మనసెందుకో సున్నితం

ABN , First Publish Date - 2021-08-30T05:58:25+05:30 IST

మొదటిసారి వేడి తగిలినపుడు వేళ్ళు చురుక్కుమన్నాయి వయసు పెరిగేకొద్దీ చర్మం ముదిరిందో అలవాటయిందో తట్టుకునే శక్తి పెరిగిందో...

మనసెందుకో సున్నితం

మొదటిసారి వేడి తగిలినపుడు

వేళ్ళు చురుక్కుమన్నాయి

వయసు పెరిగేకొద్దీ 

చర్మం ముదిరిందో

అలవాటయిందో

తట్టుకునే శక్తి పెరిగిందో

ఇపుడు అమాంతం 

వేడి గిన్నెను దించగలను


మొదటి అడుగు సున్నితంగా

ముల్లు తగిలినా రాయి తగిలినా

నొప్పితో తడబడింది

ఎముక ముదిరిందో

అవసరాల అనివార్యతో

ఇపుడు ముళ్లపై నడవగలను

కంకరపై పడుకోగలను

అనుభవం పెరిగేకొద్దీ

అన్నీ తట్టుకున్న ఈ శరీరంలోని

మనసెందుకనో అందుకు భిన్నం


అమ్మ తిట్టినపుడు 

ఏడ్చి మరిచిపోయా

మళ్ళీ అమ్మా అన్నాను

దోస్తు కొట్టినప్పుడు దెబ్బలాడి

మరిచిపోయాను

మళ్ళీ ఆడుకున్నాను

సార్‌ కొట్టినప్పుడు 

వెక్కి వెక్కి ఏడ్చిన 


ఇప్పుడెందుకో

గుట్టలుగా పేరుకున్న దుఃఖం

ఉబికి రానేరాదు

గుండెలో భారం తగ్గనే తగ్గదు


మనసు చేతికి దొరికితే బాగుండు

ముండ్లు గుచ్చో 

సెగ తగిలించో

రాతితో బాదో

గట్టిపడేసేదాన్ని

వయసు పెరిగేకొద్దీ

ఈ మనసెందుకో

మరింత సున్నితమవుతుంది

బి. అంజనీ దేవి

98498 75082

Updated Date - 2021-08-30T05:58:25+05:30 IST