎలా ఉరితాడుగా పేనాలో తాము చూపిస్తామని హెచ్చరించారు.

Updated Date - 2020-09-27T10:42:25+05:30 IST