Oct 14 2021 @ 03:47AM

బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు

ప్రత్యర్ధులపై నరేశ్‌ ఘాటు వ్యాఖ్యలు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణు బుధవారం ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి ఈ నెల 16న తన టీమ్‌తో కలసి విష్ణు పదవిని  చేపట్టాలి. కానీ ‘మంచిరోజు’ అని చెప్పి బుధవారమే ఆయన ‘మా’ అధ్యక్ష పీఠం అలంకరించారు. విష్ణు పదవీ బాధ్యతలు చేపడతారనే విషయం బుధవారం ఉదయం వరకు ఎన్నికల అధికారికి కానీ, ఆయన ప్యానెల్‌ సభ్యులకు కానీ తెలియకపోవడం గమనార్హం. ఆయనకు బాధ్యతలు అప్పగించిన అనంతరం ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్‌ ‘‘ఒక కౌంటింగ్‌ టీమ్‌,  అధికారిక బృందం కూర్చొని, ప్యానల్‌ తరపున పోటీ చేసిన అభ్యర్థుల కళ్ల ముందే ఓట్లు వేయించారు. దీనికంటే ప్రజాస్వామ్యం ఏముంటుంది? కొంతమంది మగవాళ్లు కూడా బోరుమని  ఏడుస్తున్నారు. అతిగా ఏడ్చే మగవాళ్లను నమ్మొద్దు’’ అంటూ ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ సభ్యులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పోలింగ్‌ బూత్‌లో మమ్మల్ని  దూషించారు, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారు’ అని  చేసిన విమర్శలను కూడా  ఆయన ఖండించారు.. ‘మా’లో పెత్తందారీ వ్యవస్థ పోయి పనితనం రావాలి. పోలింగ్‌ బూత్‌లో ఎలక్షన్‌ కెమెరాలు ఉన్నాయి. అక్రమాలు జరిగితే నిరూపించండి. కొంత మందిని కొరికారు. అసలు ఎలక్షన్‌లో కొరకడం ఎక్కడన్నా ఉంటుందా? రిగ్గింగ్‌ చేసి పారిపోతుంటే పట్టుకున్నాం. గౌరవంతో కొట్టకుండా వదిలేశాం.  ‘మమ్మల్ని బండ బూతులు తిట్టారు, అమ్మ నా బూతులు తిట్టారు’ అని చెబుతున్నారు. ఎవ ్వరినీ బండబూతులు తిట్టలేదు.  ప్రూవ్‌ చేయమనండి. భయంతో ఉన్నప్పుడు అలాంటి కలలు వస్తాయి. అవి నిజంలా కనిపిస్తాయి. వాళ్ల  కలలో మేం సింహ స్వప్నంలా కూర్చున్నాం.  ‘మేం ఓడినా, గెలిచినా రెండేళ్లు కలసి పనిచేస్తాం’ అన్నారు . మరి రాజీనామాలు ఎందుకు చేశారు? నరేంద్రమోదీ గెలిచారని కాంగ్రెస్‌ వాళ్లు దేశాన్ని వదలిపెట్టి వెళ్లిపోతారా? అందరం కలసి పనిచేద్దాం అని  ముందుకు రావాలి గానీ, వెళ్లిపోతాం అంటే అది వాళ్ల ఇంగిత జ్ఞానానికి వదిలిపెడుతున్నాను. కలసి పనిచేయము బయట నుంచి ప్రశ్నిస్తాం అంటే దానికి తగ్గ సమాధానాలు వస్తాయి. ఇప్పుడు వచ్చిన ఓట్లు కూడా ఈ సారి రావు. రాజీనామాలపై కొత్త ప్యానల్‌ నిర్ణయం తీసుకుంటుంది.  కేవలం ఎమోషన్స్‌, ఫ్రస్టేషన్స్‌తో ‘మా’ను డిస్ట్రబ్‌ చేయవద్దు. ‘మా’లో రెండు, మూడొందల మందికి సంక్షేమ కార్యక్రమాలు అందించాలి. అది చేయడం పెద్ద కష్టం కాదు. మంచి అడ్మినిస్ట్రేటర్‌ ఉన్నాడు. వాళ్లు చేసుకుంటారు. వాళ్లకు వదిలేద్దాం. నేను వెనుక ఉండను. పక్కనుంటాను. కావాలంటే పని చేసిపెడతాను’ అన్నారు నరేశ్‌.