రెండో రోజూ మంచిరెడ్డి విచారణ

ABN , First Publish Date - 2022-09-29T08:45:58+05:30 IST

ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై నమోదైన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం కూడా ఆయనను విచారించింది.

రెండో రోజూ మంచిరెడ్డి విచారణ

  • ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిని మళ్లీ ప్రశ్నించిన ఈడీ అధికారులు
  • నాటి విదేశీ పర్యటన నుంచి నేటి రాజకీయాల వరకు ఆరా!
  • 8 గంటలపాటు ప్రశ్నల వర్షం.. 
  • అవసరమైతే మళ్లీ హాజరు కావాల్సి ఉంటుందని సూచన

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై నమోదైన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం కూడా ఆయనను విచారించింది. మంగళవారం సుమారు 8 గంటలపాటు విచారించిన ఈడీ అధికారుల ప్రత్యేక బృందం రెండో రోజూ 8 గంటలపాటు ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం కురిపించింది. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి కిషన్‌రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకోగా.. రాత్రి 8 గంటల వరకు అధికారులు ఆయనను విచారించారు. భోజన విరామ సమయంలో కుటుంబ సభ్యులు ఇంటి నుంచి తెచ్చిన భోజనాన్నే అధికారుల అనుమతితో అందించారు. విచారణ మధ్యలో టీ ఇచ్చారు. కాగా, విచారణలో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటన నుంచి మొదలుకొని ప్రస్తుత రాజకీయాల వరకు ప్రతి విషయాన్నీ ఈడీ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటన ఎన్ని రోజులు కొనసాగింది? ఆ పర్యటనలో ప్రధానంగా చేసిన ఖర్చులేంటి? ఎక్కడ బస చేశారు? ఏయే ప్రాంతాలను సందర్శించారు? ఎవరెవరిని కలిశారు? ఇలా పర్యటనకు సంబంధించిన ప్రతి చిన్న విషయంపైనా ప్రశ్నించి సమాధానాలు రాబట్టినట్లు తెలిసింది. పర్యటన మధ్యలో వెస్ట్రన్‌ యూనియన్‌ మనీ ఎక్స్చేంజ్‌ నుంచి డబ్బులు అత్యవసరంగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఆ మొత్తాన్ని ఎలా ఉపయోగించారనే వివరాలపై ఈడీ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. విచారణ అనంతరం కొన్ని పత్రాలపై ఎమ్మెల్యే సంతకాలు తీసుకుని పంపించారు. కేసు విచారణ కొనసాగుతోందని, అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఆయనకు సూచించారు.


ప్రగతి భవన్‌ ఆరా..

తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఏ చిన్న కదలిక చోటుచేసుకున్నా.. అది రాజకీయంగా  దుమారం రేపుతోంది. ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేను రెండు రోజులు ఈడీ విచారించడం హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో తమ ఎమ్మెల్యేను ఈడీ అధికారులు విచారించడం పట్ల ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌ వర్గాలు ఆరా తీసినట్లు తెలిసింది. అసలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై ఉన్న కేసు ఏంటి? నోటీసులు ఎప్పుడు ఇచ్చారు? విచారణ ఎలా సాగిందనే ప్రతి విషయాన్ని ప్రగతి భవన్‌ వర్గాలు సేకరించినట్లు సమాచారం. త్వరలోనే ఎమ్మెల్యేను ప్రగతి భవన్‌కు పిలిపించి ఈ విషయంలో చర్చించనున్నట్లు తెలిసింది.  


దావూద్‌ను మించిపోయిన మంచిరెడ్డి: మల్‌రెడ్డి

 ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇంటర్నేషనల్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంను మించిపోయారని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఇబ్రహీంపట్నంలో పంచిన అసైన్డ్‌ భూములపైన ఆయన పడ్డారని, నయీమ్‌ ద్వారా రైతులను బెదిరించి భూములు గుంజుకున్నారన్నారు. కిషన్‌రెడ్డి చేసిన మనీ లాండరింగ్‌కు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో దర్యాప్తు చేయాలన్నారు. కిషన్‌రెడ్డి చేసిన తప్పులతో సీఎం కేసీఆర్‌కు సంబంధం లేకుంటే ఆయన్ను పార్టీ నుంచి, పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో సీఎం కూడా బాధ్యుడే అవుతారన్నారు. ఫార్మాసిటీ 8,632 ఎకరాల అసైన్డ్‌ భూమిలో కిషన్‌రెడ్డి కొట్టేసిన 200ఎకరాలపై సీబీఐ విచారణ జరపాలన్నారు. 

Updated Date - 2022-09-29T08:45:58+05:30 IST