‘దళితబంధు’ పేరుతో దగా

ABN , First Publish Date - 2021-07-27T05:02:06+05:30 IST

‘దళితబంధు’ పేరుతో దగా

‘దళితబంధు’ పేరుతో దగా
సమావేశంలో మాట్లాడుతున్న మంద కృష్ణ మాదిగ

సీఎం కేసీఆర్‌ విందు రాజకీయాలు

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ


వడ్డెపల్లి, జూలై 26 : దళితబంధు పేరుతో సీఎం కేసీఆర్‌ విందు రాజకీయాలకు తెరలేపి మరోమారు దళిత సమాజాన్ని దగా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. సోమవారం హన్మకొండ వడ్డెపల్లి రోడ్డులోని పల్లా రవీందర్‌రెడ్డి విద్యుత్‌ కార్మిక భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దళితబంధు పేరుతో దళితులకు చేసిన మోసాలను కనుమరుగు చేసుకునే కుట్రలో భాగంగానే సీఎం కేసీఆర్‌ దళితులను విందుకు పిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ వర్గాల మీదైతే కేసీఆర్‌కు ద్వేషం ఉంటుందో ఆ వర్గాలను విందుకు పిలవడం పరిపాటి అని, ఆ తర్వాత ఆ వర్గాన్ని మోసం చేయడం  కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వారిపై ద్వేషాన్ని ప్రదర్శించి ప్రజల్లో అసహనం రాగానే వారిని విందుకు పిలిచి వరాలు కురిపించారన్నారు. ప్రస్తుతం ఆర్టీసీని ఆయన భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. విందు వరాలను నమ్మిన కార్మికులు తీవ్ర ఆవేదనలో కొట్టుమిట్టాడుతున్నారని, వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని ఆరోపించారు. 

దళితబంధు పథకం కింద లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన కేసీఆర్‌ ప్రకటనకు స్పష్టత లేకుండా పోయిందని మందకృష్ణ విమర్శించారు. దళితబంధు ప్రకటించిన రోజు నియోజకవర్గానికి వంద మంది చొప్పున అని చెప్పి తర్వాత హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని 20 వేల కుటుంబాలకు అని స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఒడ్డెక్కేందుకే కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌లోపే ప్రతీ కుటుంబానికి రూ. 10 లక్షలు అందించాలని డిమాండ్‌ చేశారు. ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి మూడేళ్ళు దాటినా దానికి కేటాయించిన రూ. 100 కోట్లు కూడా ఖర్చు చేయలేని దౌర్భాగ్యపు పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు ఇప్పటి వరకు పాలక వర్గమే లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వంద రోజుల్లోపు దళితబంధును పూర్తి చేయాలన్నారు. 

దళితులకు భూ పంపిణీ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని, అన్ని రంగాల్లో 18 శాతం వాటా కల్పించాలని డిమాండ్‌ చేశారు. దళితులకు కావాల్సింది విందులు కాదని మాల సామాజిక వర్గానికి చెందిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఉప ముఖ్య మంత్రి పదవి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌కు, అరూరి రమే్‌షకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని మంద కృష్ణ డిమాండ్‌ చేశారు. 

సమావేశంలో ఎమ్‌ఎ్‌సపీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్‌ గౌడ్‌, ఎమ్మార్పీఎస్‌ జాతీయ అఽధికార ప్రతినిధి మంద కుమార్‌ మాదిగ, వేల్పుల సూరన్న, రాష్ట్ర, జిల్లా నాయకులు పుట్ట రవి, మంద రాజు, బండారి సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T05:02:06+05:30 IST