దూరాలు దాటి దరిచేరాల్సిన తరుణం

ABN , First Publish Date - 2021-04-03T05:55:48+05:30 IST

మనుషులు ఒకరితో ఒకరు కలుసుకొని ఆత్మీయంగా పంచుకునే అనుభవానికి ప్రత్యామ్నాయం ఏదీ లేదు. కరోనా తీవ్రత ఎంత పెరిగినా మానవ సంబంధాల నిర్వహణ కోసం ఇరుగుపొరుగు సంబంధాలను....

దూరాలు దాటి దరిచేరాల్సిన తరుణం

మనుషులు ఒకరితో ఒకరు కలుసుకొని ఆత్మీయంగా పంచుకునే అనుభవానికి ప్రత్యామ్నాయం ఏదీ లేదు. కరోనా తీవ్రత ఎంత పెరిగినా మానవ సంబంధాల నిర్వహణ కోసం ఇరుగుపొరుగు సంబంధాలను పెంచుకునే, ఆత్మీయతతో సమస్యలను కలబోసుకునే పరిస్థితులను ప్రయత్నపూర్వకంగానే మనుషులు కల్పించుకోవాలి.


మంచిర్యాల ప్రాంతంలో ఒక రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న తీరు మనసున్న ఎవరినైనా కుదిపివేస్తుంది. అప్పుల్లో పడ్డామని, అప్పు తీర్చడానికి మార్గాలు ఏం లేవని, మరునాడు అప్పుల వాళ్లు వస్తే పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఏమీ పాలుపోక (చాలా మంది రైతులలాగే) ఈ రైతు కుటుంబం కూడా ఆత్మహత్యను పరిష్కారంగా ఎన్నుకున్నది (మార్చి 26, ఆంధ్రజ్యోతి). తల్లిదండ్రులు ముందుగా తమ ఇద్దరు పిల్లల (16 ఏళ్ళ కుమారుడు, ఇటీవలే వివాహిత అయిన కుమార్తె)ను ఉరి తీశారు. తర్వాత వారిరువురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ విషాదంలో, తల్లిదండ్రులు అతిగా ప్రేమించే పిల్లలను ముందు ఉరి తీశారు. మరింత హృదయవిదారకమైన విషయమేమిటంటే కూతురు గర్భంతో ఉంది. ఏ అన్యం పుణ్యం ఎరుగని శిశువు తల్లితో బాటు తన భవిష్యత్‌ జీవితాన్ని కోల్పోయింది. ఈ సంఘటన గురించి చదివినప్పుడు మనుషులకు ఏమవుతున్నది, మనిషిలో ఉండే సహజ మానవత్వం, మానవీయత ఏమయ్యాయి అనే ప్రశ్నలు మనని వెంటాడుతాయి. నా మనసు చాలా సేపు గర్భంలో ఉండే పసిపాప మీదికే పోయింది. ఆ అభాగ్యుల ప్రవర్తనను, వారి ఆత్మహత్యా సందర్భాన్ని కొంత లోతుగానే చూడాలి. 


మానవ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని ఒక భయంకరమైన జబ్బు మానవాళిని తరుముతున్నది. ఇది ఒక విచిత్రమైన, విషపూరితమైన జబ్బు. ఇతర రోగాలు మనుషులను దగ్గరికి చేరుస్తాయి. రోగి ఇంట్లో సహాయానికి ఎవరైనా బంధువులు, స్నేహితులు కొంతకాలం ఆదుకోవడానికి రావడం కూడా మనం చూస్తాం. రోగిని చూసి రావడమనేది ఒక సామాజిక విలువగా మనమందరం పాటిస్తున్నాం. మనిషి అస్వస్థతకు గురైతే అతన్ని చూడడానికి, కలవడానికి వచ్చే వారిని అదుపు చేయడమనే సమస్యతో సాయంత్రం వేళల్లో అన్ని హాస్పిటళ్లల్లో సిబ్బంది సతమతమవుతుంటారు. కరోనా జబ్బు అలాంటిది కాదు. ఇది సన్నిహిత స్నేహితుల దగ్గరి నుంచి కుటుంబసభ్యుల దాకా అందరిని వేరుచేస్తోంది. భయపెడుతోంది.


ప్రతి ఎదుటి మనిషిలో ఒక ప్రత్యర్థి ఉన్నాడా అన్న భావనను కల్పిస్తోంది. వనరుల లేమి, అప్పులతో పాటు ఈ భయానక వాతావరణం కూడా మంచిర్యాల రైతు కుటుంబ నిర్ణయాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో తప్పక ప్రభావితం చేసి ఉంటుంది. తన కష్టాలు చెప్పుకోవడానికి ఏ స్నేహితుడి దగ్గరికైనా, బంధువు దగ్గరికైనా పోయే వెసులుబాటు లేదు. ఎవరి ఇంటికి పోదామన్నా ముందు అప్పు కంటే ఈ జబ్బు ఎక్కడ మోసుకొస్తారో అనే అనుమానం, భయం సర్వత్రా వ్యాపించి ఉంది. ఈ భయం మనిషిని ఒంటరి చేసింది. మనిషిలో ఉండే మానవత్వాన్ని కొంత మొరటుగా మార్చిందా అనిపిస్తోంది. రాజకీయ ఆర్థిక వ్యవస్థ కరోనా భయాలను స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నది. ఈ కాలంలో పెరిగినంత అసమానతల తీవ్రత, ప్రకృతి వనరుల విధ్వంసం మునుపెన్నడూ లేదు. 


