మంచమెక్కిన ఉదయగిరి

ABN , First Publish Date - 2022-09-28T02:48:23+05:30 IST

నియోజకవర్గంలో జ్వరాలు విజృంభించాయి. దుత్తలూరు, వరికుంటపాడు, ఉదయగిరి, సీతారామపురం మండలాల్లో ఏ గ్రామం

మంచమెక్కిన ఉదయగిరి
జ్వరంతో బాధపడుతున్న వృద్ధురాలు

ఫ గ్రామాలను వీడని జ్వరాలు

ఫ వ్యాధి బారిన చిన్నారులు, వృద్ధులు

ఫ ఇతర ప్రాంతాల్లో చికిత్స

ఫ పట్టించుకోని వైద్య సిబ్బంది

ఉదయగిరి రూరల్‌, సెప్టెంబరు 27: నియోజకవర్గంలో జ్వరాలు విజృంభించాయి. దుత్తలూరు, వరికుంటపాడు, ఉదయగిరి, సీతారామపురం మండలాల్లో ఏ గ్రామం చూసినా జ్వరపీడితులు దర్శనమిస్తున్నారు. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు జ్వరంతో మంచంపడుతున్నారు. పలువురికి రోజుల తరబడి జ్వరం ఉండడంతో రక్తకణాలు తగ్గి నెల్లూరు, ఆత్మకూరు, కావలి, వింజమూరు తదితర ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నారు. ఉదయగిరిలోని దిలావర్‌భాయ్‌వీధిలో చిన్నారులు అధికంగా జ్వరం బారినపడ్డారు. ఐదారుమంది చిన్నారులకు రక్తకణాలు తగ్గడంతో నెల్లూరులోని ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు చెన్నైకి తీసుకెళ్లాలని సూచించినట్లు సమాచారం. ఆయా మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన జ్వరపీడితులు ఉదయగిరిలోని ప్రైవేటు వైద్యశాలలకు వచ్చి సెలైన్‌లు కట్టించుకొని వెళుతున్నారు. రోజుల తరబడి జ్వరం తగ్గని వారు చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యసేవలు అందడంలేదని పలువురు వాపోతున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం ఆధ్వానంగా తయారు కావడం, మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమలు విజృంభించి జ్వరాలు బారినపడుతున్నామని పలువురు వాపోతున్నారు. దాదాపు ఒకటిన్నర మాసం నుంచి జ్వరాలు తగ్గకపోయినా వైద్యఆరోగ్య సిబ్బంది పట్టించుకోవడంలే దంటున్నారు.  ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని పలువురు కోరుతున్నారు. 


-----



Updated Date - 2022-09-28T02:48:23+05:30 IST