Jul 21 2021 @ 19:27PM

వారు శృతిమించితే మాత్రం.. పేర్లు బయటపెట్టేస్తా: మంచు విష్ణు

ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘మా’ ఎన్నికలపై ఎటువంటి చర్చలు నడుస్తున్నాయో తెలియంది కాదు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్, జీవితా రాజశేఖర్, హేమ, సివిఎల్ నరసింహారావు.. ఈసారి ‘మా’ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇండస్ట్రీలోని పెద్దలు కలగజేసుకుని.. ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్న తరుణంలో.. మంచు విష్ణు పర్సనల్‌గా ఓ వీడియోని విడుదల చేసి ఈ ఎన్నికలపై తన నిర్ణయం ఏమిటో తెలియజేశారు. అప్పటి నుంచి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్‌హాట్‌గా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి మంచు విష్ణు ‘మా’ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీలోని ఆర్టిస్ట్‌లు కొందరు అండర్‌వేర్‌తో పోలీస్ స్టేషన్‌లో ఉంటే.. తెల్లవారు జామున వెళ్లి తీసుకొచ్చిన సందర్భాలున్నాయని, అలాంటి వాళ్లుగానీ శృతిమించి మాట్లాడితే మాత్రం ఊరుకోనని మంచు విష్ణు హెచ్చరించారు. ఆయన ఇంటర్వ్యూలోని ముఖ్య విషయాలు ఇవే.  


-ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు నన్ను పోటీ చేయమన్నారు. వాళ్లు చెప్పినప్పుడు రేస్‌లో ఎవరూ లేరు. పెద్దల కోరిక మేరకు 100 పర్సంట్ ‘మా’ ఎలక్షన్స్‌లో పోటీ చేస్తా. 

- నా ఫ్యామిలీ విషయాలు ఎలా అయితే బయటికి చెప్పుకోనో.. ‘మా’ ఫ్యామిలీలోని విషయాలు కూడా బయటకు చెప్పను. 

-దాసరిగారి తర్వాత ఇండస్ట్రీలో శూన్యత ఏర్పడింది. ఇప్పుడున్న పెద్దలందరూ ఏకగ్రీవం అంటే వారి నిర్ణయాన్ని గౌరవిస్తా.

-‘మా’లో మునిగిపోయే కష్టాలేమీ లేవు. ఇలాంటి సందర్భం వచ్చిన ప్రతిసారి సొంత భవనం అంటూ మాట్లాడుతున్నారు. అందుకే ‘మా’ భవనం పూర్తిగా నేనే నిర్మిస్తానని చెప్పాను. 

-యూనియన్‌లో సభ్యుల సంఖ్య పెరగాలి కానీ.. అందరికీ యూనియన్ కార్డు ఉండాలి. ఎవరు పడితే వారు కార్డు లేకుండా ఆర్టిస్ట్ అంటే.. ఇంక యూనియన్ ఎందుకు? ఇతర యూనియన్లలో ఉన్న ఐకమత్యం ‘మా’ యూనియన్‌లో లేదు. 

- ‘మా’ అధ్యక్షుడిగా తెలుగువారే ఉండాలని నేను అనలేదు.

-ఇప్పుడున్న పెద్ద హీరోలందరి ముందు పెరిగిన వాడిని. వాళ్ల మాటను కాదని అనలేను.

-ఈ కరోనా కష్టకాలంలో ఆర్టిస్టులెందరో ఇబ్బందులు పడ్డారు. కుడి చేయి చేసే దానం ఎడమచేతికి తెలియకూడదు. అలా ఎందరో ఈ కరోనా టైమ్‌లో సహాయం చేశారు. కరోనా అనే కాదు.. ఇతర విషయాలలో కూడా ఇండస్ట్రీకి చెందినవారెందరో సహాయం చేస్తున్నారు. దానిని చెప్పుకోవాల్సిన అవసరం లేదనేది నా భావన. ఈ సహాయం మరికొందరిలో స్ఫూర్తి నింపుతుంది అనుకుంటే మాత్రం చెప్పుకున్నా తప్పులేదు. 

- ఇండస్ట్రీలో ఎంతమందికి హెల్ప్ చేశామనేది నేను చెప్పను. కొందరు ఊసలు లెక్కపెట్టకుండా బయట ఉన్నారంటే దానికి కారణం ఎవరో వాళ్లనే అడగాలి. అండర్‌వేర్‌తో పోలీస్ స్టేషన్‌లో ఉన్నవాళ్లని.. తెల్లవారు జామున వెళ్లి తీసుకొచ్చిన సందర్భాలున్నాయి. అలాంటి వాళ్లుగానీ శృతిమించి మాట్లాడితే మాత్రం.. వారి పేర్లు ఖచ్చితంగా బయటపెడతాను.