రూ.1500 కోట్ల సింగరేణి నిధులకు ప్రభుత్వం లెక్కలు చెప్పాలి

ABN , First Publish Date - 2022-08-17T02:38:44+05:30 IST

సత్తుపల్లి మండలంలో సింగరేణి సంస్థ 15 ఏళ్లలో బొగ్గు వెలికి తీసిన దానికి సంబంధించి ఇప్పటి వరకూ రూ.1500 కోట్లు ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయని, ఇవి ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు తెలియజెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్‌ డిమాండ్‌ చేశారు.

రూ.1500 కోట్ల సింగరేణి నిధులకు ప్రభుత్వం లెక్కలు చెప్పాలి
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న మానవతారాయ్‌

నిధుల పక్కదారిపై సీబీఐ విచారణ జరపాలి

టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్‌

సత్తుపల్లి, ఆగస్టు 16: సత్తుపల్లి మండలంలో సింగరేణి సంస్థ 15 ఏళ్లలో బొగ్గు వెలికి తీసిన దానికి సంబంధించి ఇప్పటి వరకూ రూ.1500 కోట్లు ప్రభుత్వ  ఖాతాలో జమయ్యాయని, ఇవి ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు తెలియజెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం వెంగళరావునగర్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌, మినరల్‌ ఫండ్స్‌ ఏటా రూ.120 కోట్లు సింగరేణి సంస్థ ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తోందని, నిధులు ఎటు మళ్లాయో ఎవరి ఖాతాలో జమ య్యాయో సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేసారు. సత్తుపల్లి మండలంలో ఓపెన్‌ కాస్టు బొగ్గు గనుల్లో బాంబు బ్లాస్టింగ్‌ వల్ల వెంగళరావునగర్‌, విరాట్‌నగర్‌, ఎన్టీఆర్‌ నగర్‌, కిష్టారంలో ఇళ్ళు శిథిలమవుతున్నాయని, కొన్ని ఇళ్లు ఇప్పటికే నేలమట్టమయ్యాయన్నారు. ఆయా కాలనీల్లో సిగరేణి వల్ల దెబ్బతిన్న ఇళ్ల యజమానులకు రూ.పది లక్షల చొప్పున మంజూరు చేయాలని కోరారు. ఏళ్ళ తరబడి ఇళ్ల యజమానులు ఇబ్బందులు పడుతూంటే ఎమ్మెల్యే అధికార పార్టీలోకి మారిన తరువాత కూడా ప్రభావిత కాలనీ ప్రజలకు న్యాయం చేయలేదని ఆరోపించారు. ఇప్పటి వరకూ ప్రశ్నించే వారు లేకపోవటంతో అధికార పార్టీ నాయకుల బెదిరింపులు కొనసాగాయని, ఇకముందు సాగవని అన్నారు. సింగరేణి ఓపెన్‌కాస్టు బాధితుల తరఫున కాంగ్రెస్‌ ఆద్వర్యంలో ఆందోళనలు చేపట్టగానే అధికార పార్టీ నాయకులు  తిరిగి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభావిత ప్రాంత సమస్యల పరిష్కారానికి ఈ నెల 18 నుంచి తాను నిరవఽధిక నిరాహార దీక్ష చేయనున్నామని, పోలీసులు అడ్డంకులు సృష్టిస్తే  ఆందోళన తీవ్రతరం చేస్తామని అన్నారు. విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు రావి నాగేశ్వరరావు, గాదిరెడ్డి సుబ్బారెడ్డి, గాదె చెన్నకేశవరావు, ఫజల్‌బాబా, సమద్‌, మామిళ్ల సత్యనారాయణ, సలీం, రాంచందర్‌, మానుకోట ప్రసాద్‌, వాసు, యోహాన్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-17T02:38:44+05:30 IST