నిర్వహణ లోపం - ర్యాగింగ్‌కు బీజం

ABN , First Publish Date - 2022-01-04T05:56:31+05:30 IST

వారంతా ఉన్నత చదువులు చదువుతున్న వారే.. అయినా కించిత్‌ సంస్కా రం లేదు.. వారు అదుపు తప్పకుండా చూడాల్సిన వారేమో ఆ బాధ్యత మరిచారు. దీంతో తోటి విద్యార్థి అని చూడకుండా ర్యాగింగ్‌కు పాల్పడ్డారు.

నిర్వహణ లోపం - ర్యాగింగ్‌కు బీజం
సూర్యాపేటలో బాలుర విద్యార్థుల కోసం కేటాయించిన హాస్టల్‌

మెడికల్‌ కళాశాలలో ర్యాగింగ్‌ కలకలం 

ఫస్టియర్‌ విద్యార్థిపై సెంకడియర్‌ విద్యార్థుల దాష్టీకం

వారంతా ఉన్నత చదువులు చదువుతున్న వారే.. అయినా కించిత్‌ సంస్కా రం లేదు.. వారు అదుపు తప్పకుండా చూడాల్సిన వారేమో ఆ బాధ్యత మరిచారు. దీంతో తోటి విద్యార్థి అని చూడకుండా ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. శారీరకంగా వేధించారు. గంటల కొద్దీ హాస్టల్‌లో ఈ తతంగం సాగుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ ఘటనలో హాస్టల్‌ నిర్వాహకుల లోపం స్పష్టంగా కనిపిస్తోంది. నిర్వాహకుల నిర్లక్ష్యమే ర్యాగింగ్‌కు దారితీసిందన్న వాదనా వినిపిస్తోంది.

   (ఆంధ్రజ్యోతి- సూర్యాపేట)

సూర్యాపేట జిల్లా కేంద్రం మామిళ్లగడ్డలోని మెడికల్‌ కళాశాల హాస్టల్‌లో పర్యవేక్షణ కరువైంది. దీంతో విద్యార్థుల్లోని ఆకతాయిలు రెచ్చిపోయారు. జనవరి 1వ తేదీ రాత్రి 8 గంటలకు తోటి విద్యార్థి అని చూడకుండా ర్యాగింగ్‌ చేసి రాక్షసానందం పొందారు. గంటలకొద్దీ ఈ ఉదంతం చోటుచేసుకుంటున్నా నిర్వాహకులు ఏం చేస్తున్నారో తెలియదు. డిసెంబరు 31, జనవరి ఒకటిన విద్యార్థులు సంబురాల్లో మునిగి తేలినా హాస్టల్‌ నిర్వాహకులు ఏమీ పట్టనట్టు వ్యవహరించారు.  హాస్టల్‌లోకే నేరుగా మద్యం బాటిళ్లు తెచ్చుకున్నా, సిగరెట్లు తాగుతున్నా పట్టించుకున్న వారే కరువయ్యారు. దీంతో విద్యార్థుల ఆకతాయి చేష్టలు మితిమీరి మొదటి సంవత్సరం విద్యార్థి సాయికుమార్‌ ప్రాణం మీదకు తెచ్చినట్లయింది. బాధిత విద్యార్థి ఆత్మహత్య చేసుకుందామనుకునే స్థాయిలో విద్యార్థుల దాష్టీకం కొనసాగింది. 

గతంలోనూ గొడవలు

కళాశాలలో ర్యాగింగ్‌ వంటి సంఘటనలు చోటు చేసుకోకుండా యాంటీ ర్యాగింగ్‌ కమిటీని నియమించా రు. ఈ కమిటీ తరచూ విద్యార్థులను సంప్రదించడం, ఎవరైనా ర్యాగింగ్‌ పాల్పడుతున్నారా అని పరిశీలించా ల్సి ఉంటుంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారించి, సంబంధిత విద్యార్థులపై చర్యలకు సిఫారసు చేయాల్సి ఉంటుంది. అయితే సూర్యాపేట మెడికల్‌ కళాశాల, వసతి గృహాల్లో విద్యార్థుల ప్రవర్తన పై యాంటిర్యాగింగ్‌ కమిటీ సభ్యుల పర్యవేక్షణ కొరవడింది. కొన్నాళ్ల క్రితం హాస్టల్‌లో విద్యార్థుల మఽధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ సందర్భంలో యాంటీ ర్యాగింగ్‌ కమిటీ సభ్యులు విద్యార్థులందరితో సమావేశం ఏర్పాటు చేసి మరోసారి పునరావృతం కావొద్దని హెచ్చరించి వదిలేశారు. ఈ కమిటీ తూతూ మంత్రంగా పర్యవేక్షిస్తుండడంతో విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.

హాస్టల్‌లో సగం మంది... 

సూర్యాపేట మెడికల్‌ కళాశాల 2020-21లో 150 అడ్మిషన్లతో ప్రారంభమైంది. సొంత భవనం లేకపోవడంతో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి వెనుక భాగాన ఉన్న పాలిటెక్నిక్‌ కళాశాలలో మొదటి సంవత్సరం తరగతులు నిర్వహించారు. ప్రస్తుతం బాలికలకు పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలకు చెందిన వసతిగృహాన్ని కేటాయించారు. బాలురకు మాత్రం మామిళ్లగడ్డలోని రాజ్‌బహుదూర్‌ వెంకటరాంరెడ్డి హాస్టల్‌లో వసతి కల్పించారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 60 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 55 మంది మొత్తం 115 మంది. కాగా సగం మంది విద్యార్థులు మాత్రమే హాస్టల్‌లో ఉంటున్నారు.

వారంతా ఏమయ్యారు

సాయికుమార్‌పై ర్యాగింగ్‌ ఉదంతంతో హాస్టల్‌ నిర్వహణ లోపంపై ప్రశ్న లు మొదలయ్యాయి. గంటల కొద్దీ తోటి విద్యార్థిని ర్యాగింగ్‌ చేస్తున్నా నిర్వాహకులు, నైట్‌ వాచ్‌మెన్‌, సిబ్బంది ఎక్కడికి వెళ్లారన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. విద్యార్థులు ఇష్టానుసారం హాస్టల్‌కు వచ్చి వెళ్తుంటారని సమాచారం. మద్యం, సిగరేట్లు తాగుతున్నా పట్టించుకున్న వారేలేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తోటి విద్యార్థులు కూడా ర్యాగింగ్‌ను నిలువరించలేకపోయారని తెలిసింది.

 ఐదుగురిపై కేసు నమోదు

సాయికుమార్‌పై వేధింపులకు పాల్పడ్డ విద్యార్థులు శ్రవణ్‌, చాణక్య, సోహెబ్‌, ఇన్సా్‌ఫఖాన్‌, షాబద్‌లపై పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. ఐపీసీ 342, 323, 352, 504, 506 దీంతో పాటు పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. 

ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తాం

ర్యాగింగ్‌ వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. ఘటనపై కమిటీ కూడా వేశాం, విచారణ చేపడుతున్నాం. నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం. ర్యాగింగ్‌ పర్యవసానాలపై అవగాహన కల్పిస్తాం. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి. 

- విజయలక్ష్మి, కళాశాల ప్రిన్సిపాల్‌

Updated Date - 2022-01-04T05:56:31+05:30 IST