మాట్లాడుతున్న పౌరసమితి సభ్యులు
వెంకటగిరి(టౌన్), జనవరి 19: ఆర్టీసీ బస్సులను పాత బస్టాండ్‌లో నిలపాలన్న డిమాండ్‌తో ఈ నెల 21న మానవహారం నిర్వహిస్తున్నట్లు పౌరసమితి సభ్యులు బీకే ప్రసాద్, రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వి.వి. రమణయ్య తెలిపారు. బుధవారం స్థానిక పాతబస్టాండ్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులను యఽథావిధిగా పాతబస్టాండ్ మీదుగా నడపాలన్నారు. పాత బస్టాండ్‌లో ఆక్రమణలు తొలగించి ప్రయాణికుల కోసం బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమస్యపై మూడు నెలలుగా పోరాడుతున్నా పరిష్కారం కాలేదన్నారు. ఎమ్మెల్యే వేసిన రెండు కమిటీలు కూడా క్షేత్ర స్థాయి పరిశీలన చేయకనే అసంబద్ధమైన నిర్ణయం చేసి చేతులు దులుపుకున్నాయని విమర్శించారు. ప్రయాణికుల సమస్యలను కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. కొందరి వ్యక్తిగత ప్రయోజనాలకోసమే బస్సులను మళ్లించారని ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ఈ సమస్యపై శుక్రవారం ఉదయం 10గంటలకు పాత బస్టాండ్‌లో నల్ల రిబ్బన్లు, మాస్కులు ధరించి మానవహారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ చిన ఓబయ్య, తారక రామయ్య, మునిరాజా తదితరులు పాల్గొన్నారు.