మనసంతా..హనుమంత

ABN , First Publish Date - 2022-05-26T06:29:33+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో బుధవారం పెద్ద హనుమాన్‌ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.

మనసంతా..హనుమంత
అంజన్నకు ఊయల సేవ నిర్వహిస్తున్న అర్చకులు

 కొండగట్టు అంజన్నకు భక్తజన హారతి

 అంజన్నను దర్శించుకున్న లక్షన్నరకు పైగా భక్తులు

 ఘనంగా పెద్ద హనుమాన్‌ జయంతి

మల్యాల, మే 25: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో బుధవారం పెద్ద హనుమాన్‌ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జయంతి సందర్భంగా తరలివచ్చిన భక్తజన కోటితో కొండగట్టు కిక్కి రిసింది. రామ లక్ష్మణ జానకీ జై.. బోలో హనుమాన్‌ కీ...,రామ భక్త హనుమాన్‌ కీ జై.. అనే అంజన్న దీక్షాపరుల సంకీర్తనలు కొండగట్టు క్షేత్రంను ఆవహించాయి. దీంతో శ్రీ ఆంజనేయ స్వామి పరిసరాలు భక్తి పారవశ్యంతో పులకించాయి. కొండపైన ఎటు చూసినా రామనామ సంకీర్తనలతో కొండంతా మారుమోగింది. లక్షలాదిగా తరలివచ్చిన అంజన్న దీక్షాపరుల జై భోలో హనుమాన్‌ సంకీర్తనలతో అంజన్న సన్నిధానం పులకించిపోయింది. రామదండును తలపించేలా మంగళవారం రాత్రి నుంచి వచ్చిన అంజన్న దీక్షాపరులతో కొండగటు క్షేత్రం కాషాయవర్ణాన్ని పులుము కుంది. మంగళవారం రాత్రి నుంచి దాదాపు లక్షకు పైగా వచ్చిన అంజన్న దీక్షాప రులతో కొండంతా కిక్కిరిసిపోయింది. అంజన్న దీక్షాపరులు కొండపైకి చేరుకుని, కల్యాణ కట్టలో దీక్షలు విరమించారు.  

ఫఘనంగా పెద్ద హనుమాన్‌ జయంతి

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో బుధవారం పెద్ద హనుమాన్‌ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతియేటా వైశాఖ బహుళ దశమి సందర్భంగా నిర్వహించే పెద్ద హనుమాన్‌ జయంతిని బుధవారం నిర్వహించారు. అంజన్న సన్నిధిలో ఉదయం 3 గంటలకు తిరుమంజనం, ద్రావిడ ప్రబంధ పారా యణములు, విశేష అభిషేకం, తులసీ అర్చన, శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలంకరణ, సహస్ర నాగవల్లి, అర్చన, హోమం, మహా పూర్ణాహుతితో పాటు ఊయల సేవను ఘనంగా నిర్వహించారు. యాగశాలలో త్రైయాహ్నిక, త్రికుండాత్మక యజ్ఞాలను వేద పండితులు, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో వెంకటేశ్‌, ఎఫ్‌.టీ మారుతీస్వామి, ఏఈవో బుద్ధి శ్రీనివాస్‌, ఆలయ స్థానాచార్యులు తిరుక్కోవెల కపీంధర్‌, ప్రధాన అర్చకులు, ఉపప్రధానర్చకులు, జడ్పీటీసీ రామ్మోహ న్‌రావు, స్థానిక సర్పంచ్‌ తిరుపతిరెడ్డి, ఆలయ పాలకమండలి సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొండపైన ఏర్పాట్లను  ఎస్పీ సంధూశర్మ పోలీస్‌ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. 


Updated Date - 2022-05-26T06:29:33+05:30 IST