Sep 14 2021 @ 12:15PM

Manchu Manoj: ఏడాది కాదు.. 24 గంటల్లో ఉరి తీయాలి

అత్యంత క్రూరమైన చర్య ఇది..

ఇలాంటి లోకంలో బతుకుతున్నందుకు సిగ్గుగా ఉంది

పాప కుటుంబానికి అండగా ఉంటాం.. 

పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి..

చిన్నారికి న్యాయం జరిగే వరకూ పోరడతాం

 మగాడి ఆలోచనలు మారాలి

– మంచు మనోజ్‌ 

హైదరాబాద్: సైదాబాద్‌, సింగరేణి కాలనీలో అత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబ సభ్యులను సినీ హీరో మంచు మనోజ్‌ పరామర్శించారు. మంగళవారం ఉదయం ఆయన సింగరేణి కాలనీకి చేరుకుని చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు. ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యంత క్రూరత్వమైన చర్య ఇదని ఆయన అన్నారు. ‘‘క్రూరమైన సమాజంలో బతుకుతున్న మనమంతా బాధ్యతాయుతంగా ఉండాలి. ఆడపిల్లలను ఎలా గౌరవించాలో అందరికీ నేర్పించాలి. ఇప్పటికీ నిందితుడి జాడ దొరకలేదని పోలీసులు అంటున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం, పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. చత్తీస్‌గఢ్‌లో మూడేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష వేయాలని ఏడాది తర్వాత తీర్పు వచ్చింది. ఇలాంటి రాక్షసులను 24 గంటల్లో ఉరి తీయాలి’’ అని మంచు మనోజ్ డిమాండ్ చేశారు. ఇంకా మనోజ్‌ మాట్లాడుతూ  "పాపలేని లోటును మేం ఎవరం తీర్చలేం. చిన్నారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటాం. పాపకు న్యాయం జరిగేవరకూ పోరాడతాం. ఇలాంటి లోకంలో మనం బతుకుతున్నందుకు బాధగా ఉంది. ఈ జనరేషన్‌ నుంచి అయినా మగాడి ఆలోచనలు మారాలి’’ అని అన్నారు.