చిట్టీల పేరిట కుచ్చుటోపీ

ABN , First Publish Date - 2022-08-17T05:57:10+05:30 IST

ఓ చిట్టీల వ్యాపారి వందలాది మందిని వంచించాడు. కోట్లాది రూపాయలు వసూలు చేసి.. బోర్డు తిప్పేశాడు.

చిట్టీల పేరిట కుచ్చుటోపీ
మంగళగిరి రూరల్‌ పోలీసు స్టేషన్‌ వద్ద ఆందోళన చేస్తున్న బాధితులు

వందలాది మందికి రూ.కోట్లలో ఎగవేత

మోసగాడిపై తిరగబడ్డ బాధితులు

మంగళగిరి రూరల్‌  పోలీస్‌స్టేషన్‌ ముట్టడి

మంగళగిరి సిటీ, ఆగస్టు16: ఓ చిట్టీల వ్యాపారి వందలాది మందిని వంచించాడు. కోట్లాది రూపాయలు వసూలు చేసి.. బోర్డు తిప్పేశాడు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్‌ను  ముట్టడించారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన పుట్టా వెంకటేశ్వరరావు ఇరవై ఏళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. తన వద్ద చిట్టీలు కట్టిన వారి దగ్గరే డబ్బులు తీసుకుని వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. గతంలో ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసిన ఆయన చిట్టీలు, వడ్డీ వ్యాపారం లాభదాయకంగా వుండడంతో ఆ ఉద్యోగం వదిలేశాడు. దాదాపు 800 మంది నుంచి ఒక్కొక్కరి ద్వారా రూ.పది లక్షల నుంచి రూ.30 లక్షల వరకు నగదు తీసుకుని వడ్డీలకు తిప్పుతూ వచ్చిన కిస్తీని నెలవారీ చిట్టీకి జమ చేస్తున్నట్టు నమ్మించాడు. అధిక ఆదాయం వస్తుందన్న ఆశతో ఉన్నత ఉద్యోగులు సైతం అతడికి పెద్ద మొత్తంలో చిట్టీలు కట్టారు. గత రెండేళ్లుగా చిట్టీ సొమ్ముల కోసం సభ్యులు ఒత్తిడి పెంచడంతో వెంకటేశ్వరరావు గతేడాది డిసెంబరులో ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యుల సహా కనిపించకుండా వెళ్లిపోయాడు. బాధితులు  మంగళగిరి రూరల్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. చిట్‌ఫండ్‌ యాక్ట్‌, వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు బెయిల్‌ తెచ్చుకుని గ్రామానికి వచ్చాడు. విషయం తెలుసుకున్న బాధితులు, గ్రామస్తులు తమ డబ్బులు తిరిగివ్వాలని నిలదీశారు. దీంతో వెంకటేశ్వరరావు నెల రోజుల సమయం కోరాడు. సోమవారం నాటికి గడువు ముగియడంతో బాధితులు మరోమారు వెంకటేశ్వరరావును నిలదీశారు. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు తిరగబడడంతో బాధితుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. వెంకటేశ్వరరావు కుమారుడు శ్రీనివాసరావు ఇంటిపై దాడిచేశారు. కొందరు బాధితులు శ్రీనివాసరావును కిడ్నాప్‌ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. దీంతో వెంకటేశ్వరరావు పోలీసులను ఆశ్రయించడంతో కుమారుడ్ని వదిలిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు బాధితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బాధితులు మరోమారు ఆగ్రహావేశాలకు గురయ్యారు. తమకు న్యాయం చేయకపోగా, తమపైనే కేసులు పెడతారా అంటూ మంగళగిరి రూరల్‌ పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. ఒకానొక దశలో మహిళలు స్టేషన్‌లోనికి చొచ్చుకువచ్చి చిట్టీల వ్యాపారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. రూరల్‌ సీఐ భూషణం, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌రెడ్డిలు బాధితులను నిలువరించి సర్ది చెప్పారు. పెద్దఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నారని, ఆ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేయాలని  బాధితులు డిమాండ్‌ చేశారు. కాగా, ఈ విషయమై రూరల్‌ సీఐ భూషణం స్పందిస్తూ మొత్తం 400 మంది బాధితులు ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదుల మేరకు రూ.3 కోట్ల మేర బాధితులకు చెల్లించవలసి వున్నట్టు గుర్తించామని తెలిపారు.  


Updated Date - 2022-08-17T05:57:10+05:30 IST