ఆత్మహత్య ఒక రోగగ్రస్త సమాజ లక్షణం అనే ఒక సూత్రీకరణ ఉంది. ఇప్పుడు అది ఎంత వాస్తవమో తెలుస్తున్నది. సమాజం మానసికంగా అలాగే భౌతికంగా రోగగ్రస్తమై ఉన్నది. చాలా సమాజాలు సంక్షోభాల నుంచి ముందుకు ప్రయాణిస్తూనే ఉన్నవి. ఏ సందర్భంలోనైనా వ్యక్తిగతంగా లేదా, సామూహికంగా భవిష్యత్తు మీద విశ్వాసం మనిషిని నిలబెడుతుంది. ఏదైనా మార్పు జరుగుతుందని, మంచి రోజులు రాకపోతాయా అనే భావన చాలా బలమైంది. ఈ భావన నెలకొనడంలో ఆర్థికవ్యవస్థ, రాజకీయ పాత్ర చాలా కీలకమైనది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. గత ఒక్క సంవత్సరంలో అనేక ఉద్యోగాలు ఊడాయి. కొత్త ఉద్యోగాలు, అవకాశాలు ఏం కనిపించడం లేదు.


ప్రభుత్వాలు సమాజాన్ని ఆదుకుంటాయనే సంక్షేమభావన పూర్తిగా రాజకీయ పరిభాష నుంచి మాయమైపోతున్నది. సంపన్నుల దగ్గర నుంచి ట్యాక్స్‌ల రూపంలో వనరులు సేకరించి, వాటిని మొత్తం సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలి అనే భావనే జాతి వ్యతిరేకతగా భావిస్తున్నారు. ఇవ్వాళ ఆర్థికవ్యవస్థ తాత్విక చింతనే పూర్తిగా మారిపోయింది. సంపన్నులను ముట్టుకుంటే సంపద సృష్టి ఆగిపోతుందనే వాదన పాలకులను ఒక సాలెగూడులోకి నెట్టింది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ‘వేగవంత అభివృద్ధి’కి సామాజిక సంక్షేమానికి మధ్య ఏర్పడిన జటిల వైరుధ్యం నుంచి ఎన్నో పోరాటాలు ఉద్భవిస్తున్నాయి. ఈ వైరుధ్యాన్ని సమాజం ఎలా పరిష్కరించుకుంటుందో వేచి చూడవలసిందే. ఇప్పుడైతే ఈ అభివృద్ధి ఒక ఆందోళనకరమైన దిశలో పోతున్నది.


రాజకీయ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ద్వేషాలను రెచ్చగొట్టి, మనుషులను విభజించి పాలించే ఒక ఒరవడిలో పడిపోయింది. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ సమాజాన్ని నిలువునా చీల్చడానికే ప్రయత్నం చేశాడు. ఇవ్వాళ ఇస్లామిక్‌దేశాలు ఎంత హింసను భరిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. మన దేశంలో కూడా ఒక సంక్షేమ రాజ్యం, మానవీయ సమాజం, నూతన మానవుడు, సమష్టిజీవనం లాంటి ఉదాత్తభావాలు ప్రధానస్రవంతి చర్చల్లో లేవు. ఏ ఆశయాలు చర్చలోనే లేనప్పుడు, ప్రజా ఉద్యమాలు, పోరాటాల మీద బలప్రయోగం పెరిగినప్పుడు మనుషులకు తమ మీద, తమ భవిష్యత్తు మీద విశ్వాసం పోయే ప్రమాదంలో ప్రపంచం ఉంది.


మనుషుల జీవితానికి ఒక బలమైన సాంస్కృతిక పార్శ్వం కూడా ఉంటుంది. పండుగలు, ఉత్సవాలు, గుళ్ళు, పూజలు, యాత్రలు, ఆటలు, సినిమా ఇవన్నీ దాంట్లో భాగం. ఇవి కాక సామాజిక సదస్సులు, చర్చలు, సంగీతం సాహిత్యం లాంటి ప్రక్రియలు జీవన గమనాన్ని వైవిధ్యభరితం చేస్తాయి. మతవిశ్వాసాలు ఒక ఊరట కల్గిస్తుంటాయి. ఈ పరిస్థితి కూడా మారుతున్నది. రాను రాను ప్రధానస్రవంతి రాజకీయాలు మనుషుల మతపర విశ్వాసాలను తమ ప్రయోజనాలకు వాడుకుంటున్నాయి. కరోనా విజృంభణతో పండుగలు, యాత్రలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ తగ్గాయి. మనుషులలో విశ్వాసాలు బలహీనపడితే మరో ప్రత్యామ్నాయ మానవీయ విశ్వాసాలు వాటి స్థానంలో రావాలి. అది జరగకపోతే మనిషి అంతర్గతంగా తన మీద తాను పట్టును కోల్పోతాడు. ఇప్పుడు అదే జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా మానసిక జబ్బులు పెరిగాయనే వార్తలు వస్తూనే ఉన్నవి.


