మానని గాయం.. అందని సాయం!

ABN , First Publish Date - 2021-10-11T04:11:01+05:30 IST

మానని గాయం.. అందని సాయం!

మానని గాయం.. అందని సాయం!
తితలీ తుఫాన్‌ ప్రభావంతో నేలకొరిగిన కొబ్బరిచెట్లు (ఫైల్‌)

- తితలీ విలయానికి నేటితో మూడేళ్లు

- ఇంకా కోలుకోని ఉద్దానం ప్రాంతం

- అదనపు పరిహారాన్ని మరచిన ప్రభుత్వం

- నేడు అక్కుపల్లిలో బాధితులకు మద్దతుగా దీక్ష

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి/వజ్రపుకొత్తూరు)

తితలీ తుఫాన్‌ విలయానికి నేటితో మూడేళ్లు పూర్తయింది. 2018 అక్టోబరు 11న తితలీ తుఫాన్‌ సృష్టించిన విధ్వంసం.. మానని గాయంగా మిగిలింది. బాధితులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రభుత్వ సాయం అందని పరిస్థితి నెలకొంది. తితలీ తుఫాన్‌ దెబ్బకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో వేలాది ఎకరాల్లో కొబ్బరి,  మామిడి, జీడిమామిడి తోటలు ధ్వంసమయ్యాయి. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఒక్కో కొబ్బరిచెట్టుకు రూ.1,500, జీడిమామిడి తోటలకు హెక్టారుకు రూ.30వేలు చొప్పున బాధితులకు చెల్లించింది. ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో.. తాము అధికారంలోకి వస్తే తితలీ బాధితులకు అదనపు పరిహారం అందజేస్తామని ప్రకటించారు. కొబ్బరిచెట్టుకు రూ.1500, జీడితోటకు రూ.20వేలు చొప్పున అదనంగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అదనపు పరిహారం కోసం 86,840 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అనర్హులు కూడా ఉండడంతో రెవెన్యూ, ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులు మరోసారి విచారణ చేపట్టారు. అర్హుల జాబితాను 71,765కు కుదించారు. బాధిత రైతులకు రూ.170.50 కోట్లు అవసరమని ప్రభుత్వానికి పాలకులు నివేదిక పంపారు. జీడి పంటలకు సంబంధించి రూ.27.55 కోట్లు, కొబ్బరి చెట్లకు రూ.142.95 కోట్లు పరిహారం చెల్లించాల్సి ఉందని నివేదికలో పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు అదనపు పరిహారాన్ని మంజూరు చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఖాతాలో త్వరలో పరిహారం నిధులు జమచేస్తామని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు కూడా పలు సభల్లో ప్రకటించినా.. ఆచరణకు నోచుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కనీసం దసరా నాటికైనా పరిహారం అందజేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా,  పరిహారం పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సోమవారం వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష దీక్ష చేయనున్నారు. ఈ విషయాన్ని వజ్రపుకొత్తూరు మండల టీడీపీ నాయకుడు బి.శశిభూషన్‌ స్పష్టం చేశారు.   


వెంటాడుతున్న కష్టాలు

తితలీ తుఫాన్‌ సృష్టించిన విలయాన్ని ఉద్దాన ప్రాంత వాసులు నేటికీ మరచిపోలేకపోతున్నారు. మూడేళ్లుగా బాధితులను ఆర్థిక కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తుఫాన్‌ ప్రభావంతో పలాస, టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో వేలాది కొబ్బరి, మామిడి, జీడి మామిడి, పనస చెట్లు నేలకొరిగాయి. దీంతో బాధితులకు తీవ్ర నష్టం వాటిల్లి.. బతుకు దుర్భరంగా మారింది. చాలామంది జీవనాధారం కోల్పోయారు. కొందరు అప్పులబారిన పడ్డారు. ప్రభుత్వం నుంచి పరిహారం కూడా సక్రమంగా అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఉపాధి కోసం వలసబాట పట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-11T04:11:01+05:30 IST