ఆర్థిక భావజాలం, రాజకీయ తాత్వికత, గందరగోళంలో పడ్డ సాంస్కృతిక జీవనం ఉమ్మడిగా మనిషిని మనిషిగా మననీయడం లేదు. ఎవరిని పలకరించినా సంతోషంగా ఉన్నామన్నమాట వినబడడం లేదు. గత తరాలను ఒక ఆశయం, ఒక విశ్వాసం నడిపించింది. విద్యారంగంలో మా బోటివాళ్ళకి చదువు చెప్పడంలో సంతృప్తి, విద్యార్థులు ఎదుగుతుంటే ఒక ఆనందం, నిరంతర ప్రజాస్వామ్య సామాజిక ఉద్యమాలు జీవిత అనుభవంగా మిగిలాయి. కానీ ఇప్పటి తరానికి స్ఫూర్తి పొందడానికి తగిన వాతావరణం కరువయింది. ఇలాంటి కీలక చారిత్రక దశలో కరోనా మానవసమాజం మీద దాడి చేసింది. మనిషిని అంతర్గతంగా బహిర్గతంగా సమాజం నుంచి విడదీసింది. నిజానికి మనుషులు తమ జీవితానికి అర్థాన్ని సమాజ చలనంలోనే వెతుక్కుంటారు. సామూహిక ఉద్యమాలు మనుషులకు కొత్త విశ్వాసాన్ని కలిగిస్తాయి. మనుషులు కలవడమే కష్టమైనప్పుడు జరిగే సదస్సులు కూడా భయంభయంగా జరుగుతున్నాయి. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు ఇంటర్నెట్‌ ద్వారా జరుగుతున్నాయి. భవిష్యత్‌లో కూడా ఇది కొనసాగేలా ఉన్నది. కానీ ఇందులో మనిషి మరో మనిషితో మనసు విప్పి మాట్లాడుకునే సౌకర్యం లేదు. మనుషులు ఒకరితో ఒకరు కలుసుకుని ఆత్మీయంగా పంచుకునే అనుభవానికి ప్రత్యామ్నాయం ఏదీ లేదు. కరోనా తీవ్రత ఎంత పెరిగినా మానవ సంబంధాల నిర్వహణ కోసం ఇరుగు పొరుగు సంబంధాలనైనా పెంచుకునే, ఆత్మీయతతో సమస్యలను కలబోసుకునే పరిస్థితులను ప్రయత్నపూర్వకంగానే మనుషులు కల్పించుకోవాలి.


పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉంటుందని కాదు. మానవ చరిత్ర నిరంతరంగా పరిణామంలో ఉంటుంది. కొన్ని చారిత్రక సందర్భాలలో ఆ చలనం ఆగినట్లుగా, కుంటుబడినట్లుగా కనిపిస్తుంది. మంచిర్యాల సంఘటనలాంటివి ఇలాంటి సంధికాలంలో జరుగుతుంటాయి. సమాజం తిరిగి తన ఉదాత్త విలువలను తప్పక పునరుద్ధరించుకుంటుంది. ఒంటరి మనిషి తన నుంచి తాను బయటపడతాడు. చాలామంది తమతో తాము ఈ పోరాటం చేస్తూనే ఉన్నారు. మనిషి సృజనపరుడు కనుక ఆ పోరాటంలో విజయం సాధిస్తాడు. జ్ఞానం మీదే దాడి జరుగుతున్నా, శాస్త్రీయజ్ఞానం కరోనాను తప్పక కట్టడి చేస్తుంది. ఈ గమనంలోనే సమాజగర్భంలో ఉండే నూతన శిశువు రక్షించబడుతుంది. ప్రపంచీకరణతో ప్రయోజనం పొందుతున్న శక్తులు ప్రపంచంలో కొత్తగా ముందుకు వస్తున్న చైతన్యాన్ని ప్రచారంలోకి రానీయడం లేదు. భారతదేశ రైతాంగ ఆందోళన కల్పిస్తున్న విశ్వాసం సాధారణమైనదేమీ కాదు. ఇలాంటి పరిణామాలు గుణాత్మక పరిణామం పొందుతాయి. ఒక కొత్త భవిష్యత్తు ఆవిష్కరింపబడుతుంది. ఇప్పుడు ప్రపంచానికి ఈ విశ్వాసం ఒక తాత్విక, చారిత్రక అవసరం.


- ప్రొఫెసర్ జి. హరగోపాల్‌

Updated Date - 2021-04-03T05:55:48+05:30 IST